Begin typing your search above and press return to search.

మెగా అల్లుడి 'సూపర్ మచ్చి' ట్రైలర్ వచ్చేసింది..!

By:  Tupaki Desk   |   12 Jan 2022 5:38 AM GMT
మెగా అల్లుడి సూపర్ మచ్చి ట్రైలర్ వచ్చేసింది..!
X
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ 'విజేత' సినిమాతో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. తొలి చిత్రంతో పర్వాలేదనిపించిన కళ్యాణ్.. ఇప్పుడు ''సూపర్ మచ్చి'' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. పులి వాసు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో రచిత రామ్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

''సూపర్ మచ్చి'' చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా థియేట్రికల్ ట్రైలర్ ను మేకర్స్ ఆవిష్కరించారు. 'చూడకుండా లవ్ చేసుకోవడం అనే కాన్సెప్ట్ చాలా బాగుంది.. ఇందులో ఏదో తెలియని ఫీల్ ఉంది' అనే డైలాగ్ తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.

రాజు సార్ ఐ లవ్ యూ అంటూ కళ్యాణ్ దేవ్ ప్రేమ కోసం హీరోయిన్ పరితపిస్తుండగా.. కొన్ని కారణాల వల్ల హీరో ఆమె ప్రేమను అంగీకరించడం లేదని తెలుస్తోంది. అయినప్పటికీ ఆమె తన ప్రేమను వ్యక్తపరచడం ఆపలేదు. అదే సమయంలో హీరోలోని మరో కోణాన్ని చూపించారు. బయటకు రఫ్‌ గా కనిపిస్తూనే.. లోపల సెన్సిటివ్‌ గా ఉండే పాత్ర అని తెలుస్తుంది. అయితే అతని వల్ల ఫ్యామిలీకి ఏవో ఇబ్బందులు వచ్చినట్లు కనిపిస్తుంది.

ఈ క్రమంలో రచిత ప్రేమలో పడ్డ కళ్యాణ్.. రాముడుగా మారుతాడా లేదా అనేది ఈ ట్రైలర్ లో చూపించారు. 'సూపర్ మచ్చి' చిత్రాన్ని లవ్ అండ్ యాక్షన్ అంశాలు కలబోసి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందించినట్లు అర్థం అవుతుంది. ఇందులో కళ్యాణ్ దేవ్ పోనీటైల్‌ తో స్టైలిష్ లుక్‌ లో కనిపించాడు. కాకపోతే అతనికి వేరే వారితో డబ్బింగ్ చెప్పించినట్లు తెలుస్తోంది. 'ప్రయాణం ఆపేస్తే.. గమ్యానికి విలువ ఏముంది' వంటి డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.

'సూపర్ మచ్చి' సినిమాకి ఎస్ థమన్ సంగీతం సమకూర్చారు. శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ అందించగా.. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ వర్క్ చేశారు. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఇందులో రాజేంద్రప్రసాద్ - అజయ్ - పృథ్వీరాజ్ - పోసాని కృష్ణ మురళి - ఫిష్ వెంకట్ - రంగస్థలం మహేష్ ఇతర పాత్రలు పోషించారు. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రిజ్వాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.