Begin typing your search above and press return to search.

సోగ్గాడు రిజెక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమాలు..!

By:  Tupaki Desk   |   27 May 2021 5:30 PM GMT
సోగ్గాడు రిజెక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమాలు..!
X
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ - ఏఎన్నార్ - కృష్ణ వంటి హీరోలకు ధీటుగా నిలబడ్డారు అలనాటి హీరో శోభన్ బాబు. తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని సోగ్గాడిగా నిలిచిపోయారు. మూడున్నర దశాబ్దాల పాటు ఆడియన్స్ ని అలరించిన శోభన్ బాబు.. హీరోగా నటిస్తూనే సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన ఏకైక హీరో అని చెప్పవచ్చు. అభిమానులు మనసుల్లో సోగ్గాడిగానే ఉండిపోవాలని నిర్ణయించుకున్న శోభన్ బాబు.. అనేక సినిమాలలో కీలక పాత్రలను రిజెక్ట్ చేసారు. అలా సోగ్గాడు తిరస్కరించిన కొన్ని సూపర్ హిట్ సినిమాల గురించి తెలుసుకుందాం!

అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన భక్తిరస చిత్రం ''అన్నమయ్య''. ఈ సినిమాలో శ్రీ వేంకటేశ్వర స్వామి పాత్రకు ఎంతటి ప్రాధాన్యత ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ముందుగా ఈ పాత్ర కోసం శోభన్ బాబును అనుకున్నారట. కానీ ఆయన ఈ పాత్రను సున్నితంగా తిరస్కరించడంతో చివరకు సుమన్ దగ్గరికి వెళ్లింది. ఆ పాత్ర సుమన్ కు ఎంతటి పేరు తెచ్చి పెట్టిందో తెలిసిందే.

పవన్ కళ్యాణ్ హీరోగా భీమినేని శ్రీనివాస రావు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ''సుస్వాగతం''. ఇందులో హీరో తండ్రి క్యారెక్టర్ ను రఘువరన్ పోషించారు. రఘువరన్ కు ఈ సినిమా కొత్త ఇమేజ్ ని తెచ్చిపెట్టింది. అయితే నిర్మాత ఆర్.బి.చౌదరి ముందుగా ఈ పాత్ర కోసం శోభన్ బాబుని అనుకున్నారట. కానీ ఆయన చేయనని చెప్పేశారట.

అలానే మహేష్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన ''అతడు'' సినిమాలో కూడా శోభన్ బాబు కు ఓ రోల్ ఆఫర్ చేశారట. అదే నాజర్‌ పోషించిన హీరో తాత సత్యనారాయణ మూర్తి పాత్ర. శోభన్ బాబుతో ఉండే సాన్నిహిత్యంతో నిర్మాత మురళీ మోహన్ ఆ క్యారక్టర్ కోసం ముందుగా ఆయన్ని సంప్రదించారట. దీని కోసం శోభన్ బాబుకు బ్లాంక్ చెక్ కూడా ఇస్తానని అన్నారట. కానీ శోభన్ బాబు మాత్రం ససేమిరా అన్నారట.

ఇలా ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేసిన శోభన్ బాబు చివరకు కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించేందకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వి.బి.రాజేంద్ర ప్రసాద్ నిర్మాణంలో కృష్ణ - శోభన్ బాబు - జగపతి బాబులతో ఈ మల్టీస్టారర్ మూవీ చేయడానికి ముహూర్తం కూడా అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళలేదు.