Begin typing your search above and press return to search.

'గని'లో సునీల్ శెట్టి .. ఉపేంద్ర ఇంట్రెస్టింగ్ రోల్స్!

By:  Tupaki Desk   |   14 Nov 2021 12:30 PM GMT
గనిలో సునీల్ శెట్టి .. ఉపేంద్ర ఇంట్రెస్టింగ్ రోల్స్!
X
వరుణ్ తేజ్ హీరోగా 'గని' సినిమా రూపొందింది. ఈ సినిమాతో కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అల్లు బాబీ .. సిద్ధు ముద్ద ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఈ పాత్రకి అవసరమైన ఫిట్ నెస్ కోసం వరుణ్ తేజ్ గట్టిగానే కసరత్తు చేశాడు. అంతేకాదు విదేశాలకి వెళ్లి బాక్సింగ్ లో కొంతకాలం శిక్షణ కూడా తీసుకున్నాడు. నిజంగానే వరుణ్ తేజ్ ఫిజికల్ గా తన బాడీలో మంచి మార్పు తీసుకొచ్చాడు. నిజంగా బాక్సర్ లానే కనిపిస్తున్నాడు.

ఇక దర్శక నిర్మాతలకు మాత్రమే కాదు, సయీ మంజ్రేకర్ కి కూడా తెలుగులో ఇదే మొదటి సినిమా. ఇది వరుసగా బాక్సింగ్ పోటీలతో నడిచే కథ కాదు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ అనేవి బాక్సింగ్ చుట్టూ అల్లుకుని కనిపిస్తాయి. ఈ సినిమాలో జగపతిబాబు ఒక కీలకమైన పాత్రను పోషించాడు. సునీల్ శెట్టి .. ఉపేంద్ర ఇతర ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 3వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఈ సినిమా ప్రమోషన్స్ పుంజుకుంటున్నాయి.

ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలను పరిచయం చేస్తూ .. అందుకు సంబంధించిన లుక్స్ తో పోస్టర్లను ను రిలీజ్ చేస్తూ వెళుతున్నారు. అలా తాజాగా సునీల్ శెట్టి - ఉపేంద్రలు ఈ సినిమాలో విక్రమాదిత్య - విజయేంద్ర సిన్హా పాత్రలను పోషిస్తున్నట్టు చెబుతూ, వారి లుక్స్ ను ఒక పోస్టర్ గా వదిలారు. ప్రత్యేకమైన గెటప్పులు లేకపోయినా, రాజుల కాలం నాటి పేర్లు మాత్రం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇటు కన్నడలో ఉపేంద్ర .. అటు బాలీవుడ్ లో సునీల్ శెట్టి ఇద్దరూ కూడా స్టార్ హీరోలుగా ఒక వెలుగు వెలిగినవారే. తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్నవారే.

కథాకథనాల సంగతి అలా ఉంచితే .. భారీతారాగణం ఉంది. టీజర్ తో ఈ సినిమాపై అంచనాలు పెంచే సన్నాహాలు మొదలైపోయాయి. రేపు ఈ సినిమా నుంచి టీజర్ ను వదలనున్నారు. అధికారికంగా కొన్ని రోజుల క్రితమే ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ సినిమాతో తనకి మరో హిట్టు పడుతుందనే నమ్మకంతో వరుణ్ తేజ్ ఉన్నాడు. ఇక ఈ డిసెంబర్లో ఈ సినిమా వస్తుండగా, వచ్చే ఏడాదిలో ఆయన 'ఎఫ్ 3' సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఆ తరువాత ప్రాజెక్టు వెంకీ కుడుములతో ఉండనున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.