Begin typing your search above and press return to search.

పిల్లోడు.. ఊపిరి తీసుకోనీ.. ఈ చెత్తమాటలేంది?

By:  Tupaki Desk   |   4 Oct 2021 5:31 AM GMT
పిల్లోడు.. ఊపిరి తీసుకోనీ.. ఈ చెత్తమాటలేంది?
X
నెత్తి మీదకు 23 ఏళ్లు వచ్చిన తర్వాత కూడా పిల్లాడే అవుతాడా? ఈ లెక్కన పెద్దోడు కావటానికి యాభై ఏళ్లు పడుతుందా? ఇంతకు పెద్దోడు అయ్యేది ఏ వయసుకు? పిల్లోడు ఎంత వయసు వరకు? లాంటి సందేహాలు బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి మాటల్ని విన్నంతనే అనిపించక మానదు. తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ను డ్రగ్స్ తో పాటు పట్టుబడటం.. అతనితో పాటు మరో ఏడుగురిని అధికారులు అరెస్టు చేశారు. రేవ్ పార్టీ కోసం క్రూయిజ్ లో ప్రయాణిస్తున్న వారిని ఏడు గంటల పాటు దాదాపు 1500 మందికి పైనే సోదాలు చేసిన తర్వాత.. పలువురు ప్రముఖుల పిల్లల్ని అదుపులోకి తీసుకున్నారు.

ఈ వ్యవహారం సంచలనంగా మారింది. షారుక్ కొడుకు దుస్తుల్లో డ్రగ్స్ ఉన్న వైనం.. అందరిని ఉలిక్కిపడేలా చేసింది. దీనికి సంబంధించిన వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నవేళ.. బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి స్పందించారు. ‘ఆ పిల్లాడిని కాస్త ఊపిరి తీసుకోనివ్వండి’ అంటూ చేసిన వ్యాఖ్యపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్యన్ ఖాన్ అరెస్టు మీద స్పందించిన ఆయన.. వాస్తవాలు బయటకు రానివ్వండి.. బాధ్యతగా వ్యవహరిద్దామంటూ సుద్దులు చెప్పే మాటలకు ఒళ్లు మండాల్సిందే.

అదే బాధ్యత షారుక్ కొడుక్కి ఉండి ఉంటే.. ఈ రోజున ఇంత ఇబ్బంది ఉండేది కాదు.. సునీల్ శెట్టి లాంటి వాళ్లు మాట్లాడేవారు కాదు. చూస్తుంటే.. డ్రగ్స్ తో పట్టుబడినా తప్పు చేయలేదని.. చిన్న పిల్లాడని వెనకేసుకురావటం లాంటివి ప్రముఖల పిల్లల్ని ఎంత గారం చేస్తారో అర్థమవుతుంది. తప్పు చేస్తే గట్టిగా నిలదీయాలి? బుద్ది తెచ్చుకోవాలని మిగిలిన వారికి హెచ్చరికలు చేయాల్సింది పోయి.. వాస్తవాల్ని చూపించే వారిని నిలువరించేలా.. తానో పెద్ద మనిషిలా మాట్లాడే సునీల్ మాటల్ని వింటున్న వారు మండిపడుతున్నారు. ఇలాంటి మాటలు మాట్లాడటానికి సిగ్గుందా? అని ప్రశ్నిస్తున్న వారు లేకపోలేదు.

ఇటీవల కాలంలో డ్రగ్స్ వినియోగం భారీగా పెరిగిపోవటం.. ఈ మధ్యనే ముంద్రా ఓడరేవులో భారీగా హెరాయిన్ పట్టుబడటం.. దాని విలువ ఏకంగా రూ.9వేల కోట్ల వరకు ఉండటం తెలిసిందే. ఇంత భారీగా హెరాయిన్ బయటపడటం కలకలాన్ని రేపింది. ఈ కంటైనర్లు అఫ్గానిస్థాన్ నుంచి వచ్చాయని.. అవి ఏపీలోని విజయవాడకు చెందిన ఒక ట్రేడింగ్ సంస్థకు చెందినవిగా గుర్తించారు.

టాల్కమ్ పౌడర్ ముసుగులో డ్రగ్స్ దందాను నిర్వహిస్తున్నట్లు చెప్పటం తెలిసిందే. ఓవైపు ఇంతలా డ్రగ్స్ బయటకు వస్తున్నప్పుడు.. వాటిని వినియోగించే వారు లేకుంటే ఇంత భారీగా దేశానికి ఎందుకు వస్తాయి? తాజాగా ఏర్పాటు చేసిన పార్టీకిసంబంధించిన విశేషాలు సంచలనంగా మారాయి. ఓవైపు బాలీవుడ్ మూవీలో హీరోగా నటిస్తున్న ఆర్యన్ ఖాన్.. ఇంకా చిన్నపిల్లాడు ఎందుకు అవుతాడు? ఆ వయసుకు వచ్చిన చాలామంది బాధ్యతగా వ్యవహరిస్తూ కెరీర్ లో ముందుకు వెళ్లిపోతున్నారే తప్పించి.. ఇలా డ్రగ్స్.. పార్టీలంటూ ఎంజాయ్ చేయటం లేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. భారీ తప్పులు చేసిన వారిని చిన్నపిల్లాడిగా అభివర్ణిస్తూ వెనకేసుకురావటం ఇంకా పెద్ద తప్పే అవుతుందన్న విషయాన్ని సునీల్ శెట్టి లాంటి వారు గుర్తించటం చాలా అవసరం.