Begin typing your search above and press return to search.

2.0 మీదా కాలా మొదటి దెబ్బ!

By:  Tupaki Desk   |   7 July 2018 6:59 AM GMT
2.0 మీదా కాలా మొదటి దెబ్బ!
X
కాలా వచ్చింది. వెళ్లిపోయింది. అసలు సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా ఈ రేంజ్ లో బోల్తా కొట్టడం కొత్తేమి కాదు. కానీ కొత్త విడుదల వచ్చిన ప్రతిసారి ఏ మూలో ఉన్న చిన్న ఆశ తలైవా ఈజ్ బ్యాక్ అనిపించేలా హిట్ కొడుతుందేమో అనే ఆశలు రేపేలా చేస్తుంటుంది. అయినా ఫలితం శూన్యం. ఇప్పుడు దీని ప్రభావం కాస్తా నిర్మాణంలో ఉన్న విజువల్ గ్రాండియర్ 2.0 మీద పడుతోంది. విడుదల ఎప్పుడో దర్శక నిర్మాతలతో సహా ఎవరికి తెలియని ఒక విచిత్రమైన పరిస్థితి దీని విషయంలో నెలకొంది. ఈ ఏడాది రిపబ్లిక్ డే నుంచి మొదలుపెట్టి ఇండిపెండెన్స్ డే దాకా అదిగో పులి ఇదుగో తోక తరహాలో పదే పదే మార్చుకుంటూ వస్తున్నారు తప్ప ఖచ్చితంగా మాత్రం చెప్పలేకపోతున్నారు. గతంలో తెలుగు హక్కుల కోసం లైకా సంస్థ 81 కోట్లు డిమాండ్ చేయగా ప్రాజెక్ట్ మీదున్న నమ్మకంతో సునీల్ నారంగ్ అనే డిస్ట్రిబ్యూటర్ ముందుకు వచ్చి 20 కోట్లు అడ్వాన్స్ కూడా ఇచ్చాడట. సరే వస్తుంది కదా ఎదురు చూస్తున్న కొద్దీ ఆలస్యం అవుతుండటంతో ఓపిక నశించిన సదరు సునీల్ నారంగ్ ఇప్పుటు తన మొత్తాన్ని వెనక్కు ఇమ్మని చెబుతున్నాడట.

ప్రస్తుతం పరిశ్రమ పెద్ద మధ్యవర్తిత్వంతో ఇది పంచాయితీ దాకా వచ్చింది. కాలా దారుణ ఫలితంతో పాటు అసలు ఎప్పుడు విడుదల అవుతుందో తెలియని 2.0 మీద పెట్టుబడి పెట్టి వడ్డీ నష్టంతో పాటు తాను అన్ని రకాలుగా నష్టపోతున్నాను అని సునీల్ నారంగ్ నిలదీస్తున్నాడట. ఒకవేళ వెనక్కు ఇచ్చే ప్రతిపాదన కనక ఓకే అయితే భవిష్యత్తులో లైకా స్వంతంగా రిలీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎంత హైప్ ఉన్నా శంకర్ సినిమా అయినా రజని కున్న మార్కెట్ దృష్ట్యా మితిమీరిన రేట్లకు దీన్ని కొనేందుకు బయ్యర్స్ సాహసించకపోవవచ్చు. కాలా కూడా ధనుష్ నష్టాలు తానే భరించేలా ఇక్కడి పంపిణీదారులతో మాట్లాడి విడుదల చేసుకున్నాడని అందుకే ప్లాప్ అయినా ఎవరు నోరు మెదపడం లేదని ఇప్పటికే టాక్ ఉంది. మరి ఈ 2.0 పంచాయితీ ఎక్కడి దాకా వెళ్తుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి ఫిలిం నగర్ వర్గాలు.