Begin typing your search above and press return to search.

స్నేహితుడికి త్రివిక్రమ్ లైఫ్ ఇస్తాడా..?

By:  Tupaki Desk   |   6 May 2020 11:50 AM GMT
స్నేహితుడికి త్రివిక్రమ్ లైఫ్ ఇస్తాడా..?
X
టాలీవుడ్ లో కమెడియన్‌ నుండి హీరోగా మారిన సునీల్‌ ఇండస్ట్రీకి వచ్చి 25సంవత్సరాలు అవుతుందట. ఇన్నేళ్ళలో సినీ ప్రయాణంలో ఎన్నో ఎత్తు పల్లాలను చూసాడు సునీల్. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో మొదలైన అతని సినీ ప్రయాణం నువ్వే కావాలి చిత్రంతో కమెడియన్‌గా మంచి టర్న్‌ తీసుకుంది. ఆ సినిమా సూపర్‌హిట్‌ కావడంతో సునీల్‌కి కూడా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత అతను వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. వరసగా సునీల్‌ చేసిన సినిమాల‌న్నీ సూపర్‌హిట్‌ కావడమే కాకుండా కమెడియన్‌గా అతనికి మంచి పేరు తెచ్చాయి. ఇప్పటి టాప్‌ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌, సునీల్‌ మంచి స్నేహితులు. సునీల్‌కి కమెడియన్‌గా మంచి పేరు తెచ్చిన ‘నువ్వే కావాలి’ నుంచి ‘చిరునవ్వుతో’, ‘నువ్వు నాకు నచ్చావ్‌’ చిత్రాల‌కు త్రివిక్రమ్‌ రైటర్‌గా వర్క్‌ చేశాడు.

త్రివిక్రమ్ పనిచేసిన సినిమాలలో స్నేహితుడు సునీల్ కి మంచి డైలాగ్స్‌ రాసి అతని ఎదుగుదల‌కు కారణమయ్యాడు. ఆ తర్వాత త్రివిక్రమ్‌ డైరెక్ట్‌ చేసిన ‘నువ్వే నువ్వే’, ‘అతడు’ చిత్రాల్లో కూడా సునీల్‌కి మంచి క్యారెక్టర్‌ ఇచ్చాడు. సునీల్‌ కెరీర్‌ ఇలా సాఫీగా కొనసాగుతున్న సమయంలోనే ‘అందాలరాముడు’ చిత్రంతో సునీల్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత చేసిన ‘మర్యాద రామన్న’ కూడా అతనికి హీరోగా మంచి పేరు తెచ్చింది. అయితే ఆ తర్వాత అతను హీరోగా నటించిన సినిమాలేవీ విజయం సాధించలేదు. దీంతో అతని కెరీర్‌ తలక్రిందులు అయిందని చెప్పాలి.

సునీల్ హీరోగా మారాక త్రివిక్రమ్‌ డైరెక్ట్‌ చేసిన సినిమాల్లో సునీల్‌ కనిపించలేదు. అయితే ఈ మధ్య మళ్ళీ ఇద్దరూ కలుసుకున్నారని, త్రివిక్రమ్‌ సినిమాల్లో సునీల్‌ నటించబోతున్నాడన్న వార్తలు వచ్చాయి. అన్నట్టుగానే త్రివిక్రమ్‌ డైరెక్ట్‌ చేసిన ‘అరవిందసమేత’ 'అల వైకుంఠపురంలో' సినిమాలలో సునీల్‌కి క్యారెక్టర్‌లు ఇచ్చాడు. అయితే క్యారెక్టర్స్ పెద్దగా పేలలేదు. ఇప్పుడు తాజాగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా ఓ సినిమా ప్లానింగ్‌లో ఉంది. ఈ సినిమాలో సునీల్‌ కోసం త్రివిక్రమ్‌ ఒక అద్భుతమైన క్యారెక్టర్‌ క్రియేట్‌ చేయబోతున్నారని, అది సునీల్‌ మళ్ళీ బ్రేక్‌ ఇచ్చే క్యారెక్టర్ అవుతుంద‌న్న గట్టి నమ్మకంతో ఉన్నట్లు సమాచారం. చూడాలి మరి అసలు విషయం ఏంటో తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.