Begin typing your search above and press return to search.

సునీల్ కొత్త సినిమా వచ్చేస్తోంది

By:  Tupaki Desk   |   3 Aug 2016 3:00 PM IST
సునీల్ కొత్త సినిమా వచ్చేస్తోంది
X
‘భీమవరం బుల్లోడు’ తర్వాత రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకున్నాడు సునీల్. ఇంత గ్యాప్ తీసుకుని గొప్ప సినిమాలేమైనా చేశాడా అంటే.. అదేం లేదు. కృష్ణాష్టమి.. జక్కన్న లాంటి పాత చింతకాయ పచ్చడి సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించారు. ఈ రెండు సినిమాలూ ఓ మోస్తరుగా ఓపెనింగ్స్ తెచ్చుకున్నాయి కానీ.. తర్వాత బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయాయి. కలెక్షన్ల సంగతి పక్కనబెడితే సునీల్ ఎంచుకున్న కథాంశాలు.. హీరోగా అతడి వేషాలపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇంకోసారి ఇలాంటి రొటీన్ మసాలా సినిమా చూస్తే సునీల్ కెరీర్ కు శుభం కార్డు పడిపోవడం ఖాయం. ఈ నేపథ్యంలో సునీల్ కొత్త సినిమా ‘ఈడు గోల్డ్ ఎహే’ ఎలా ఉంటుందా అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.

రైటర్ టర్న్డ్ డైరెక్టర్ వీరూ పోట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఈడు గోల్డ్ ఎహే’. ఈ సినిమా విడుదల తేదీ ఖరారైపోయింది. సెప్టెంబరు 9న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేబోతున్నారట. అంటే ఎనిమిది నెలల వ్యవధిలో సునీల్ మూడో సినిమాతో.. నెలన్నర వ్యవధిలోనే రెండో సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడన్నమాట. ముందు వారం ‘జనతా గ్యారేజ్’ విడుదలవుతోంది. పైగా సెప్టెంబరు 9న ప్రభుదేవా-తమన్నాల ‘అభినేత్రి’ కూడా వస్తుంది. అయినప్పటికీ ధైర్యంగా రిలీజ్ డేట్ ఇచ్చేశారు. వీరూ ఇంతకుముందు తీసిన బిందాస్.. రగడ.. దూసుకెళ్తా పెద్ద హిట్లు కాకున్నా.. బాగానే ఆడాయి. వీరూలో విషయం ఉందని రుజువు చేశాయి. మరి అతనైనా సునీల్ ను భిన్నంగా చూపిస్తాడా.. అతడి రాత మారుస్తాడా.. చూద్దాం.