Begin typing your search above and press return to search.

కృష్ణవంశీ.. సందీప్ కు నేర్పిన పాఠమేంటి?

By:  Tupaki Desk   |   23 March 2016 5:41 AM GMT
కృష్ణవంశీ.. సందీప్ కు నేర్పిన పాఠమేంటి?
X
కృష్ణవంశీ-సందీప్ కిషన్ కాంబినేషన్ లో సినిమా ఏదీ రాలేదు. ఐతే తన ఆలోచనల్లో మార్పు తెచ్చి.. పాత్రల ఎంపికలో.. నటనలో మెరుగవడానికి కారణం కృష్ణవంశీనే అంటున్నాడు ఈ యువ కథానాయకుడు. మరి అంతగా కృష్ణవంశీ ఏం ప్రభావం చూపించాడు అంటే.. ‘‘ఒక కథ రాసేటపుడు.. పాత్రల తాలూకు బ్యాగ్రౌండ్ కూడా తప్పకుండా రాయాలని కృష్ణవంశీ గారు చెప్పగా విన్నాను. ఆ బ్యాగ్రౌండ్ సినిమాలో చూపిస్తామా లేదా అన్నది తర్వాత.. హీరో పాత్రనే తీసుకుంటే అతడి తల్లిదండ్రులెవరు.. అతడి చదువేంటి.. అతడి ఊరేది.. అనే విషయాలు స్క్రిప్టులో మెన్షన్ చేయాలని ఆయన చెబుతారు. దాన్ని బట్టే ఆ పాత్ర ప్రవర్తన ఉండాలన్నది ఆయన ఉద్దేశం. ఇది చాలా కీలకమైన విషయం. ఈ నేపథ్యం తెలిస్తే నటించడం ఈజీ అవుతుంది. పాత్ర బాగా ఎలివేట్ అవుతుంది. కృష్ణవంశీ గారి నుంచి నేను నేర్చుకున్న పెద్ద పాఠమిది’’ అని సందీప్ కిషన్ చెప్పాడు.

ఇక తన కొత్త సినిమా ‘రన్’ గురించి చెబుతూ.. ‘‘ఇది తమిళ ‘నేరం’ సినిమాకు రీమేక్. ప్రేమమ్ దర్శకుడు అల్ఫాన్సో పుతెరిన్ తొలి సినిమా ఇదే. అతడి మేకింగ్ స్టయిల్ నాకు చాలా ఇష్టం. నేను రెండేళ్ల కిందటే ‘నేరమ్’ సినిమా చూశాను. బాగా నచ్చింది. ఐతే దీని రీమేక్ గురించి నేనేమీ ఆలోచించలేదు. ఐతే అనిల్ సుంకర గారు ఫోన్ చేసి ఈ సినిమా రీమేక్ చేద్దాం అనగానే ఓకే చెప్పాను. తమిళంతో పోలిస్తే తెలుగులో పెద్దగా మార్పులేమీ చేయలేదు. ఫీల్ చెడకుండా తీశాం. ఇది మంచి ఎంటర్టైనర్ అవుతుంది’’ అని సందీప్ అన్నాడు. నాగార్జున సినిమా ‘ఊపిరి’తో ‘రన్’ పోటీపడుతుండటంపై మాట్లాడుతూ.. ‘‘నాగార్జున గారు చాలా పెద్ద స్టార్. ఆయనపై నాకు చాలా గౌరవం ఉంది. ఆయనతో నేను పోటీపడటం లాంటిదేమీ లేదు. మంచి డేట్ చూసుకుని రిలీజ్ చేస్తున్నాం. బాగుంటే రెండు సినిమాల్నీ ఆదరిస్తారు’’ అన్నాడు.