Begin typing your search above and press return to search.

సందీప్ కిషన్ అక్కడ ఇంకోటి కొట్టాడు

By:  Tupaki Desk   |   14 Dec 2017 5:30 PM GMT
సందీప్ కిషన్ అక్కడ ఇంకోటి కొట్టాడు
X
యువ కథానాయకుడు సందీప్ కిషన్ కు తెలుగులో ఈ మధ్య అంతగా కాలం కలిసి రావట్లేదు. ‘టైగర్’ తర్వాత తెలుగులో అతడికి ఓ మోస్తరు విజయాన్నందించిన సినిమాలు కూడా లేవు. గత ఏడాది ‘రన్’.. ‘ఒక్క అమ్మాయి తప్ప’ డిజాస్టర్లవ్వగా.. ఈ ఏడాది ‘నగరం’.. ‘శమంతకమణి’.. ‘C/o సూర్య’ చిత్రాలు కూడా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఐతే తమిళంలో మాత్రం సందీప్‌కు మంచి ఫలితాలే దక్కుతున్నాయి ఈ ఏడాది. ‘నగరం’ తెలుగులో ఆడలేదు కానీ.. తమిళంలో మాత్రం సూపర్ హిట్టయింది. ‘C/o సూర్య’ తమిళ వెర్షన్ కూడా పర్వాలేదనిపించింది. ఐతే ఈ సినిమా విషయంలో పూర్తి సంతృప్తి చెందని చిత్ర దర్శకుడు సుశీంద్రన్.. దాన్ని థియేటర్ల నుంచి తీయించి రీషూట్లు.. రీఎడిటింగ్ తో మళ్లీ రిలీజ్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ లోపు సందీప్ నటించిన మరో సినిమా థియేటర్లలోకి వచ్చింది. అదే.. మాయవన్.

తమిళంలో విభిన్నమైన సినిమాలతో నిర్మాతగా గొప్ప పేరు సంపాదించిన సి.వి.కుమార్ దర్శకుడిగా పరిచయమైన చిత్రమిది. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించింది. జాకీష్రాఫ్ కీలక పాత్ర పోషించాడు. ఈ థ్రిల్లర్ మూవీ గురువారమే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రానికి ముందు ప్రివ్యూలు వేయగా.. మంచి స్పందన వచ్చింది. ఈ రోజు థియేటర్లలో కూడా రెస్పాన్స్ బాగుంది. రివ్యూలు బాగున్నాయి. ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చే అవకాశముందని అంటున్నారు. సినిమా ఉత్కంఠభరితంగా సాగుతుందని.. సందీప్ కిషన్ పెర్ఫామెన్స్ సూపర్ అని అంటున్నారు క్రిటిక్స్. ఈ చిత్రం తెలుగులోకి ‘ప్రాజెక్ట్ జడ్’ పేరుతో అనువాదమైంది. త్వరలోనే విడుదల చేయబోతున్నారు.