Begin typing your search above and press return to search.

'గల్లీ రౌడీ' పరుగులు .. హిట్టు కోసమేనా?

By:  Tupaki Desk   |   29 April 2021 12:30 AM GMT
గల్లీ రౌడీ పరుగులు .. హిట్టు కోసమేనా?
X
సందీప్ కిషన్ .. చూడటానికి మంచి ఒడ్డూ పొడుగూ ఉంటాడు. ఎప్పటికప్పుడు కొత్తగా ట్రై చేస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ ఉంటాడు. ఆడియన్స్ తో గ్యాప్ రాకుండా చూసుకుంటూ వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడుగానీ, ఆ స్థాయిలో విజయాలు మాత్రం దక్కడం లేదు. హీరోగా ఓకే అనిపించుకున్నాడు గానీ .. సరైన హిట్ మాత్రం పడటం లేదు. అయినా తన ప్రయత్నాలను ఆపకుండా ముందుకు వెళుతూనే ఉన్నాడు. ఆయన తాజా చిత్రంగా 'గల్లీ రౌడీ' రూపొందింది.

'జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో 'గల్లీ రౌడీ' రూపొందింది. నాగేశ్వర రెడ్డి సినిమా అనగానే ఇటు యాక్షన్ .. అటు కామెడీ తక్కెట్లో వేసి తూచినట్టుగా సమానంగా ఉంటాయి. 'సీమశాస్త్రి ' .. 'దేనికైనా రెడీ' వంటి సినిమాలే అందుకు నిలువెత్తు నిదర్శనం. హీరోలను రిపీట్ చేసే అలవాటు నాగేశ్వర రెడ్డికి ఉంది. రోహిత్ .. అల్లరి నరేశ్ .. మంచు విష్ణు తరువాత ఆ జాబితాలో సందీప్ కిషన్ జాయిన్ అయ్యాడు. 'తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్' తరువాత ఈ ఇద్దరి కాంబినేషలో 'గల్లీ రౌడీ' వస్తోంది. ఈ నాన్ స్టాప్ ఎంటర్టైనర్ లో సందీప్ కిషన్ జోడీగా, నేహా శెట్టి అలరించనుంది.

బాబీసింహా పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ సినిమాలో, రాజేంద్ర ప్రసాద్ .. పోసాని .. వెన్నెల కిషోర్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. వచ్చేనెలలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి ముందు సందీప్ కిషన్ చేసిన 'A1 ఎక్స్ ప్రెస్'కి యూత్ నుంచి మంచి మార్కులు పడ్డాయి. అంతేకాదు ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. పూర్తి వినోదభరితంగా రూపొందిన ఈ సినిమా, తనకి తప్పకుండా మంచి హిట్ ఇస్తుందనే నమ్మకంతో సందీప్ కిషన్ ఉన్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి మరి.