Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: 'సుల్తాన్'

By:  Tupaki Desk   |   2 April 2021 1:23 PM GMT
మూవీ రివ్యూ: సుల్తాన్
X
చిత్రం : 'సుల్తాన్'

నటీనటులు: కార్తి-రష్మిక మందన్నా-యోగి బాబు-లాల్-రామచంద్రరాజు-నెపోలియన్ తదితరులు
సంగీతం: వివేక్ మెర్విన్
నేపథ్య సంగీతం: యువన్ శంకర్ రాజా
ఛాయాగ్రహణం: సత్యన్ సూర్యన్
నిర్మాతలు: ఎస్.ఆర్.ప్రభు-ఎస్.ఆర్. ప్రకాష్ బాబు
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: భాగ్యరాజ్ కన్నన్

తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న తమిళ కథానాయకుల్లో ఒకడు కార్తి. మధ్యలో అతను కొంచెం తడబడ్డా.. ‘ఖైదీ’ సినిమాతో మళ్లీ మన ప్రేక్షకుల మనసు గెలిచాడు. తమిళంలో అతను హీరోగా తెరకెక్కిన కొత్త చిత్రం ‘సుల్తాన్’ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

విక్రమ్ (కార్తి) విశాఖపట్నంలో ఒక పెద్ద కుటుంబంలో పుట్టిన కుర్రాడు. అతణ్ని బొంబాయికి పంపించి చదివిస్తాడు తండ్రి. తన కొడుకుతో పాటు త‌న ద‌గ్గ‌ర ప‌ని చేసే వందమందిని తన బిడ్డల్లాగే చూసుకుంటూ ఉంటాడు విక్రమ్ తండ్రి. విక్రమ్ తండ్రి వీళ్ల అండతోనే సెటిల్మెంట్లు చేస్తూ పెద్ద స్థాయికి ఎదుగుతాడు. ఐతే ఉన్నట్లుండి విక్రమ్ తండ్రి చనిపోతాడు. అదే సమయంలో సిటీకి కొత్తగా వచ్చిన కమిషనర్.. విక్రమ్ ఇంట్లోని వందమందినీ టార్గెట్ చేస్తాడు. వాళ్లను కాపాడుకోవడం కోసం ఇకపై ఈ వంద మంది ఏ తప్పూ చేయకుండా చూసుకుంటానని కమిషనర్ కు హామీ ఇస్తాడు విక్రమ్. తండ్రి బతికుండగా ఓ గ్రామానికి ఇచ్చిన మాటను నెరవేర్చడం కోసం వీళ్లందరినీ తీసుకుని ఆ ఊరికి వెళ్తాడు. అక్కడ అతడికి ఎదురైన పరిస్థితులేంటి.. ఆ వందమందిని అతను ఎలా కాపాడుకున్నాడు అన్నది మిగతా కథ.

క‌థ‌నం-విశ్లేష‌ణ‌:

క‌థ‌నం-విశ్లేష‌ణ‌: ఒక‌ప్పుడు మ‌న ద‌గ్గ‌ర వ‌చ్చే మూస సినిమాల‌కు విసుగెత్తిపోయి.. త‌మిళం నుంచి అనువాదాల రూపంలో కొత్త త‌ర‌హా సినిమాలొస్తుంటే వాటిని నెత్తిన పెట్టుకున్నారు మ‌న ప్రేక్ష‌కులు. కాల క్ర‌మంలో మ‌న సినిమాలు ఎంతో మారాయి. కొన్నేళ్లుగా ఇక్క‌డ ఎన్నో ప్ర‌యోగాలు జ‌రిగాయి. వాటికి మంచి ఆద‌ర‌ణ ద‌క్కింది. ఏదో ఒక కొత్త‌ద‌నం ఉంటే త‌ప్ప మ‌న వాళ్లు ఆద‌రించ‌ట్లేదు. మాస్ సినిమా అయినా స‌రే.. ఒక బిగి ఉండాల‌ని.. లాజిక‌ల్ గా సాగాల‌ని కోరుకుంటున్నారు. ఐతే ద‌శాబ్దం కింద‌టే ఎన్నో ప్ర‌యోగాలు చేసిన కోలీవుడ్ కొన్నేళ్ల నుంచి ఒక మూస‌లో ప‌డిపోయి కొట్టుకుంటుండ‌టం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌యం. అక్క‌డ ఒక‌ప్ప‌ట్లా పెద్ద‌గా ప్ర‌యోగాలు జ‌ర‌గ‌ట్లేదు. స్టార్లంద‌రూ ఎక్కువ‌గా రొటీన్ మాస్ మ‌సాలా సినిమాలే చేస్తున్నారు. వాటినే తెలుగులోకి కూడా దించుతున్నారు. ఇప్పుడు కార్తి నుంచి వ‌చ్చిన సుల్తాన్ కూడా అదే బాప‌తు. క‌థ‌ను ఆరంభించిన తీరు కొంచెం ఆస‌క్తిక‌రంగానే అనిపించినా.. ఆ త‌ర్వాత అంతా రొటీన్ వ్య‌వ‌హార‌మే కావ‌డంతో సుల్తాన్ ను చివ‌రి వ‌ర‌కు భ‌రించ‌డం క‌ష్ట‌మే అవుతుంది.

కొట్ట‌డం.. చంప‌డం త‌ప్ప ఏమీ తెలియ‌కుండా జీవితాన్ని సాగిస్తున్న వంద మందిని అస‌లు గొడ‌వ‌ల‌కే వెళ్ల‌కుండా హీరో నియంత్రిస్తూ.. వారిలో ప‌రివ‌ర్త‌న తేవ‌డం అనే పాయింట్ సుల్తాన్ లో ఆస‌క్తిక‌రంగా అనిపిస్తుంది. ఈ పాయింటేదో కొత్త‌గా ఉందే అనుకుంటూ సినిమా మీద దృష్టిసారిస్తాం. కానీ ఇది ఆరంభ శూర‌త్వం మాత్ర‌మే అని కాసేప‌టికి అర్థ‌మ‌వుతుంది. ఊరికే హ‌డావుడి త‌ప్ప స‌న్నివేశాల్లో విష‌యం క‌నిపించ‌దు. వంద మంది రౌడీలతో తెరంతా సంద‌డిగా అయితే క‌నిపిస్తుంది కానీ.. హీరోకు వీరికి మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలేవీ ఆస‌క్తిక‌రంగా అనిపించ‌వు. క‌థ ప‌ల్లెటూరికి షిఫ్ట్ అయ్యాక కేజీఎఫ్ సినిమా రేంజిలో అక్క‌డి వాళ్లు క‌ష్ట‌ప‌డుతూ ర‌క్ష‌కుడి కోసం చూస్తున్న‌ట్లుగా నాట‌కీయ‌మైన స‌న్నివేశాలు పెట్టారు. కానీ వాటిలో ఎమోష‌న్ కంటే అతి ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. అస‌హ‌జ‌మైన స‌న్నివేశాల వ‌ల్ల ప‌ల్లెటూరి ఎపిసోడ్ డ్ర‌మ‌టిగ్గా అనిపిస్తుంది. ఇంట‌ర్వెల్ ద‌గ్గ‌ర హీరో వీర‌త్వం చూపించే స‌న్నివేశం ఒక‌టి ప్ర‌థ‌మార్ధంలో ప్రేక్ష‌కుల‌ను కొంచెం ఎంగేజ్ చేస్తుంది.

అక్క‌డ క‌ట్ చేస్తే మ‌ళ్లీ ద్వితీయార్ధంలో రొటీన్ స‌న్నివేశాలు సినిమా గ్రాఫ్ ను కిందికి లాగేశాయి. త‌న ద‌గ్గ‌రున్న రౌడీల‌తో వ్య‌వ‌సాయం చేయించ‌డానికి హీరో న‌డుం బిగించ‌డం.. ఊరిలో వ్య‌తిరేక‌త‌.. ఈ సెట‌ప్ లో కొంత‌మేర మ‌హ‌ర్షి సినిమా స్ఫూర్తి క‌నిపిస్తుంది. ఐతే ఇక్క‌డ కూడా లాజిక్ లేకుండా.. అస‌హ‌జంగా సాగే స‌న్నివేశాలు సుల్తాన్ కు ప్ర‌తికూలంగా మారాయి. విల‌న్ల వ్య‌వ‌హారం అయితే పూర్తిగా తేలిపోయింది. విప‌రీత‌మైన బిల్డ‌ప్ త‌ప్పితే.. ఆ పాత్ర‌ల్లో ఏ విశేషం లేదు. ఇక ఈ సినిమా ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురు చూడ్డం త‌ప్పితే.. ప్రేక్ష‌క‌కుల ఆస‌క్తిని నిలిపి ఉంచే స‌న్నివేశాలే లేక‌పోయాయి ద్వితీయార్ధంలో. ఏదో ఒక‌టి కొత్త‌గా చేద్దామ‌ని చూసే కార్తి ఇలాంటి సినిమాను ఎలా చేశాడా అనే సందేహాలు క‌లిగిస్తుంది చివ‌రికొచ్చేస‌రికి సుల్తాన్‌. క‌థాక‌థ‌నాల‌తో సంబంధం లేకుండా.. కేవ‌లం మాస్ మాస్ అని ఊగిపోయేవాళ్లు సుల్తాన్ పై ఓ లుక్కేయొచ్చు కానీ.. ఇంకేం ఆశించినా తీవ్ర నిరాశ త‌ప్ప‌దు.

నటీనటులు:

తన అన్నలాగే కార్తి సైతం సినిమా ఎలా ఉన్నా తన వరకు న్యాయం చేస్తుంటాడు. ‘సుల్తాన్’లోనూ అదే చేశాడు. అతడి నటన.. స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటాయి. ఎక్కడా అతి చేయకుండా సుల్తాన్ పాత్రను పండించే ప్రయత్నం చేశాడతను. హీరోయిజం ఎలివేట్ అయ్యే.. యాక్షన్ సన్నివేశాల్లో అతడి పెర్ఫామెన్స్ మెప్పిస్తుంది. హీరోయిన్ రష్మిక మందన్నా పల్లెటూరి అమ్మాయిగా కనిపించడానికి చాలా కష్టపడింది కానీ.. అంత సహజంగా అనిపించలేదు. లుక్ మాత్రమే కాదు.. తన యాక్టింగ్ ఆ పాత్రకు సెట్టవ్వలేదు. హీరో వెంటే ఉండే పాత్రలో లాల్ ఆకట్టుకున్నాడు. యోగిబాబు ఓ మాదిరిగా నవ్వించాడు. విలన్ పాత్రల్లో చేసిన ఇద్దరూ బిల్డప్ ఎక్కువ విషయం తక్కువ అనిపించారు. వారి పాత్రలు ఏమాత్రం ఆసక్తికరంగా అనిపించవు. హీరో వెంట ఉండే గుంపులో కొందరు బాగా చేశారు.

సాంకేతిక వర్గం:

వివేక్-మెర్విన్ పాటలు తమిళులకు ఎలా అనిపిస్తాయో కానీ.. మన వాళ్లకైతే అంతగా ఎక్కవు. మళ్లీ వినాలనిపించే పాటలేవీ ఇందులో లేవు. సన్నివేశ బలం ఎంత అన్నది పక్కన పెడితే.. యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం మాత్రం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా హీరో ఎలివేషన్ సీన్లలో యువన్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. మంచి ఊపున్న సినిమాలో హీరోకు ఈ స్కోర్ ఉంటే భలే ఉండేదనిపిస్తుంది. సత్యన్ సూర్యన్ ఛాయాగ్రహణం బాగుంది. సినిమా మంచి క్వాలిటీతో తెరకెక్కింది. దర్శకుడు భాగ్యరాజ్ కన్నన్ ఏ రకంగానూ మెప్పించలేదు. ప్లాట్ పాయింట్ వరకు బాగానే రాసుకున్నా.. దాన్ని తెరమీద ప్రెజెంట్ చేయడంలో విఫలమయ్యాడు. మ‌రీ లౌడ్ గా స‌న్నివేశాలు ప్రెజెంట్ చేయ‌డం.. అవ‌స‌రం లేని హ‌డావుడి.. రొటీన్ ట్రీట్మెంట్ తో సినిమాను నీరుగార్చేశాడు.

చివరగా: సుల్తాన్.. పై పై మెరుపులే

రేటింగ్-2.25/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre