Begin typing your search above and press return to search.

మహేష్‌ ను చూసినపుడల్లా బాధేస్తుంది-సుకుమార్

By:  Tupaki Desk   |   31 Jan 2016 7:00 PM IST
మహేష్‌ ను చూసినపుడల్లా బాధేస్తుంది-సుకుమార్
X
హీరో మహేష్ బాబును చూసినపుడల్లా డైరెక్టర్ సుకుమార్ కు చాలా బాధగా ఉంటుందట. ఈ మాట చెప్పగానే ‘1 నేనొక్కడినే’ సినిమా రిజల్ట్ విషయంలో సుక్కు బాధపడుతున్నాడనే అనుకుంటాం. కానీ అతను ఆ మాట అంటుండానికి రీజన్ వేరు. ఫ్యామిలీకి సమయం కేటాయించే విషయంలో మహేష్ ను చూస్తే తనకు చాలా బాధగా ఉంటుందని అంటున్నాడు సుక్కు. మహేష్ లాంటి ఫ్యామిలీ మ్యాన్ మరొకరుండరన్నది సుక్కు అభిప్రాయం. ‘‘మహేష్ బాబును చూసినప్పడల్లా కుటుంబంతో సరిగా గడపలేకపోయాననే బాధ నాకు కలుగుతుంది. ఆయన తన తండ్రి కృష్ణ, ఇతర కుటుంబ సభ్యులకు చాలా సమయం కేటాయించి వాళ్లందరినీ బాగా చూసుకుంటున్నారు’’ అంటూ తన హీరోకు కాంప్లిమెంట్ ఇచ్చాడు సుక్కు.

తాను తన కుటుంబానికి తగినంత సమయం ఇవ్వట్లేదనే బాధ తనను వెంటాడుతూ ఉంటుందని సుక్కు చెప్పాడు. ‘‘నేను మా నాన్న ప్రేమను చాలా పొందాను. కానీ మా నాన్నకు నా ప్రేమను పంచలేకపోయాను. అదే నన్ను ఇప్పటికీ బాధిస్తూ ఉంటుంది. నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్లిపోవడం, ఎప్పుడూ బిజీగా ఉంటూ తరువాతి సినిమాల పైనే దృష్టి పెట్టడంతో అలా జరిగిపోయింది. మా నాన్న హైదరాబాద్‌లో నా దగ్గర ఉండడం కంటే స్వస్థలంలో ఉండేందుకే ఇష్టపడేవారు. అందువల్ల ఆయనతో ఎక్కువ సమయం గడపలేకపోయాను. ఆయన కోరికలు కొన్ని తీర్చలేకపోయాను. ఆయన్ని విదేశాలకో, కాశీకో తీసుకెళ్లాలని అనుకునే వాణ్ని. కానీ అవి చేయకుండానే ఆయన వెళ్లిపోయారు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు సుక్కు.