Begin typing your search above and press return to search.

సుకుమార్ చిన్న సినిమా?

By:  Tupaki Desk   |   28 March 2018 3:36 PM IST
సుకుమార్ చిన్న సినిమా?
X
తెలుగులో కొంచెం నెమ్మదిగా.. ఆచితూచి సినిమాలు చేసే స్టార్ డైరెక్టర్లలో సుకుమార్ ఒకడు. అతను ఇండస్ట్రీకి వచ్చి 14 ఏళ్లవుతోంది. ఇన్నేళ్లలో సుక్కు తీసింది ఏడు సినిమాలే. ప్రతి సినిమాకూ రెండేళ్లయినా గ్యాప్ తీసుకుంటుంటాడు సుకుమార్. ఒక సినిమా అయ్యాక ఇంకో సినిమా మొదలుపెట్టడానికే చాలా టైం పడుతుంది. ఐతే ఇంతకుముందు కనీసం ముందే హీరోనైనా ఫిక్స్ అయ్యేవాడు. కానీ ఇప్పుడైతే తన కొత్త సినిమా విడుదలకు సిద్ధమయ్యాక కూడా తర్వాతి సినిమా విషయంలో స్పష్టతతో లేడు సుక్కు. ‘రంగస్థలం’ తర్వాత అల్లు అర్జున్‌తో చేస్తాడని.. కాదు చిరంజీవితో అని ప్రచారాలు జరిగాయి కానీ.. అవేమీ నిజం కాదని తేలింది. స్వయంగా సుకుమారే ఈ విషయంలో స్పష్టత ఇచ్చాడు.

తాజా సమాచారం ప్రకారం సుకుమార్ ‘రంగస్థలం’ ఫలితం చూశాకే తన తర్వాతి సినిమా విషయంలో నిర్ణయం తీసుకుంటాడట. ఇప్పటికైతే అతను ఎవరికీ కమిట్మెంట్ ఇవ్వలేదట. వరుసగా పెద్ద హీరోలతో భారీ సినిమాలే చేస్తున్న సుకుమార్ ఈసారి ఒక అప్ కమింగ్ హీరోతో చిన్న సినిమా చేయాలన్న ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. ప్రతిసారీ కాంబినేషన్లకు తగ్గట్లుగా భారీ సినిమాలే సెట్టవుతున్నాయని.. బడ్జెట్ కూడా పెరిగిపోతోందని.. ఈసారి అలా కాకుండా పరిమిత బడ్జెట్లో కంటెంట్ ప్రధానంగా ఓ చిన్న సినిమా తీసి.. తన ప్రత్యేకతను చాటుకోవాలని సుకుమార్ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ‘రంగస్థలం’ రిలీజైన కొన్ని రోజులకే ఈ ప్రాజెక్టు గురించి సుక్కు ప్రకటన చేస్తాడని అంటున్నారు.