Begin typing your search above and press return to search.

తరువాతి సినిమా బన్నీతో అంటగా??

By:  Tupaki Desk   |   2 April 2018 1:53 PM IST
తరువాతి సినిమా బన్నీతో అంటగా??
X
ఇంటలిజెంట్ డైరెక్టర్ గా పేరున్న సుకుమార్ రూటు మార్చి తీసిన సినిమా రంగస్థలంతో సూపర్ హిట్ కొట్టాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ తో పీరియాడికల్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా అన్నిచోట్ల ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఈ మూవీలో పాత్రలు తీర్చిదిద్దిన తీరు సుకుమార్ లోని టాలెంట్ కు అద్దం పడుతుందని అందరూ కాంప్లిమెంట్స్ ఇచ్చేస్తున్నారు.

రంగస్థలం మూవీ అనుకున్న దానికంటే ఎక్కువ రేంజులో బ్లాక్ బస్టర్ కొట్టడంతో రిలాక్సయ్యాడు సుకుమార్. అయితే సహజంగానే ఇప్పుడు ఇతగాడి తరువాత సినిమా ఎవరితో చేస్తాడనే ఆసక్తి ఉంటుంది. సుక్కూ మాత్రం మరోసారి మరో పెద్ద స్టార్ తో చేయడానికి సన్నద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అవును.. తన నెక్ట్స్ సినిమా కోసం మరోసారి తన ఫేవరేట్ హీరో అల్లు అర్జున్ తో జతకడతాడట.

ప్రస్తుతం స్టయిలిష్ స్టార్ వక్కంతం వంశీ డైరెక్షన్ లో నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్ కు వచ్చేసింది. ఇంకొద్ది వారాల్లో సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తయిపోతుంది. దీని తరవాత అల్లు అర్జున్ ఇంతవరకు కొత్త సినిమా ఏమీ కమిట్ అవలేదు. ప్రస్తుతం సుకుమార్ కూడా ఖాళీ గానే ఉన్నాడు. దీంతో వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా చేసేందుకు దాదాపుగా అడ్డంకులేవీ లేనట్లే.

దాదాపు ఏడాదిన్నరకు పైగా టైం రంగస్థలం మూవీకే కేటాయించాడు సుకుమార్. మధ్యలో సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై దర్శకుడు సినిమా చేసినా దానికి సంబంధించిన అన్ని పనులూ టీంకే అప్పగించాడు. రంగస్థలం తరవాత చేయడానికి తనవద్ద రెండు - మూడు కథలు సిద్ధంగా ఉన్నాయని.. త్వరలోనే నెక్ట్స్ మూవీకి సంబంధించి వర్క్ మొదలుపెడతానని ఇటీవల సుకుమార్ స్వయంగా చెప్పాడు. అల్లు అర్జున్ వీటిలో ఏదో ఒకటి ఓకే చేస్తే సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది.