Begin typing your search above and press return to search.

సుకుమార్ స్కూలు మార్చ‌డ‌మే క‌రెక్టా?

By:  Tupaki Desk   |   24 Dec 2021 5:00 AM IST
సుకుమార్ స్కూలు మార్చ‌డ‌మే క‌రెక్టా?
X
సుకుమార్ అంటే విభిన్న‌మైన క‌థ‌ల‌కు పెట్టింది పేరు. అయితే ఆయ‌న గ‌త కొంత కాలంగా త‌న పంథాని ప‌క్క‌న పెట్టి ఎలాంటి లెక్క‌లు...మ‌డ‌త‌పేచీలు.. మైండ్ దిమ్మ‌దిరిగే స్క్రీన్ ప్లేల‌కు ప‌ని చెప్ప‌కుండా ఒక్క మాట‌లో చెప్పాలంటే బ్రైన్ ని ప‌క్క‌న పెట్టి రెగ్యుల‌ర్ ద‌ర్శ‌కులు త‌ర‌హాలో మాస్ కి న‌చ్చే ఊర‌మాస్ క‌థ‌ల వైపు ప‌య‌నించ‌డం మొద‌లు పెట్టారు. త‌న సినిమాల్లో హీరోకు ఎలాంటి ఎథిక్స్ వుండ‌వు. కానీ అత‌నే హీరోగా వుండాలి అంటూ అంద‌రిని క‌న్విన్స్ చేసేస్తుంటారు.

ఒక విధంగా చెప్పాలంటే తెలుగు సినిమాల్లో హీరో అంటే `రాముడు మంచి బాలుడు ...` అనే మాట‌ని రావ‌ణుడు మంచి బాలుడు అనే స్థాయికి తీసుకొచ్చిన పూరి జ‌గ‌న్నాథ్ నే మ‌రిపించేంత‌గా తెలుగు సినిమాల్లో హీరో పాత్ర‌ని మ‌లిచిన ఘ‌న‌త సుకుమార్ దే. పూరి సినిమాల్లో హీరో ఓ పోకిరి.. ఇడియ‌ట్‌.. ఓ దేశ ముదురు... లోఫ‌ర్ .. ఓ రోగ్‌... అయితే సుకుమార్ సినిమాలో మాత్రం చిత్ర విచిత్ర‌మైన క్యారెక్ట‌ర్‌. త‌నికి ఎప్పుడు ఎలా ప్రేమ పుడుతుందో తెలియ‌దు.

ఒక‌రు ప్రేమిస్తున్నా.. త‌న‌కు న‌చ్చింది కాబ‌ట్టి న‌న్నే ప్రేమించాల‌ని వెంట‌పడే వ్య‌క్తి (ఆర్య‌)... ఫ్రెండ్ ని ప్రేమిస్తున్న యువ‌తిని అవ‌కాశాన్ని బ‌ట్టి పెళ్లి చేసుకునే హీరో (ఆర్య -2)... ఎప్పుడూ నేను ముందుండాలి.. నా త‌రువాతే ఎవ‌రైనా అని అభ‌ద్ర‌తా భావంతో ర‌గిలిపోతూ త‌న‌ని ఎక్క‌డ ఓవ‌ర్ టేక్ చేస్తారేమోన‌ని జ‌ల‌సీ ఫీల‌య్యే వాడు (100 % ల‌వ్‌) .. ఇక `పుష్ప‌`ని తీసుకుంటే ఇందులోని క్యారెక్ట‌ర్ స‌మాజంపై ప‌గ పెంచుకుని ఈగోతో ర‌గిలిపోయే వ్య‌క్తి.

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు తో చేసిన ఒక్క `వ‌న్ నేనొక్క‌డినే` త‌ప్ప సుకుమార్ చేసిన సినిమాల్లో హీరో పాత్ర విల‌న్ ఛాయాల‌కు ద‌గ్గ‌ర‌గా వున్న‌దే. చిత్ర విచిత్ర‌మైన పాయింట్ తో ఎలాంటి లాజిక్ ల‌కు అంద‌కుండా.. అస‌లు లాజిక్కే లేకుండా సాగుతుంటాయి. ఇలా విచిత్రంగా సాగిన సుకుమార్ ప్ర‌యాణం ఒక్క‌సారిగా `రంగ‌స్థ‌లం`తో కొత్త‌దారి ప‌ట్టింది.

ఒక విధంగా చెప్పాలంటే ప్ర‌తి సినిమాకు త‌న‌దైన మ్యాథ‌మెటిక్స్ లెక్క‌ల‌తో న‌డిపిస్తూ స‌గ‌టు ప్రేక్ష‌కుడిని క‌న్ఫ్యూజ్ చేసే సుకుమార్ త‌న స్కూల్‌కి భిన్నంగా అడుగులు వేయ‌డం మొద‌లు పెట్టారు.

గ‌జిబిజి స్క్రీన్ ప్లేల‌తో ప్రేక్ష‌కుడి మెద‌డుని పిండేయ‌డం మానేసి స‌గ‌టు ప్రేక్ష‌కుడు ఇష్ట‌ప‌డే మాస్ మంత్రాన్ని అందుకున్నారు. రామ్ చ‌ర‌ణ్ తో చేసిన `రంగ‌స్థ‌లం`తో ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేశాడు. నేల విడిచి సాము చేయ‌కుండా ఓ సాదా సీతా రివేంజ్ డ్రామాని తీసుకుని దాన్ని అత్యంత ఆస‌క్తిక‌రంగా న‌డిపించిన తీరు, రామ్ చ‌ర‌ణ్ ని చిట్టిబాబుగా ఆవిష్క‌రించిన తీరు ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంది.

బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వసూళ్ల‌ని అందించ‌డ‌మే కాకుండా జాతీయ స్థాయిలో అవార్డుని కూడా తెచ్చిపెట్టింది. ద‌ర్శ‌కుడిగా ఈ సినిమా సుకుమార్ కు స‌రికొత్త ఇమేజ్‌ని అందించ‌మే కాకుండా ద‌ర్శ‌కుడిగా ప్ర‌త్యేక‌మైన గుర్తింపుని తెచ్చిపెట్టింది.

ఈ సినిమాతో వ‌చ్చిన క్రేజ్ ని త‌న కెరీర్‌లో వ‌చ్చిన మార్ప‌ని గ‌మ‌నించిన సుకుమార్ వెంట‌నే త‌న స్కూల్ మార్చేశాడు. ఇదే ఫార్ములాని అప్లై చూస్తూ `పుష్ప : ది రైజ్‌`ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చారు. ఈ నెల 17న విడుద‌లైన ఈ చిత్రంలో `రంగ‌స్థ‌లం`లో చిట్టిబాబు పాత్ర‌ని మించి మ‌రింత మాసీవ్‌గా మ‌లిచారు.

ఇప్ప‌డ‌దే బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని సాధిస్తూ స‌రికొత్త రికార్డులు సృష్టిస్తోంది. పార్ 2 లోనూ ఇంత‌కు మించిన మాసీవ్ సీన్ ల‌ని ప్లాన్ చేసిన సుకుమార్ ఇక నుంచి ఇదే స్కూల్ ని కంటిన్యూ చేస్తార‌ని తెలుస్తోంది. సుకుమార్ లో వ‌చ్చిన మార్పుని గ‌మ‌నించిన ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు మాత్రం సుకుమార్ స్కూల్ మార్చ‌డ‌మే క‌రెక్ట్ అని ప్ర‌స్తుతం అత‌ను వెళుతున్న పంథా క‌రెక్ట్ అని కామెంట్ లు చేస్తున్నారు. నిజ‌మే క‌దూ..