Begin typing your search above and press return to search.

‘1 నేనొక్కడినే’ కథ రాసింది సుక్కు కాదు

By:  Tupaki Desk   |   22 May 2017 4:13 PM IST
‘1 నేనొక్కడినే’ కథ రాసింది సుక్కు కాదు
X
సుకుమార్ సినిమాల టైటిల్ కార్డ్స్ చూస్తే అందులో చాలా పేర్లు కనిపిస్తాయి. కథా సహకారం.. రచనా సహకారం.. అడిషనల్ స్క్రీన్ ప్లే.. డైలాగ్స్.. అడిషనల్ డైలాగ్స్ అంటూ చాలామంది పేర్లు వేస్తాడు సుక్కు. స్క్రిప్టు దశలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ క్రెడిట్ ఇవ్వడం సుకుమార్ లోని గొప్ప లక్షణం. ఐతే కేవలం టైటిల్ క్రెడిట్స్ ఇవ్వడమే కాదు.. ఏదైనా వేదికల్లో సందర్భానుసారం రచయితల పేర్లూ ప్రస్తావించి.. వాళ్ల పాత్ర గురించి గొప్పగా చెబుతాడు. తన బేనర్లో ‘దర్శకుడు’తో దర్శకుడిగా పరిచయం కానున్న తన మిత్రుడు జక్క హరి ప్రసాద్ గురించి కూడా సుకుమార్ ఇలాగే చెప్పాడు.

జక్క హరి ప్రసాద్.. సుకుమార్ లెక్చరర్ గా పని చేసే రోజుల్లోనే పరిచయమట. అక్కడ అతను కూడా టీచింగ్ ఫీల్డ్ లో ఉండేవాడట. తాను చెప్పిన ఓ కథకు బాగా ఇంప్రెస్ అయి.. తనను సినిమా పరిశ్రమ వైపు పంపించిందే హరి ప్రసాద్ అన్నాడు సుక్కు. తాను ఇండస్ట్రీలోకి వచ్చిన రెండు మూడేళ్లకు హరి ప్రసాద్ ను కూడా ఇక్కడికి రప్పించినట్లు తెలిపాడు. తన వెనుకే ఉంటూ తనకంటే గొప్పగా ఎదిగిపోయాడని.. వెనుదిరిగి చూస్తే తన వెనుక ఒక మహా వృక్షం లాగా హరి ప్రసాద్ కనిపించాడని సుక్కు తనదైన శైలిలో వ్యాఖ్యానించాడు. తన దర్శకత్వంలో వచ్చిన ‘1 నేనొక్కడినే’ సినిమాకు మూల కథ అందించింది హరి ప్రసాదే అని.. తాను దాన్ని డెవలప్ చేసుకున్నానని సుక్కుచెప్పాడు. ‘దర్శకుడు’ కథ విని ఆశ్చర్యపోయానని.. నువ్వే రాశావా అని హరిని అడిగానని.. అతడి కథకు ఇంప్రెస్ అయిన తాను ఒక్క రోజు కూడా షూటింగ్ స్పాటుకే వెళ్లలేదని.. రషెస్ చూశాక మాత్రం సినిమా చాలా బాగా తీశాడనిపించిందని సుక్కు అన్నాడు.