Begin typing your search above and press return to search.

తాను చేసిన పనికి పెళ్లి ఆగిపోతుందని భయపడ్డానన్న సుహాసిని

By:  Tupaki Desk   |   24 Sep 2022 4:34 AM GMT
తాను చేసిన పనికి పెళ్లి ఆగిపోతుందని భయపడ్డానన్న సుహాసిని
X
సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు ప్రేమించి పెళ్లి చేసుకున్నోళ్లు చాలామందే కనిపిస్తారు.అయితే.. వీరిలో హీరోలు.. హీరోయిన్లు.. దర్శకులు.. సింగర్లు ఇలాంటి కొందరు సెలబ్రిటీలు మాత్రమే ఎక్కువగా కనిపిస్తుంటారు.

అయితే.. ఇలాంటి వారిలో సక్సెస్ ఫుల్ స్టోరీలు కాస్తంత తక్కువనే చెప్పాలి. సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒక రేంజ్ ఫేం ఉన్న ఇద్దరు ప్రముఖులు పెళ్లి చేసుకొని.. పాలు నీళ్ల మాదిరి కలిసిపోయిన జంటలు చాలా తక్కువగా కనిపిస్తుంటాయి. ఒకవేళ పైకి అలా కనిపించినా.. లోలోన ఉండే లుకలుకలు తరచూ గాసిప్స్ మాదిరి వస్తుంటాయి.

ఇలాంటి వాటికి దూరంగా.. క్యూట్ పెయిర్ గా కనిపిస్తారు ప్రముఖ దర్శకులు మణిరత్నం.. సీనియర్ నటి సుహాసిని. వీరిద్దరి పెళ్లి నాటికి ఇద్దరు ఇండస్ట్రీలో ప్రముఖులే. భారత సినిమాను మరో మలుపు తిప్పిన అతి కొద్దిమంది ప్రతిభావంతులైన దర్శకుల్లో మణి ఒకరుగా చెప్పాలి. అలాంటి ఆయన కలల గన్న ప్రాజెక్టు 'పొన్నియిన్ సెల్వన్'. ఈ సినిమా కోసం ఆయన మూడు దశాబ్దాలుగా వెయిట్ చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమా విడుదలకు సిద్ధమై.. ప్రీరిలీజ్ ఫంక్షన్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా నటి కమ్ దర్శకుడు మణి సతీమణి సుహాసిని ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. అంతేకాదు.. పొన్నియిన్ సెల్వన్ ప్రాజెక్టు మణిరత్నంకు ఎంతటి డ్రీం ప్రాజెక్టు అన్న విషయాన్ని ఆమె తన మాటల్లో చెప్పేశారు. దాదాపు 34 ఏళ్ల క్రితం జరిగిన విషయాన్ని ఎంతో ఆసక్తికరంగా చెప్పుకొచ్చారు.

'పెళ్లికి ముందు మణిరత్నంగారు ఒక పెద్ద బ్యాగ్ నాకు గిప్టుగా ఇచ్చారు. అందులో 'పొన్నియిన సెల్వన్' నవల ఐదు భాగాలుగా ఉంది. అదంతా చదివి ఒక్క లైన్ లో చెప్పమన్నారు. నేను ఐదు భాగాల్ని చదివి ఐదు లైన్లుగా రాసి ఇచ్చాను.

ఇలాగేనా రాసేది? అన్నారాయన. అప్పుడు మా పెళ్లి ఆగిపోతుందేమో? అని భయపడ్డాను. కానీ పెళ్లైంది. మా పెళ్లైన 34 ఏళ్లకు 'పొన్నియిన్ సెల్వన్ తీరు' అంటూ చెప్పుకొచ్చారు. సుహాసిని చెప్పిన ఈ మాటలు చాలు.. మణిరత్నంకు ఈ సినిమా (రెండు భాగాలు) ఎంత ఇష్టమో ఇట్టే అర్థం కావటానికి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.