Begin typing your search above and press return to search.

కసిగా ఉన్న యంగ్ డైరెక్టర్..రంగంలోకి దిగాడు

By:  Tupaki Desk   |   10 Oct 2016 7:30 AM GMT
కసిగా ఉన్న యంగ్ డైరెక్టర్..రంగంలోకి దిగాడు
X
తెలుగు పరిశ్రమలో సెంటిమెంట్లు ఎక్కువ. తొలి సినిమాతో హిట్టు కొట్టిన దర్శకుడు రెండో సినిమాతో బోల్తా కొట్టేస్తాడని అంటారు. ఈ కోవలోకి అందరు దర్శకులూ చేరరు కానీ.. మెజారిటీ డైరెక్టర్లు ద్వితీయ విఘ్నాన్ని దాటలేక ఇబ్బంది పడేవారే. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కూడా ఆ జాబితాలోకే చేరాడు. అంచనాల్లేకుండా వచ్చి సంచలన విజయం సాధించిన ‘స్వామిరారా’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సుధీర్ వర్మకు రెండో సినిమాను నాగచైతన్య లాంటి పెద్ద హీరోతో చేసే అవకాశం లభించింది. కానీ అతను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ‘స్వామిరారా’ స్టయిల్లోనే ‘దోచేయ్’ తీసి బోల్తా కొట్టాడు.

దీంతో ఏడాదిరన్నర పాటు గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది సుధీర్. మధ్యలో రవితేజతో సినిమా అన్నారు కానీ.. అది కార్యరూపం దాల్చలేదు. ఇంతలో గ్యాప్ మరింత పెరిగిపోయింది. అయినప్పటికీ సుధీర్ నిరాశ చెందలేదు. ఈసారి కసిగా మరో స్క్రిప్టు రెడీ చేశాడు. తన తొలి సినిమా హీరో నిఖిల్ తోనే ఆ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేశాడు. ఒకేసారి ఐదు సినిమాలతో ప్రొడక్షన్లోకి వస్తున్న అభిషేక్ పిక్చర్స్ బేనర్లో సుధీర్-నిఖిల్ సినిమా కూడా ఒకటి. ఆ మధ్య లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ సినిమా ఆల్రెడీ సెట్స్ మీదికి వెళ్లిపోయింది. రెండు రోజుల కిందటే హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ ఆరంభించారు. కొన్ని రోజుల కిందటే నిఖిల్ తన కొత్త సినిమా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ పూర్తి చేసి ఈ సినిమా మీదికి ఫోకస్ షిఫ్ట్ చేశాడు. మూణ్నాలుగు నెలల్లోనే ఈ సినిమాను పూర్తి చేయాలని పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగాడు సుధీర్. రెండో సినిమా కొట్టిన దెబ్బతో తనేంటో రుజువు చేసుకోవాలని కసితో ఉన్న సుధీర్ నుంచి ఈసారి మంచి సినిమానే వస్తుందని భావిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/