Begin typing your search above and press return to search.

సుధీర్ బాబు సినిమాకు భలే బూస్ట్

By:  Tupaki Desk   |   20 Aug 2016 10:30 PM GMT
సుధీర్ బాబు సినిమాకు భలే బూస్ట్
X
‘భలే మంచి రోజు’ విడుదలై ఎనిమిది నెలలవుతోంది. ఇప్పటిదాకా తన కొత్త సినిమా మొదలుపెట్టలేదు సుధీర్ బాబు. తన తర్వాతి ప్రాజెక్టు విషయంలో ప్రి ప్రొడక్షన్ వర్క్ చాలా కీలకం కావడంతో సుధీర్ వెయిటింగులో ఉన్నాడు. బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కబోతున్న బయోపిక్ లో అతను కథానాయకుడిగా నటించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని హిందీలోనూ తెరకెక్కించనుండటంతో అక్కడి స్క్రీన్ రైటర్ల సాయంతో స్క్రిప్టు వర్క్ మాత్రం జరుగుతోంది. ప్రాజెక్టు పక్కాగా ఎప్పుడు పట్టాలెక్కుతుందనే విషయంలో క్లారిటీ లేదు.

ఇలాంటి టైంలో ఈ సినిమాకు మంచి బూస్ట్ ఇచ్చే పరిణామాలు జరిగాయి. గోపీచంద్ శిష్యురాలు పి.వి.సింధు ఒలింపిక్స్‌ లో అద్భుత ప్రదర్శన చేస్తూ రజతం గెలిచి చరిత్ర సృష్టించింది. దీంతో గోపీ ప్రతిష్ట మరింత పెరిగింది. ఇప్పటికే సైనా రూపంలో ఓ ఒలింపిక్ పతక విజేతను అందించిన గోపీ.. ఇప్పుడు సింధుతో మరింత గొప్ప ఘనత అందుకునేలా చేశాడు. దీంతో భారత క్రీడా చరిత్రలోనే అత్యంత గొప్ప కోచ్ ల్లో ఒకడిగా కితాబులందుకుంటున్నాడు గోపీ. దేశమంతా అతడి కృషిని గుర్తించి ప్రశంసలు కురిపిస్తోంది. ఈ పరిణామాలు గోపీచంద్ బయోపిక్ కు ఎంతగా కలిసొస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుధీర్ బాబు కూడా ఒకప్పుడు బ్యాడ్మింటన్ క్రీడాకారుడే కావడంతో గోపీ పాత్రను పర్ఫెక్టుగా చేయగలడని భావిస్తున్నారు.