Begin typing your search above and press return to search.

నితిన్ ఫాద‌ర్‌ బైట‌ప‌డేదెలా?

By:  Tupaki Desk   |   18 Nov 2015 7:30 PM GMT
నితిన్ ఫాద‌ర్‌ బైట‌ప‌డేదెలా?
X
నితిన్ తండ్రి సుధాక‌ర్‌ రెడ్డి నైజాం ఏరియాలో టాప్ డిస్ర్టిబ్యూట‌ర్ అన్న సంగ‌తి తెలిసిందే. ఓ వైపు పంపిణీదారుడిగా ఎస్టాబ్లిష్ అవుతూ నిర్మాత అయ్యారు. సొంతంగానే శ్రేష్ఠ్‌మూవీస్ బ్యాన‌ర్‌ లో సినిమాల్ని నిర్మించారు. త‌న‌యురాలు నిఖితారెడ్డి నిర్మాత‌గా ఇష్క్‌ - గుండె జారి గ‌ల్లంత‌య్యిందే వంటి విజ‌య‌వంత‌మైన సినిమాల్ని నిర్మించారు. ఆ రెండు సినిమాల‌తో నితిన్ హీరోగా స‌క్సెస్ బాట‌లోకి వచ్చాడు. సొంత బ్యాన‌ర్ సినిమాల‌కు ముందు.. అప్ప‌టికే వ‌రుస ప‌రాజ‌యాల్లో ఉన్న నితిన్ పూర్తిగా ట్రాక్‌ లోకి వ‌చ్చాడు. ఈ సినిమాల వ‌ల్ల సుధాక‌ర్‌ రెడ్డికి బోలెడ‌న్ని లాభాలొచ్చాయి.

ఆ క్ర‌మంలోనే సుధాక‌ర్‌ రెడ్డి నిర్మాత‌గానూ మ‌రో లెవ‌ల్‌ కి ఎద‌గాల‌ని ట్రై చేస్తూ అక్కినేని న‌టవార‌సుడు అఖిల్‌ ని లాంచ్ చేస్తూ అఖిల్ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్ ఫ‌లితాన్ని మిగిల్చింది. సుధాక‌ర్‌ రెడ్డికి దాదాపు 20 కోట్లు న‌ష్టాల్ని మిగిల్చింది. అస‌లే డెబ్యూ హీరో - పైగా భారీ బ‌డ్జెట్ దీంతో నిర్మాత‌ల‌కు అది పెద్ద ఝ‌ల‌క్ ఇచ్చిన‌ట్ట‌య్యింది. ఓవైపు ద‌స‌రా బ‌రిలో రిలీజ‌వుతుంద‌నుకున్న అఖిల్ దీపావ‌ళి వ‌ర‌కూ వాయిదా ప‌డ‌డంతో అప్ప‌టికే భారీ మొత్తాల్ని వెచ్చించి కొనుక్కునేందుకు ముందుకొచ్చిన కొంద‌రు బ‌య్య‌ర్లు వెనక్కి త‌గ్గ‌డం న‌ష్టాల‌కు మ‌రికొంత కార‌ణం అయ్యింద‌ని చెబుతున్నారు.

నితిన్ వ‌ల్ల స‌క్సెస్ చూసిన సుధాక‌ర్‌ రెడ్డికి అఖిల్ చిత్రం వ‌ల్ల న‌ష్ట‌పోవాల్సొచ్చింది. ఈ న‌ష్టాలు తీవ్రంగా ఇబ్బందుల్లోకి నెట్టాయ‌ని చెబుతున్నారు. ఈ ఆర్థిక క‌ష్టాల నుంచి అత‌డు బైట‌ప‌డాలంటే ఇప్ప‌ట్లో కుదిరే ప‌నే కాద‌ని విశ్లేషిస్తున్నారు. మళ్లీ సినిమాలు నిర్మించి వ‌రుస విజ‌యాలు అందుకుంటేనే డెఫిసిట్ నుంచి బైట‌ప‌డ‌డం సాధ్య‌మ‌వుతుంది. ఈ ప్రాసెస్‌ కి కొన్ని సంవ‌త్స‌రాలు ప‌డుతుంద‌ని అనుకుంటున్నారు. అదీ సంగ‌తి.