Begin typing your search above and press return to search.

వెంకీ తర్వాతే మాధవన్ లైన్లోకి వచ్చాడట

By:  Tupaki Desk   |   21 March 2017 8:39 AM GMT
వెంకీ తర్వాతే మాధవన్ లైన్లోకి వచ్చాడట
X
విక్టరీ వెంకటేష్ కొత్త సినిమా ‘గురు’ తమిళ-హిందీ భాషల్లో సూపర్ హిట్టయిన ‘ఇరుదు సుట్రు/సాలా ఖడూస్’కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఒరిజినల్లో మాధవన్ పోషించిన పాత్రను వెంకీ తెలుగులో చేస్తున్నాడు. ఐతే విశేషం ఏంటంటే.. ఈ సినిమాను ముందుగా తెలుగులోనే చేయాలనుకున్నారట. దర్శకురాలు సుధ కొంగర ముందు వెంకీకే ఈ స్క్రిప్టును వినిపించిందట. ఐతే ఆ సమయానికి వెంకీ డెంగీ జ్వరంతో బాధపడుతుండటం.. ఇంకొన్ని కారణాల వల్ల ఈ సినిమా చేయడానికి ముందుకు రాలేదట. దీంతో మాధవన్ ను సంప్రదించి తమిళ.. హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించిందట సుధ. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించింది.

‘‘మణిరత్నం గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న సమయంలో ఈ ఐడియా వచ్చింది. మూడు నాలుగేళ్ల పాటు రీసెర్చ్ చేసి ఈ కథ రెడీ చేశాను. అందుకోసం 250 మంది బాక్సర్లను.. కోచ్ లను కలిశాను. కథ రెడీ అవ్వగానే కలిసింది వెంకటేష్ గారినే. కానీ ఆయన కొన్ని కారణాలతో సినిమా చేయలేకపోయారు. తర్వాత హిందీ-తమిళంలో ఈ చిత్రాన్ని పూర్తి చేసి ముందు వెంకీ గారికే చూపించాను. ఆయనకు నచ్చింది. ఇప్పుడు నన్ను పెట్టి తెలుగులో సినిమా తీయ్.. అన్నారు. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నపుడు ఎంతోమంది హీరోల్ని చూశాను. కానీ వెంకీ గారిలో ఉన్నంత కమిట్మెంట్.. సిన్సియారిటీ ఇంకెవ్వరిలోనూ చూడలేదు. ఆయన గాయపడ్డా కూడా షూటింగ్ ఆపించలేదు’’ అని సుధ కొంగర తెలిపింది. సుధ తెలుగులో ‘ఆంధ్రా అందగాడు’ అనే చిన్న సినిమాతో దర్శకురాలిగా పరిచయమై.. ఆ తర్వాత తమిళంలో ‘ద్రోహి’ అనే ఫ్లాప్ సినిమా తీసి.. ‘ఇరుదు సుట్రు’తో తనేంటో రుజువు చేసుకుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/