Begin typing your search above and press return to search.

విజ‌యం ఓ వైపు విషాదం మ‌రోవైపు ఏది గొప్ప‌?

By:  Tupaki Desk   |   6 Feb 2022 11:30 AM GMT
విజ‌యం ఓ వైపు విషాదం మ‌రోవైపు ఏది గొప్ప‌?
X
ఆమెను మ‌ధుర గాత్ర మ‌హారాణి అని అభివ‌ర్ణించారు తార‌క్ (వ‌ర్థ‌మాన సినీ క‌థానాయకుడు)..విషాద కాలాల్లో వినిపించిన,అర్హం అనిపించిన మాట, అర్థ‌వంతం అయిన మాట ఒక‌టి జీవితాన ప‌ల‌క‌రిస్తోంది.ల‌తాజీ మీరు ! మిగిల్చిన విషాదం ఓ వైపు, ఈ కుర్రాళ్లు (టీం ఇండియా అండ‌ర్ 19 విభాగం క్రికెట‌ర్లు) మ‌రోవైపు..జీవితం రెండు కొనల చెంత నిల్చొని రెండు వేర్వేరు సంద‌ర్భాలు శాసిస్తున్న విధంగా ఉంది ఈ ఆదివారం. ఈ వారాంత విషాదం ఈ వారాంత విజ‌యం రెండూ వేర్వేరు.. విష‌య వివేచ‌న చేసుకుంటే రెండూ వేర్వేరే ! కానీ విషాదాన్ని ఛేదించ‌డం కుద‌ర‌ని ప‌ని కానీ ఆ విజ‌యాన్ని చిర స్మ‌ర‌ణీయం చేయ‌డం మాత్రం భార‌తీయ‌ల బాధ్య‌త.మాకు తెలుసు దేశం గెలిస్తే మీరు ఆనందిస్తార‌ని! క‌న్నీటి ప‌ర్యంతాల చెంత మేమున్నా మా విజ‌యాల‌ను మీరు స్వాగ‌తిస్తార‌ని! ల‌తాజీ !మా విజ‌యం మీదే.. ఈ విషాదం మాదే! న‌మ‌స్సులు మీకు.

నిన్న‌టి వేళ యావ‌త్ భార‌తావ‌ని ఆనందోత్సాహ సంరంభంలో నిలిచిపోయింది. అండ‌ర్ - 19 విభాగంలో టీంఇండియా క్రికెట్ జ‌ట్టు విజేత‌గా నిలిచి, జాతికి శుభ‌వార్త అందించింది.2018లోచోటు చేసుకున్న ఈ అద్భుతం మ‌ళ్లీ ఇప్పుడు న‌మోదుకు నోచుకోవ‌డంతో అంతా అమితోత్సాహంతో ఉన్నారు. మ‌న యువ క్రికెట‌ర్ల‌ను అభినంద‌ల వెల్లువ‌ల్లో ముంచెత్తుతున్నారు.

ఇంగ్లాండ్ పై జ‌రిగిన ఫైనల్ మ్యాచ్ లో నాలుగు వికెట్ల తేడాతో విజ‌య నాదం వినిపించి, అస‌మాన ప్ర‌తిభ‌కు తార్కాణం అయి నిలిచింది. చిర‌స్మ‌ర‌ణీయ విజ‌యం చెంత చిర స్మ‌ర‌ణీయ విషాదం కూడా ఈ ఉద‌యం ప‌ల‌క‌రించింది. భార‌త ర‌త్న‌, గాన కోకిల ల‌తా మంగేష్క‌ర్ ఈ ఉద‌యం తుది శ్వాస విడిచి వెళ్లారు.ఆమె వెళ్లిపోవ‌డం అనే విషాదం,మ‌న యువ క్రికెట‌ర్లు నెగ్గుకు రావ‌డం అనే సంతోషం ఈ రెండూ వేర్వేరు కావొచ్చు. కాలం చెంత ఈ రెండూ న‌మోదిత సంద‌ర్భాలు..చ‌రిత్ర‌కు ఇవే అపురూపం అయిన ఘ‌ట్టాలు విషాదం అయిన సంద‌ర్భాలు కూడా!

ల‌తాజీ వెళ్లిపోవ‌డం అని రాయ‌డంలో త‌ప్పులున్నాయి. ఆమె పంచిన గానామృతాల‌ను ఇంకా భార‌తీయుల వ‌దిలిపోలేదు. ఆ విధంగా జ‌రిగిన రోజు ఆమె వెళ్లిపోయారు అని రాయాలి.. ఆమె భౌతికంగా లేక‌పోవ‌డాన్ని మ‌ర‌ణ కాలం నిర్ణ‌యిస్తుంది.ఆమె మ‌న మ‌ధ్య స్వ‌ర శాస్త్ర సంగ‌మ క్షేత్రాల‌లో లేక‌పోవ‌డాన్ని మాత్రం మ‌న‌మే ఏ పాప‌మోచేసి వ‌దులుకోవాలి.త‌ప్ప మ‌న‌లోనే ఆమె ఉంటారు.పుణ్య లోకాల చెంత మ‌న‌లోనే ఉంటారు. దైవార్చ‌న‌ల్లో మ‌న‌తోనే ఉంటారు. విషాద కాల విజ్ఞాప‌నల చెంత కూడా ఆమె మ‌న‌తోనే ఉంటారు. విషాద కాల విజ్ఞాప‌న‌ల్లో ఆమె వినిపించిన గీతాల‌ను మ‌రోసారి స్మ‌ర‌ణ చేయ‌డం ఇప్ప‌టి బాధ్య‌త..
అవును! విజ‌యం విషాదం అన్న‌వి రెండూ వేర్వేరు.

కాల గ‌మ‌న ప‌ట్టిక లో ఒక‌టి మ‌రోదానితో చేసే భేదం కూడా మ‌న‌కు అత్యంత అవ‌సరం.విషాదాన్ని విభేదిస్తే విజ‌యం..విజ‌యాన్ని విస్తృతం చేసే క్ర‌మాన జీవితం ఓ అంతిమ శిఖ‌రాన్ని చేరుకుంటుంది. ఆ శిఖ‌రం ద‌గ్గ‌ర ల‌తాజీ ఉంటారు. శిఖ‌రం పాదం ద‌గ్గ‌ర యావ‌త్ భార‌తావ‌ని ఉంటుంది.మ‌న టీంఇండియా కుర్రాళ్లు కూడా ఉంటారు. క‌నుక విజ‌యం ద్వారా ద‌క్కిన ఖ్యాతి ఆమె విషాదం రెండూ వేర్వేరు కానీ ఈ విజ‌యం ద‌క్కిన వేళ ఆమె పాదాల ద‌గ్గ‌ర ఉంచి ఆమెకు అంకితం ఇవ్వ‌డ‌మే కుర్ర క్రికెట‌ర్లు చేయాల్సిన ప‌ని.. బాధ్య‌త అని రాయాలి. పని కాదు బాధ్య‌త.ల‌తాజీ మీకు మా న‌మ‌స్సు....