Begin typing your search above and press return to search.

అప్పుడే బెనిఫిట్ షో రేంజికి ఎదిగిపోయాడా?

By:  Tupaki Desk   |   14 Sep 2015 11:30 AM GMT
అప్పుడే బెనిఫిట్ షో రేంజికి ఎదిగిపోయాడా?
X
ఏడాది కిందట ఈ సమయానికి మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ పరిస్థితి ఏదోలా ఉంది. రేయ్ ఎంతకీ విడుదల కాకపోగా.. రెండో సినిమా ‘పిల్లా నువ్వు లేని జీవితం’ ఏమవుతుందో అన్న టెన్షన్ అతణ్ని వెంటాడుతూ ఉండేది. కానీ ఇప్పుడు అతడి మూడో సినిమా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ బంపర్ క్రేజ్ మధ్య రిలీజవబోతోంది. రేయ్ చేదు అనుభవాన్నే మిగిల్చినప్పటికీ.. ‘పిల్లా నువ్వు లేని జీవితం’ మంచి విజయం సాధించడంతో సాయి ఒక్కసారిగా క్రేజీ హీరోగా మారిపోయాడు. దిల్ రాజు వరుస బెట్టి అతడితో సినిమాలు తీస్తుండటంతో మెగా కుర్రాడిపై జనాలకు బాగానే గురి కుదిరింది. ‘రామయ్యా వస్తావయ్యా’ లాంటి డిజాస్టర్ తర్వాత హరీష్ తీసిన సినిమా అయినప్పటికీ ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ మంచి హైప్ తెచ్చుకుంది.

ఈ నెల 24న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ను విడుదల చేస్తున్నారు. ట్రైలర్ - పాటలు ఆకట్టుకోవడంతో సినిమా హిట్టవడం ఖాయమన్న కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది యూనిట్ సభ్యుల్లో. ఈ సినిమాకు ముందు రోజు యుఎస్ లో ప్రీమియర్ షోలు, హైదరాబాద్ లో విడుదల రోజు ఉదయం బెనిఫిట్ షో కూడా వేస్తుండటం విశేషం. యుఎస్ లో ప్రీమియర్లు వేయడం పెద్ద విషయం కాదు కానీ.. తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ షో పడాలంటే మాత్రం హీరోకు ఓ రేంజి ఉండాలి. పవన్ కళ్యాణ్ - మహేష్ బాబు - ఎన్టీఆర్ - రామ్ చరణ్ - అల్లు అర్జున్ - బాలకృష్ణ లాంటి బడా స్టార్ లకు మాత్రమే బెనిఫిట్ షోలు వేస్తారు. ఈ మధ్య కిక్-2తో రవితేజ కూడా ఆ క్లబ్ లో చేరాడు. ఐతే రెండు సినిమాల అనుభవంతో సాయిధరమ్ తేజ్ బెనిఫిట్ షో రేంజికి ఎదిగిపోవడం విశేషమే. కూకట్ పల్లిలోని అర్జున్ థియేటర్ లో ఉదయం 6 గంటలకు బెనిఫిట్ షో ప్లాన్ చేస్తున్నారు మెగా అభిమానులు. ఏపీలోని ఇంకొన్ని నగరాల్లోనూ ఇలాంటి షోలకు ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి మెగా కుర్రాడు అప్పుడే స్టార్ ఇమేజ్ సంపాదించేసినట్లున్నాడు.