Begin typing your search above and press return to search.

మెగామూవీ గురించి రెడ్డి గారి శపథం

By:  Tupaki Desk   |   5 Feb 2018 8:54 AM GMT
మెగామూవీ గురించి రెడ్డి గారి శపథం
X
అభిమానులు నమ్మకపోయినా, మీడియా పట్టించుకోవడం మానేసినా దీనబంధు డాక్టర్ టి సుబ్బరామిరెడ్డి గారు మాత్రం చిరంజీవి-పవన్ కళ్యాణ్ తో తాను తీస్తానని చెప్పిన మల్టీ స్టారర్ ఆగే ప్రసక్తే లేదని మరో సారి తేల్చి చెప్పారు. వరంగల్ సందర్శన నిమిత్తం విచ్చేసిన రెడ్డి గారు మరోసారి మెగా మూవీ గురించి ప్రస్తావన తెచ్చారు. త్రివిక్రమ్ ఈ పాటికే స్క్రిప్ట్ సగం పూర్తి చేసాడని చెబుతున్న ఆయన ఈ భారీ బడ్జెట్ సినిమాకు మూడో హీరో స్క్రిప్ట్ అని చెబుతున్నారు. చిరు - పవన్ ఇద్దరు ఓకే చెప్పారని, ఇక సెట్స్ పైకి వెళ్ళడమే ఆలస్యం అన్నట్టుగా మాట్లాడుతున్న రెడ్డి గారు ఫాన్స్ ని మాత్రం మరోసారి అయోమయంలోకి నెట్టేశారు. అసలు మాట్లాడకపోతే ఏ సమస్యా లేదు కాని ఇలా అప్ డేట్ చేస్తూ ఉంటేనే లేనిపోని అనుమానాలు వస్తాయి.

చిరంజీవి సైరా నరసింహరెడ్డి పూర్తయ్యే వరకు వేరే ఆలోచన చేసే స్థితిలో లేరు. ఎంత లేదన్నా కనీసం ఏడాదికి పైగానే పడుతుంది. ఆలోపు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పకుండా అందులోనే కొనసాగుతూ ఉంటే మాత్రం వచ్చే ఎన్నికలకు ప్రచార బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు తాను కమిట్ అయిన సినిమాలే చేయలేను అని పవన్ కళ్యాణ్ కుండ బద్దలు కొట్టినట్టు చెబుతున్నాడు. మాట తీసుకున్న మైత్రి మూవీ మేకర్స్, సూర్య మూవీస్ సంస్థలు ఇంకా డైలమా నుంచి తేరుకోలేదు. జనసేన పార్టీ కోసం ఇకపై క్షేత్ర స్థాయిలోనే ఉంటాను అని పవన్ చాలా స్పష్టంగా చెప్పేసాడు. సో ఇప్పట్లో కాదు కదా మరో రెండేళ్ళు సినిమా ఆలోచన చేయలేడు పవన్.

మరి సుబ్బరామి రెడ్డి గారు ఏ నమ్మకంతో ఇది ఇంకా పట్టాలు ఎక్కుతుంది అని భరోసా ఇస్తున్నారో అర్థం కావడం లేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా కోసం స్క్రిప్ట్ మీద తలముకలై ఉన్నాడు. అది అయ్యాక వెంకటేష్ ది సిద్ధంగా ఉంటుంది. ఈ నేపధ్యంలో తను కూడా వచ్చే పరిస్థితిలో లేడు. అలాంటప్పుడు సీనియర్ నిర్మాత, అందరికి ఆత్మ బంధువుగా భావించే సుబ్బిరామి రెడ్డి గారు ఇలా పదే పదే మెగా సినిమా గురించి చెప్పడం నమ్మశక్యంగా లేకపోవడం కాదు కొంత హాస్యాస్పదంగా కూడా ఉంది. చిరు, పవన్ లలో ఏ ఒక్కరు చెప్పినా నమ్మొచ్చు కాని అది జరిగే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు.