Begin typing your search above and press return to search.

బాలీవుడ్ స్టార్ హీరోకు వింత‌ వ్యాధి!

By:  Tupaki Desk   |   11 May 2022 8:30 AM GMT
బాలీవుడ్ స్టార్ హీరోకు వింత‌ వ్యాధి!
X
బాలీవుడ్ కండ‌ల వీరుడుగా స‌ల్మాన్ ఖాన్ కు మంచి పేరుంది. ఎంద‌కంటే సినిమాల్లో ఎంత జోవియ‌ల్ గా వుంటారో బ‌య‌ట అంత ఫిట్ నెస్ తో క‌నిపిస్తారు. ఫిట్ నెస్ విష‌యంలో ఏ ఒక్క ఛాన్స్ కూడా తీసుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. నిత్యం వ‌ర్క‌వుట్ లు చేస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు పూర్తి ఫిట్ తో క‌నిపిస్తుంటారు స‌ల్మాన్ ఖాన్‌. ఇంత ఫిట్ గా వుండే స‌ల్మాన్ ఖాన్ గ‌త కొంత కాలంగా వింత వ్యాధిలో బాధ‌ప‌డుతున్నార‌ట‌. ఈ విష‌యం సినీ ప్ర‌పంచాన్ని షాక్ కు గురిచేస్తోంది. ఫిట్ నెస్ విష‌యంలో నిత్యం రాజీప‌డ‌ని స‌ల్మాన్ వింత వ్యాధితో బాధ‌ప‌డ‌టం ఏంట‌ని అంతా ఆరా తీస్తున్నారు.

2017లో వ‌చ్చిన 'ట్యూబ్ లైట్‌' సినిమా స‌మ‌యంలో త‌న‌కు వింత వ్యాధి వున్న విష‌యాన్ని స‌ల్మాన్ ఖాన్ బ‌య‌ట‌పెట్టిన‌ట్టుగా తెలుస్తోంది. ప్ర‌పంచంలోనే అత్యంత ప్ర‌మాద‌క‌ర వ్యాధుల్లో ఇది ఒక‌ట‌ని చెబుతున్నారు. తాజా వార్త‌ల ప్ర‌కారం స‌ల్మాన్ ఖాన్ గ‌త కొంత కాలంగా 'ట్రిజెమిన‌ల్ న్యూర‌ల్జియా' అనే ప్ర‌మాద‌క‌ర వ్యాధితో బాధ‌ప‌డుతున్నార‌ట‌. ఈ వ్యాధి వున్న వాళ్ల‌ల్లో ప్ర‌ధానంగా వుండే ల‌క్ష‌ణాలు ఇలా వుంటాయట. న‌రాల స‌మ‌స్య వ‌ల్ల క‌లిగే ఈ వ్యాధి వ‌ల్ల ఎక్కువ సేపు మాట్లాడినా మూతి వంక‌ర్లు పోతుంద‌ని, ముఖ న‌రాల వ‌ల్ల ముఖం భాగం చాలా నొప్పిని భ‌రించ‌లేకుండా వుంటుంద‌ట‌.

అంతే కాకుండా బ్రేష్ చేసినా, మేక‌ప్ వేసుకున్నా విప‌రీత‌మైన నొప్పి వుంటుందని, కొన్ని సంద‌ర్భాల్లో ఈ వ్యాధి వున్న వారు ఈ నొప్పిని భ‌రించ‌లేక ఆత్మ‌హ‌త్య కూడా చేసుకునే ప్ర‌మాదం వుంద‌ని చెబుతున్నారు. ఇదే త‌ర‌హా ఇబ్బందుల్ని గ‌త కొంత కాలంగా బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ ఎదుర్కొంటున్నార‌ట‌.

అయినా ఆ బాధ‌ని ఎక్క‌డా వ్య‌క్తం చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇక ఈ వ్యాధితో బాధ‌ప‌డుతున్న స‌ల్మాన్ కు చాలా సార్లు సూసైడ్ చేసుకోవాల‌నే ఆలోచ‌న కూడా క‌లిగింద‌ని ఇటీవ‌ల ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో స్వ‌యంగా స‌ల్మాన్ ఖాన్ వెల్ల‌డించాడం ప‌లువురిని షాక్ కు గురిచేస్తోంది.

అయితే ఈ వింత వ్యాధి నుంచి త‌న‌ని తాను కాపాడు కోవ‌డం కోసం గ‌త కొంత కాలంగా యుద్ధం చేస్తున్న స‌ల్మాన్ ఖాన్ తాజాగా కొంత వ‌ర‌కు కోలుకున్నార‌ట‌. పూర్తి స్థాయిలో ఈ వ్యాధి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు స‌ల్మాన్ త‌న వంతు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని బాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇదిలా వుంటే ప్ర‌స్తుతం స‌ల్మాన్ ఖాన్ వ‌రుస‌గా భారీ ప్రాజెక్ట్ ల‌లో న‌టిస్తున్నారు.

తెలుగులో మెగాస్టార్ న‌టిస్తున్న 'గాడ్ ఫాద‌ర్‌' లో కీల‌క అతిథి పాత్ర‌లో న‌టించిన స‌ల్మాన్ క‌బీ ఆద్ క‌భీ దివాలీ, టైగ‌ర్ 3 చిత్రాల‌తో పాటు షారుక్ ఖాన్ రీ ఎంట్రీ ఇస్తున్న 'ప‌ఠాన్‌'లో గెస్ట్ క్యారెక్ట‌ర్ చేస్తున్నారు. ఇవ‌న్నీ ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వున్నాయి.