Begin typing your search above and press return to search.

#STR47 ఫస్ట్ లుక్: గౌతమ్ మీనన్ - శింబు కాంబోలో హ్యాట్రిక్ మూవీ..!

By:  Tupaki Desk   |   6 Aug 2021 9:30 AM GMT
#STR47 ఫస్ట్ లుక్: గౌతమ్ మీనన్ - శింబు కాంబోలో హ్యాట్రిక్ మూవీ..!
X
కోలీవుడ్ హిట్ కాంబినేషన్స్ లో స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ - స్టార్ హీరో శింబు కలయిక ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. గతంలో వీరి కాంబోలో వచ్చిన 'విన్నై తాండి వరువాయా' 'అచ్చం యెన్బదు మడమైదా' చిత్రాలు సూపర్ హిట్స్‌ గా నిలిచాయి. ఈ రెండు సినిమాలు తెలుగులో నాగచైతన్య హీరోగా 'ఏమాయ చేసావే' 'సాహసం శ్వాసగా సాగిపో' అనే పేర్లతో తెరకెక్కిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు శింబు - గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ రూపొందుతోంది. #STR47 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేశారు.

#STR47 చిత్రానికి ముందుగా ‘నాదిగలై నీరదమ్ సూర్యన్’ అని పేరు పెట్టారు. అయితే ఇప్పుడు ఈ టైటిల్ ని మార్చేసి ''వెందు తనిందంతు కాడు'' అని పేరు ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో శింబు చినిగిపోయిన చొక్కా - లుంగీలో చేతిలో ఓ దోటి పట్టుకుని ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నాడు. అంతేకాదు చాలా యంగ్ గా డీ గ్లామరస్ గా ఉన్నాడు. బ్యాగ్రౌండ్ లో అడవి తగలబడుతూ కనిపిస్తోంది. మొత్తం మీద శింబు కెరీర్‌ లో ఇంతకముందు ఎప్పుడూ చేయని సరికొత్త పాత్రలో శింబు నటిస్తున్నారని ఫస్ట్ లుక్ చూస్తే తెలుస్తోంది. సెన్సిబుల్ లవ్ స్టోరీలను పేరుగాంచిన గౌతమ్ మీనన్.. ఈసారి డిఫరెంట్ కాన్సెప్ట్ తో రాబోతున్నాడని అర్థం అవుతోంది.

''వెందు తనిందంతు కాడు'' చిత్రానికి ఆస్కార్ అవార్డ్ విన్నిర్ ఏ.ఆర్. రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇది గౌతమ్ మీనన్ - శింబు - రెహమాన్ కలయికలో వస్తున్న మూడో సినిమా. వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఇషారి కె. గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తో సినిమాపై ఆసక్తిని కలిగించిన ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. ఇకపోతే గౌతమ్ మీనన్ 'నవరస' వెబ్ సిరీస్ లో ఓ భాగానికి దర్శకత్వం వహించడమే కాకుండా.. నటించారు. మణిరత్నం రూపొందించిన ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ఈరోజు నుంచి అందుబాటులోకి వచ్చింది. శింబు విషయానికొస్తే.. వెంకట్ ప్రభు దర్శకత్వంలో 'మానాడు' (తెలుగులో 'రీవైండ్') అనే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ లో కూడా నటిస్తున్నారు. అలానే కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ 'ముఫ్తీ' ని తమిళ్ లో రీమేక్ చేస్తున్నారు. స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి నార్తాన్ దర్శకత్వం వహిస్తున్నారు.