Begin typing your search above and press return to search.

'బజరంగీ భాయిజాన్' సీక్వెల్ కి కథ రెడీ అయిందబ్బా!

By:  Tupaki Desk   |   18 March 2022 2:30 AM GMT
బజరంగీ భాయిజాన్ సీక్వెల్ కి కథ రెడీ అయిందబ్బా!
X
2015 జూలై 10వ తేదీన రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి' సంచలన విజయాన్నిసాధించింది. ఇక అదే ఏడాది కబీర్ ఖాన్ దర్శకత్వంలో జూలై 17 వ తేదీన విడుదలైన 'బజరంగీ భాయిజాన్' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ రెండు సినిమాలు కూడా భారతీయ సినిమా గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించాయి.

ఈ రెండు సినిమాలు పట్టణాలు .. టౌన్లు .. గ్రామాలు అని తేడా లేకుండా, ఎక్కడ విడుదలైతే అక్కడ వసూళ్ల వర్షాన్ని కురిపించాయి. దేశ వ్యాప్తంగా బాక్సాఫీస్ బద్ధకాన్ని వదిల్చి వేసిన ఈ రెండు సినిమాలకు కథలను అందించినది ఒకే రచయిత అని తెలుసుకుని అంతా ఆశ్చర్యపోయారు.

అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రాలుగా నిలిచిన ఈ సినిమాలకు కథలను విజయేంద్ర ప్రసాద్ అందించారు. రచయితగా ఆయన చాలా కాలం నుంచి చిత్రపరిశ్రమలో ఉన్నారు. ఆయన కథలను అందించిన ఎన్నో సినిమాలు భారీ విజయాలను నమోదు చేశాయి.

అయితే రాజమౌళి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి విజయేంద్ర ప్రసాద్ కథలకు ఎక్కువ న్యాయం జరుగుతూ వచ్చింది. అప్పటి నుంచే ఆయన అందరికీ తెలిశారు. ఇన్నేళ్ల అనుభవం కారణంగా విజయేంద్ర ప్రసాద్ చేయితిరిగిన రచయితగా మారిపోయారు. దేశవ్యాప్తంగా ఫేమస్ అయిపోయారు.

విజయేంద్ర ప్రసాద్ కి ఒక కథను ఎక్కడ మొదలుపెట్టాలో .. ఎక్కడ పూర్తిచేయాలో .. మధ్యలో దాని ప్రయాణం ఎలా సాగాలో బాగా తెలుసు. కథలో సస్పెన్స్ ను ఎప్పుడు ఎక్కడ ఎలా రివీల్ చేయాలనే విషయాలపై ఆయనకి మంచి అవగాహన ఉంది.

అలాంటి ఆయన 'బాహుబలి' కథకి సీక్వెల్ రెడీ చేస్తే, మొదటి భాగానికి మించిన విజయాన్ని సాధించింది. దాంతో 'బజరంగీ భాయీజాన్' సినిమాకి కూడా సీక్వెల్ చేస్తే బాగుంటుందనే విషయం ఎప్పటి నుంచో నానుతోంది. అభిమానులు కూడా అదే ఆశతో ఎదురుచూస్తున్నారు.

ఇక రెండేళ్లుగా విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా సీక్వెల్ కథపైనే కసరత్తు చేస్తూ వచ్చారట. కథ బాగా వచ్చిందని తనకి అనిపించిన తరువాతనే సల్మాన్ ను కలిసి వినిపించాడట. కథ చాలా కొత్తగా ఉండటం .. ఆడియన్స్ కి వెంటనే కనెక్ట్ అయ్యే అంశాలు ఉండటం వలన సల్మాన్ ఈ సీక్వెల్ చేయడానికి ఉత్సాహాన్ని చూపుతున్నాడట.

అయితే మొదటి భాగాన్ని తెరకెక్కించిన కబీర్ ఖాన్ ఈ సీక్వెల్ ను రూపొందిస్తాడా? లేదంటే వేరే దర్శకుడు ఎంట్రీ ఇస్తాడా? అనే విషయంలో క్లారిటీ రానుందని అంటున్నారు. 'బజరంగీ భాయిజాన్' కథ 1987లో వచ్చిన 'పసివాడి ప్రాణం' కథలో నుంచి పుట్టిందని గతంలో విజయేంద్ర ప్రసాద్ చెప్పిన సంగతి తెలిసిందే.