Begin typing your search above and press return to search.

ధృవ ఒరిజినల్.. ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ

By:  Tupaki Desk   |   12 Dec 2016 11:17 AM GMT
ధృవ ఒరిజినల్.. ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ
X
‘ధృవ’ సినిమా ఇప్పుడు టాలీవుడ్లో పెద్ద సంచలనం. తెలుగులో ఒక స్టార్ హీరో ఇలాంటి ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ చేయడం అరుదు. అందులోనూ రొటీన్ మాస్ క్యారెక్టర్లు చేసే రామ్ చరణ్ ఇలాంటి కథలో నటిస్తాడని ఎవరూ అనుకోలేదు. అతడికిది ఒక మేకోవర్ లాంటి సినిమా. చరణ్ హీరో ఇమేజ్ గురించి పట్టించుకోకుండా.. కథలో ఇమిడిపోయేలా అతడి పాత్రను తీర్చిదిద్దిన తీరు ఆకట్టుకుంది. ఇక ఇందులోని కథాకథనాల గురించి.. విలన్ పాత్ర గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాలి. ఇదంతా కూడా ‘తనీ ఒరువన్’ దర్శకుడు మోహన్ రాజా క్రెడిటే. ‘ధృవ’ టీమ్ కూడా అతడికి తగిన గౌరవాన్నే ఇచ్చింది. సినిమా విజయంలో అతడి పాత్రను కొనియాడింది.

మోహన్ రాజా నేపథ్యం చూస్తే అతను ‘తనీ ఒరువన్’ లాంటి సినిమా తీస్తాడని ఎవ్వరూ ఊహించి ఉండదు. ఎడిటర్ మోహన్ పెద్ద కొడుకైన రాజా దర్శకుడిగా తొలి సినిమా చేసింది తెలుగులోనే. ఓ మలయాళ సినిమాను ‘హనుమాన్ జంక్షన్’గా రీమేక్ చేశాడతను. ఆ సినిమా ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. ఆ తర్వాత తన తమ్ముడు రవిని హీరోగా పరిచయం చేస్తూ తమిళంలో ‘జయం’ను రీమేక్ చేశాడు. అది తెలుగులో లాగే బ్లాక్ బస్టర్ అయింది. రవి.. ‘జయం రవి’ అయ్యాడు. రాజా.. ‘జయం రాజా’ అయ్యాడు. ఆ తర్వాత అన్నదమ్ములిద్దరూ కలిసి వర్షం.. అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి.. బొమ్మరిల్లు.. కిక్ లాంటి సినిమాల్ని రీమేక్ చేశారు. అన్నీ కూడా బాగా ఆడాయి. విజయ్ హీరోగా ‘ఆజాద్’ సినిమాను కూడా రీమేక్ చేశాడు రాజా. అది కూడా హిట్టయింది. ఐతే ఎన్ని హిట్లు కొట్టినప్పటికీ రాజాకు దర్శకుడిగా పెద్ద పేరు రాలేదు. ఎందుకంటే అతడివన్నీ రీమేకులే.

ఇలాంటి సమయంలో రాజా.. ‘తనీ ఒరువన్’ లాంటి సెన్సేషనల్ సినిమా తీశాడు. ‘రంగం’ ఫేమ్ కేవీ ఆనంద్ సినిమాలకు రచయితలుగా పని చేసే రచయితల ద్వయం శుభ (కలం పేరు).. ‘తనీ ఒరువన్’కు స్క్రీన్ ప్లే సహకారం అందించారు. ఈ సినిమా మొదలైనపుడు అసలేం అంచనాల్లేవు. రవి వరుసగా ఫ్లాపులు ఎదుర్కోవడమే అందుకు కారణం. పైగా బడ్జెట్ సమస్యలు కూడా ఎదురయ్యాయి. దీంతో సినిమా మొదలైన రెండేళ్లకు కానీ విడుదలకు నోచుకోలేదు. ఐతే పెద్దగా అంచనాల్లేకుండానే రిలీజైన ఈ సినిమా తమిళ ప్రేక్షకులకు దిమ్మదిరిగే షాకిచ్చింది. సెన్సేషనల్ హిట్టయింది. అక్కడ రిలీజైన వారానికే తెలుగు రీమేక్ హక్కుల్ని ఎన్వీ ప్రసాద్ కొనేయడం.. తర్వాత రామ్ చరణ్ కు సినిమా నచ్చి రీమేక్ కు ఓకేు చెప్పడం.. సురేందర్ రెడ్డి సీన్లోకి రావడం.. చకచకా జరిగిపోయాయి.