Begin typing your search above and press return to search.

సీఎం పీఏ అనగానే ఒప్పేసుకున్నావా?

By:  Tupaki Desk   |   29 Jan 2020 10:17 AM IST
సీఎం పీఏ అనగానే ఒప్పేసుకున్నావా?
X
వరుస పరాజయాల సతమతం అవుతున్న రవితేజ తాజాగా డిస్కోరాజా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. చాలా కాలం తర్వాత రవితేజ ఈ చిత్రంతో ఖచ్చితంగా కమ్‌ బ్యాక్‌ అవుతాడు అంటూ అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. కాని మళ్లీ రవితేజ నిరాశ పర్చాడు. డిస్కోరాజా నిరాశ పర్చినా కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా రవితేజ 'క్రాక్‌' చిత్రంతో రాబోతున్నాడు. ఇటీవలే ఫస్ట్‌ లుక్‌ వచ్చింది. పోలీస్‌ గా రవితేజ అందులో కనిపించబోతున్నాడు.

గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో క్రాక్‌ చిత్రం రూపొందుతున్న విషయం తెల్సిందే. ఒక వైపు క్రాక్‌ చిత్రం చేస్తూనే మరో వైపు రమేష్‌ వర్మ దర్శకత్వంలో సినిమాకు ఈయన గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. సమ్మర్‌ లో రమేష్‌ వర్మ సినిమా షూటింగ్‌ లో పాల్గొనబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. గతంలో రమేష్‌ వర్మ దర్శకత్వంలో వీర చిత్రాన్ని రవితేజ చేశాడు. ఆ సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది.

ఇటీవల రమేష్‌ వర్మ 'రాక్షసుడు' చిత్రాన్ని బెల్లంకొండ శ్రీనివాస్‌ తో తెరకెక్కించి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అందుకే మరోసారి రవితేజ ఆ దర్శకుడికి ఛాన్స్‌ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరో వైపు ఈ చిత్రం ఒక సీఎం పీఎ రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తాడు.. అతడు అవినీతికి పాల్పడితే ఎలా ఉంటుంది.. అతడు మంచిగా మారిన తర్వాత ఎలా ఉంటుంది అనే విషయాలను చూపిస్తు సాగుతుందట. స్టోరీ లైన్‌ బాగుందని.. సీఎం పీఏ పాత్ర అవ్వడంతో రవితేజ ఈ చిత్రంలో నటించేందుకు ఒప్పుకున్నట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

ప్రస్తుతం రవితేజ కెరీర్‌ కాస్త ఇబ్బందుల్లో ఉంది. ఇలాంటి సమయంలో ఖచ్చితంగా సక్సెస్‌ అయ్యే సినిమాలను మాత్రమే చేయాలి. ప్రయోగాలు చేయడం.. ప్రయత్నిద్దాం అనుకుని చేస్తే మాత్రం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందంటూ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.