Begin typing your search above and press return to search.

తిట్టేటోళ్ల మీద ట్రోలింగ్ కాదు.. టికెట్లు తెగ్గొటొచ్చుగా?

By:  Tupaki Desk   |   27 Aug 2022 6:33 AM GMT
తిట్టేటోళ్ల మీద ట్రోలింగ్ కాదు.. టికెట్లు తెగ్గొటొచ్చుగా?
X
అభిమానానికి నిర్వచనం మారిందా? సోషల్ మీడియా కాలంలో అభిమానులు త్యాగాలు చేసేందుకు సిద్ధంగా లేరా? తమకున్న అభిమానాన్ని పైసా ఖర్చు లేని రీతిలో ప్రదర్శించటానికి సై అంటున్నారే కానీ.. తేడా కొట్టిన తమ అభిమాన సినిమాకు కలెక్షన్ తో కాస్తంత ఊపిరి పీల్చుకునేలా వ్యవహరించటం లేదా? గతంలో సినిమా ఫలితం తేడా కొడుతున్న వేళ.. తమ భుజాన వేసుకొని.. తామున్నామని చెప్పే తీరుకు భిన్నంగా పరిస్థితులు ఉన్నాయా? అంటే అవునంటున్నారు.

ముప్ఫై.. ముప్ఫై ఐదేళ్ల క్రితం తాము అమితంగా అభిమానించే హీరో మూవీ విడుదలయ్యాక.. ఆ సినిమా అనుకున్నంత బాగా లేకుంటే.. సినిమాను కనీసం రెండు వారాల పాటు హౌస్ ఫుల్ అయ్యే బాధ్యతను ఫ్యాన్స్ తీసుకునేవారు. తమ అభిమాన కథానాయకుడి ఫ్లాప్ సినిమాను ప్లాప్ ముద్ర వేయటానికి వీల్లేదన్నంత పట్టుదల అప్పటి అభిమానుల్లో ఉండేది. సినిమా కలెక్షన్లు పెంచేందుకు ఒక్కొక్కరు పదేసి సార్లు సినిమాను చూసేందుకు సైతం వెనుకాడేవారు కాదు.

కానీ.. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. ఆ మాటకు వస్తే.. అప్పట్లో సినిమా విడుదలయ్యే థియేటర్ల సంఖ్య కూడా పరిమితంగా ఉండేది. వెబ్ సైట్లు.. సోషల్ మీడియా గట్రాలు లేకపోవటం.. ఒక సినిమా ఫలితం మీద నెగిటివిటీ వ్యాప్తి చెందటానికి కాస్తంత టైం పట్టేది.

ఈ లోపు.. సినిమా దర్శక నిర్మాతలు తెలివిగా ప్రమోషన్ పెంచటం ద్వారా.. నష్ట నివారణ కోసం చేపట్టే చర్యలు ఫలితాన్ని ఇచ్చేవి. వీటికి తోడు అప్పటి డై హార్డ్ ఫ్యాన్స్.. తమ అభిమాన నటుడి సినిమాను విజయవంతం చేయించటం కోసం త్యాగాలకు సిద్ధమయ్యేవారు.

డబ్బులు.. సమయాన్ని తమ అభిమాన స్టార్ కోసం నీళ్ల మాదిరిగా ఖర్చు చేసేవారు. ఇప్పుడు అభిమానం అడ్రస్ మారింది. ఎంతటి తోపు హీరో అయినా సరే.. తమకున్న అభిమానాన్ని గుండెల్లో దాచుకోవటం.. కాదూ కూడదంటే.. సినిమా విడుదలైన రోజు ఏదోలా సినిమాను చూడటం.. బాగోలేకపోతే బాధ పడటమే తప్పించి.. అందుకోసం గతంలో మాదిరి వ్యవహరిస్తున్నది లేదు.

అందుబాటులోకి వచ్చిన స్మార్ట్ ఫోన్ తో తమ హీరోను విమర్శించే వారిని ట్రోల్ చేయటం.. వారిని తిట్టిపోస్తూ పోస్టులు పెట్టేస్తే.. తమ అభిమానాన్ని ఆన్ లైన్ లో చూపిస్తున్నారే కానీ.. సినిమాకు ప్రాణవాయువు అయిన కలెక్షన్ల విషయాన్ని మాత్రం వదిలేస్తున్నారు. అభిమానాన్ని పోస్టులు.. వీడియోలు.. ట్రోల్స్ తో ప్రదర్శించే కన్నా టికెట్లు తెగ్గొట్టే దాని మీద కాస్త ఫోకస్ పెట్టండ్రా బాబు అన్న మాట కొందరి నోటి నుంచి వినిపిస్తోంది.