Begin typing your search above and press return to search.

బాలీవుడ్ లో టాప్.. కానీ ముందు మెరిసింది ఇక్క‌డే

By:  Tupaki Desk   |   21 Dec 2021 7:00 AM IST
బాలీవుడ్ లో టాప్.. కానీ ముందు మెరిసింది ఇక్క‌డే
X
బాలీవుడ్ తెర‌పై స్టార్ లుగా ఓ వెలుగు వెలుగుతున్న హీరోలు.. హీరోయిన్ లు ముందు అవ‌కాశాల కోసం తిరిగింది.. న‌టులుగా త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకుంది మాత్రం ద‌క్షిణాది లోనే అన్న విష‌యం చాలామందికి ఇప్ప‌టికీ తెలియ‌దు. ఇక్క‌డ న‌టులుగా ఎంట్రీ ఇచ్చిన త‌రువాత బాలీవుడ్ కు వెళ్లి అక్క‌డ స్టార్ లు గా మారి స్టార్ డ‌మ్ ని సొంతం చేసుకున్నారు. అలాంటి వారి గురించి ప్ర‌త్యేకంగా తెలుసుకుందాం. ఇంత‌కీ వారు ఎవ‌రు? .. ఇప్పుడు అక్క‌డ ఏ స్థాయిలో వున్నార‌న్న‌ది ఒక సారి చూద్దాం.

అందులో ముందుగా చెప్పుకోవాల్సిన సీనియ‌ర్ హీరో అనిల్ క‌పూర్‌. ప్ర‌ఖ్యాత ద‌ర్శ‌కుడు బాపు త‌న మిత్రుడు ముళ్ల‌పూడి వెంక‌ట్ ర‌మ‌ణ‌తో క‌లిసి చేసిన చిత్రం `వంశ వృక్షం`. 1980లో వ‌చ్చిన ఈ సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అయ్యారు అనిల్ క‌పూర్‌. కెవీ మ‌హాదేవ‌న్ సంగీతం అందించిన ఈ సినిమా మంచి విజ‌యాన్ని సాధించింది. ఆ త‌రువాతే బాలీవుడ్ కు వెళ్లిన అనిల్ క‌పూర్ `ఓ సాత్ దిన్‌` సినిమాతో అక్క‌డ హీరోగా త‌న ప్ర‌యాణాన్ని ప్రారంభించారు.

ఇక ఆ త‌రువాత వ‌రుస‌లో చెప్పుకోవాల్సిన హీరోయిన్ ప్రియాంక చోప్రా. హాలీవుడ్ చిత్రాల్లో న‌టిస్తూ యూనివ‌ర్స‌ల్ స్టార్ గా పేరు తెచ్చుకుంటున్న ప్రియాంక చోప్రా ముందు హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది తెలుగులోనే. నెక్కంటి శ్రీ‌దేవి నిర్మించిన `అపురూపం` ప్రియాంక తొలి చిత్రం. ప్ర‌స‌న్న హీరోగా న‌టించిన ఈ చిత్రానికి సాయి ర‌వి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 2002లో మొద‌లైన ఈ సినిమా ఆర్థిక ఇబ్బందుల కార‌ణంగా మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. అదే స‌మ‌యంలో ప్రియాంక‌కు త‌మిళ స్టార్ విజ‌య్ చిత్రం`త‌మిళ‌న్‌`లో న‌టించే అవ‌కాశం ద‌క్కింది.

ఆ సినిమా సూప‌ర్ హిట్ గా నిలిచినా ప్రియాంక బాలీవుడ్ కు వెళ్లిపోయింది. ఇక ప్ర‌స్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న దీపికా ప‌దుకునే కూడా ద‌క్షిణాదిలో మెరిసాకే బాలీవుడ్ కు వెళ్లింది. క‌న్న‌డ‌తో ఉపేంద్ర హీరోగా న‌టించిన చిత్రం `ఐశ్వ‌ర్య‌`. ఇంద్ర‌జిత్ లంకేష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాతోనే బెంగ‌ళూరు సోయ‌గం దీపికా ప‌దుకోన్ హీరోయిన్ గా త‌న కెరీర్ ని ప్రారంభించింది. అయితే ఈ సినిమా స‌క్సెస్ సాధించినా బాలీవుడ్ లో `ఓం శాంతి ఓం` ఆఫ‌ర్ రావ‌డంతో అక్క‌డికి చెక్కేసింది. ప్ర‌స్తుతం దీపిక ఏస్థాయిలో వుందో అంద‌రికి తెలిసిందే.

ఇక ప్ర‌స్తుతం `ఆదిపురుష్‌`లో న‌టిస్తున్న క్రితి స‌న‌న్ కూడా ద‌క్షిణాది సినిమాతో న‌టిగా త‌న కెరీర్ ప్రారంభించిన విష‌యం తెలిసిందే. సూప‌ర్ స్ట‌ర్ మ‌హేష్ బాబు న‌టించిన `వ‌న్ నేనొక్క‌డినే` సినిమాతో కృతి స‌న‌న్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌రువాత టైగ‌ర్ ష్రాఫ్ మూవీ `హీరో పంటీ`తో బాలీవుడ్ బాట ప‌ట్టి అక్క‌డ స్టార్ గా వెలిగిపోతున్న విష‌యం తెలిసిందే. యామీ గౌత‌మ్ కూడా క‌న్న‌డ చిత్రం `ఉల్లాస ఉత్సాహ‌` సినిమాతో ప‌రిచ‌య‌మైంది. `విక్కీ డోన‌ర్‌`తో బాలీవుడ్ బాట ప‌ట్టింది,

ర‌కుల్ ప్రీత్ సింగ్ , ఇలియానా ద‌క్షిణాదిలో మెరిసాకే బాలీవుడ్ బాట ప‌ట్టారు. ఐశ్వ‌ర్యారాయ్ కూడా మిస్ వ‌ర‌ల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకున్న త‌రువాత త‌మిళంలో ప్ర‌ఖ్యాత ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం తెర‌కెక్కించిన `ఇరువ‌ర్‌` (ఇద్ద‌రు) సినిమాతో న‌టిగా కెరీర్ ప్రారంభించింది. ఆ త‌రువాత బాబీ డియోల్ న‌టించిన `ఔర్ ప్యార్ హోగ‌యా` సినిమాతో బాలీవుడ్ బాట ప‌ట్టింది. ఆ త‌రువాత ఏం జ‌రిగిందో అంద‌రికి తెలిసిందే. బాలీవుడ్ లో ప్ర‌స్తుతం స్టార్ డ‌మ్‌ని సొంతం చేసుకుంటున్న హీరోయిన్ లు ద‌క్షిణాదిలో ప‌రిచ‌య‌మైన వారే కావ‌డం గ‌మ‌నార్హం.