Begin typing your search above and press return to search.

పాపులర్ బుక్స్ పై దృష్టి పెడుతున్న స్టార్ ప్రొడ్యూసర్స్...?

By:  Tupaki Desk   |   24 July 2020 8:45 AM IST
పాపులర్ బుక్స్ పై దృష్టి పెడుతున్న స్టార్ ప్రొడ్యూసర్స్...?
X
డిజిటల్ వరల్డ్ లో రాబోయే రోజుల్లో వెబ్ సిరీస్ లదే రాజ్యం అని భావిస్తున్న ప్రొడ్యూసర్స్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది నిర్మాతలు ఒరిజినల్ మూవీస్ మరియు వెబ్ సిరీస్ ల నిర్మాణంలో పాలుపంచుకుంటూ వెబ్ వరల్డ్ లో అడుగులు పెట్టేసారు. అయితే వాటి నిర్మాణం కోసం మంచి కంటెంట్ ని వెతికే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో బాగా పాపులర్ అయిన నవలలను వెబ్ సిరీస్ లుగా మలిచే పనిలో పడ్డారు. ఇప్పటికే స్టార్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర సుప్రసిద్ధ రచయిత మధుబాబు రచించిన 'షాడో' నవల ఆధారంగా వెబ్ సిరీస్ నిర్మించనున్నట్లు అధికారికంగా ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. మధుబాబు 'షాడో' అనే పేరుతో తెరకెక్కనున్న ఈ వెబ్ సిరీస్ ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. దీని కోసం పలువురు స్టార్ హీరోలని నటింపజేయడానికి మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా డిజిటల్ ప్లాట్ ఫార్మ్ 'ఆహా' కోసం ఫేమస్ నవలల్ని తీసుకుంటున్నారట. మొట్టమొదటి సారిగా మన తెలుగు నుంచే వచ్చిన స్ట్రీమింగ్ యాప్ 'ఆహా' అని చెప్పవచ్చు. అయితే అన్ని ఓటీటీలు కరోనా డేస్ ని క్యాష్ చేసుకుని దూసుకుపోతుంటే 'ఆహా' మాత్రం పుంజుకోలేకపోతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో 'ఆహా' కి క్రేజ్ పెంచడానికి ఇటీవల కొన్ని సినిమాలను డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేయడంతో పాటు పలు డబ్బింగ్ సినిమాలను కూడా స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇప్పుడు వెబ్ సిరీస్ ల మీద కూడా ఫోకస్ పెట్టిన 'ఆహా'.. దీని కోసం తెలుగులో పలు పాపులర్ నవలా రచయితలను సంప్రదిస్తున్నారట. వారు రచించిన ఫేమస్ నవలల్ని బుక్స్ ని తీసుకొని వాటిని వెబ్ సిరీస్ లుగా తీసే ఆలోచనలో ఉన్నారట. ఈ క్రమంలో ఇటీవల సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన దర్శకుడి చేతిలో ఓ పాపులర్ బుక్ ని పెట్టబోతున్నారట. మొత్తం మీద తెలుగు ఓటీటీ కి క్రేజ్ తీసుకురావడం కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారని తెలుస్తోంది.