Begin typing your search above and press return to search.

సుడిగాళ్ల కోసం స్టార్ హీరోయిన్లా??

By:  Tupaki Desk   |   30 Dec 2017 2:30 AM GMT
సుడిగాళ్ల కోసం స్టార్ హీరోయిన్లా??
X
కామెడీ హీరో అల్లరి నరేష్ కు స్టార్ రేంజ్ ఇమేజ్ అందించిన మూవీ సుడిగాడు. బ్లాక్ బస్టర్ సాధించి కెరీర్ బెస్ట్ గా నిలిచిన ఈ చిత్రం.. అల్లరి నరేష్ కు మేలు కంటే కీడే ఎక్కువ చేసిందని అంటారు సినీ జనాలు. తమిళ్ పదం అనే కోలీవుడ్ మూవీకి తెలుగు రీమేక్ సుడిగాడు. మళ్లీ ఇన్నేళ్లకు ఈ తమిళ్ పదంకు సీక్వెల్ సిద్ధమవుతోంది. ఇప్పటికే సెట్స్ పై ఉన్న ఈ చిత్రాన్ని.. రిలీజ్ కి ముందే తెలుగులో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

రీమేక్ డైరెక్టర్ గా తిరుగులేని రికార్డ్ ఉన్న భీమినేని శ్రీనివాసరావు.. ఇప్పటికే సుడిగాడు సీక్వెల్ కు రంగం సిద్ధం చేసుకుంటున్నాడని తెలుస్తోంది. అయితే.. ఈ సారి ఇద్దరు కామెడీ హీరోలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ట్రై చేస్తున్నాడట. ప్రస్తుతం తెలుగులో కామెడీ సినిమాలు అంటే మొదటగా గుర్తు వచ్చే పేర్లు అల్లరి నరేష్.. సునీల్. వీరిద్దరితో లీడ్ రోల్స్ చేయించి.. సుడిగాడు2 తీయాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం ఇద్దరు స్టార్ హీరోయిన్లను కూడా అప్పుడే సంప్రదిస్తున్నారట.

ఆల్రెడీ ఫ్లాపుల్లో ఉన్న ఈ హీరోలకు సుడిగాడు2 లాంటి క్రేజీ ప్రాజెక్టులో చేసేందుకు.. ఇద్దరికీ అబ్జెక్షన్స్ ఉండకపోవచ్చు కాని.. అసలు ఈ ఇద్దరితో ఇప్పటికిప్పుడు జతకట్టే స్టార్ హీరోయిన్లు ఎవరు? కాస్త బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు అంటూ.. రకుల్ ప్రీత్.. లావణ్య త్రిపాఠి వంటి భామలను ఎప్రోచ్ అవుతున్నారట. వారిలో ఎవరైనా ఒప్పుకుంటారేమో చూసి.. అప్పుడు ఇతర హీరోయిన్లను ప్రయత్నిస్తారట. అది సంగతి.