Begin typing your search above and press return to search.

ఆయన తీసుకునేది కొండంత.. సాయం చేసేది మాత్రం గోరంత..!

By:  Tupaki Desk   |   11 April 2020 6:15 AM GMT
ఆయన తీసుకునేది కొండంత.. సాయం చేసేది మాత్రం గోరంత..!
X
కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీలో ఆకలి కేకలు ఎక్కువయ్యే అవకాశం ఉండటంతో ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి ఇండస్ట్రీ పెద్దలు ముందుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి సారధ్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ 'మనకోసం'ను ప్రారంభించారు. ఈ ఛారిటీకి చిరంజీవి చైర్మన్ గా వ్యవహరించగా సీనియర్ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ, డైరెక్టర్ ఎన్.శంకర్, ప్రముఖ నిర్మాతలు సురేష్‌ బాబు, సీ కల్యాణ్, దాము సభ్యులుగా ఉన్నారు. ఈ ఛారిటీకి ఎవరికి తోచిన సాయం వాళ్లు అందించాలని మెగాస్టార్ పిలుపునివ్వడంతో ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఈ సంస్థకు సినిమా ఇండస్ట్రీ నుంచి చిన్న పెద్ద అని తేడా లేకుండా పలువురు సినీ ప్రముఖులు ముందుకొచ్చి భారీ విరాళాలు అందించారు. తాజాగా ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం సీసీసీ ట్రస్ట్‌కు సాయం అందించేందకు ముందుకు వచ్చారు. సీసీసీ కి రూ. 3 లక్షల విరాళం అందజేయనున్నట్టు ఆయన ప్రకటించారు. అయితే కరోనా పై నేను సైతం అంటూ ముందుకొచ్చిన బ్రహ్మానందంపై పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

కరోనా మహమ్మారి మన దేశంలోకి ప్రవేశించినప్పటి నుండి దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు ఈ వైరస్ నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేసారు. అదొక్కటే సరిపోదని భావించి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో పనులు లేక ఇంటికే పరిమితమైన పేద మధ్యతరగతి కుటుంబాలు నానా అవస్థలు పడ్డాయి. వీరిని ఆదుకోడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చాయి. వీరికి తోడుగా మేము కూడా ఉన్నామంటూ రాజకీయ సినీ ప్రముఖులు కూడా ముందుకొచ్చి విరాళాలు ఇచ్చారు. మన టాలీవుడ్ సెలెబ్రెటీలు కూడా ఎప్పటిలాగే కష్టమొస్తే మేము మీ వెంటే అంటూ విరాళాలు ప్రకటించారు. కానీ కొంతమంది హీరోయిన్లు, నటీనటులు మాత్రం బయటకి రాలేదు. వీరిని సోషల్ మీడియా వేదికగా విమర్శించడం స్టార్ట్ చేసారు. వారిలో స్టార్ కమెడియన్ బ్రహ్మానందం కూడా ఉన్నారు. అయితే లేట్ అయినా ఇప్పుడు స్పందించి 3 లక్షలు విరాళం ఇచ్చాడు. అయినా నెటిజన్లు మాత్రం విమర్శలు చేయడం ఆపడం లేదు. కారణం ఆయన చాలా తక్కువ అమౌంట్ డొనేట్ చేయడమే. బ్రహ్మానందం ఒక రోజు రెండు సీన్లలో నటిస్తేనే ఒకటి నుండి రెండు లక్షల దాకా వసూలు చేస్తాడు... కానీ సహాయం చేయమంటే కేవలం 3 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు.. తీసుకునేది కొండంత.. సాయం చేసేది గోరంత.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కొంతమంది మాత్రం బ్రహ్మానందానికి రీసెంటుగా సర్జెరీ జరిగి చాలా డబ్బు ఖర్చు అయింది.. అంతేకాకుండా ఆయన కెరీర్ కూడా ఒకప్పటిలా లేదు కదా అంటూ ఆయన్ని సమర్థిస్తున్నారు. మరికొందరు మాత్రం ఎంతో కొంత ఇచ్చాడుగా.. అసలు ఇవ్వని వాళ్ళకంటే బెటరేగా అంటూ కామెంట్లు పెడుతున్నారు.