Begin typing your search above and press return to search.

జక్కన్న చెక్కుడుకే చెల్లుబాటు.. మిగిలిన వారికి దెబ్బే

By:  Tupaki Desk   |   26 Aug 2022 5:38 AM GMT
జక్కన్న చెక్కుడుకే చెల్లుబాటు.. మిగిలిన వారికి దెబ్బే
X
తింటే గారెలు తినాలి. వింటే మహా భారతాన్ని వినాలి. చూస్తే.. అన్న దగ్గర కాస్త ఆగాల్సిందే. ఎందుకంటే.. తెలుగువారి జీవితాల్లో భాగమైన సినిమాకు సంబంధించిన లెక్కలు ఒక పట్టాన తేలవు. ఎందుకంటే.. సినిమాకు సంబంధించి అన్ని లెక్కలు ఒకేలా ఉండకపోవటమే దీనికి కారణం. అతి తక్కువ సమయంలో తీసిన సినిమా సైతం సూపర్ హిట్ అవుతుంది. అదే సమయంలో అత్యంత జాగ్రత్తగా.. ప్రతిది ఆచితూచి అన్నట్లుగా లెక్కలేసుకొని తీసిన సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యే పరిస్థితి. అయితే.. ఇలాంటి వాటికి మినహాయింపు ఒకే ఒక్కరుగా చెప్పాలి. అదే రాజమౌళి.

ఆయన సినిమా ఏదైనా సరే.. ఏళ్లకు ఏళ్లు గడిచిపోతుంటాయి. ఆయనతో సినిమా చేయటమంటే.. సదరు క్రూ మొత్తం.. ఆయన చేతికి అప్పజెప్పాల్సిందే. అయితే.. అందరి భారాన్ని.. ఏళ్లకు ఏళ్లు పని చేసిన దానికి మించిన ఫలితాన్ని ఇవ్వటంలో ఆయనకు సాటి వచ్చే వారు కనిపించరు. ఆ విషయంలో ఆయన్ను మెచ్చుకోవాల్సిందే. టాలీవుడ్ మొత్తంలో సినిమాను చెక్కే విషయంలో రాజమౌళి అలియాస్ జక్కన్నకు సాటి వచ్చే వారే ఉండరని చెప్పాలి.

ఆయన్ను స్ఫూర్తిగా తీసుకొని.. సినిమాను చెక్కే ప్రయత్నం చేస్తే.. అడ్డంగా బుక్ కావటం ఖాయం. ఈ విషయం ఈ ఏడాది ఇప్పటివరకు విడుదలైన భారీ సినిమాల విషయంలో స్పష్టమైంది. ప్రభాస్.. పూజాహేగ్డే నటించిన రాధేశ్యామ్ మీద ఉన్న అంచనాలు అన్ని ఇన్ని కావు. ఈ సినిమాను అనౌన్స్ చేసింది 2018 అక్టోబరు అయితే.. థియేటర్ కు వచ్చింది 2022 మార్చి. అంటే దాదాపు.. మూడున్నరేళ్లకు సినిమా బయటకు వస్తే.. ఫలితం ఎలా ఉందన్నది తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి సీన్ ఒక అద్భుతంగా ఉన్నట్లుగా రిలీజ్ కు ముందు విడుదల చేసిన ఫోటోలు.. వీడియోల్ని చూసినప్పుడు అనిపించినప్పటికీ.. తుది ఫలితం ఏమిటన్నది తెలిసిందే.

ఆచార్య మూవీ కూడా ఆ కోవలోకే వస్తుంది.మెగాస్టార్ చిరంజీవి.. ఆయన తనయుడు రాంచరణ్ కలిసి నటించిన ఈ మూవీ మీద భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమా షూట్ ను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సినిమాను ఒక కళాఖండం మాదిరి చెక్కిన వైనం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన పనులు 2019 అక్టోబరుకు ముందే మొదలై.. 2022 ఏప్రిల్ లో థియేటర్ లో బొమ్మ పడింది. దగ్గర దగ్గర రెండున్నరేళ్లకు పైనే ఈ మూవీ బయటకు రావటానికి సమయం తీసుకుంది. దీని ఫలితం గురించి తెలిసిందే.

తాజాగా రిలీజ్ అయిన లైగర్ నిర్మాణం కూడా సుదీర్ఘంగా సాగింది. పైన చెప్పుకున్న సినిమాలన్ని కూడా కరోనా బారిన పడినవే. దాని కారణంగా సినిమా షూటింగ్ ఆలస్యమైంది. అయితే.. మరికొన్ని సినిమాలు కరోనా బారిన పడి.. షూట్ ఆలస్యమైనప్పటికీ ఫలితం మాత్రం భిన్నంగా ఉండటం తెలిసిందే. తాజాగా విడుదలైన లైగర్ మూవీ విషయానికి వస్తే.. ఈ సినిమా కోసం దర్శకుడు పూరీ జగన్నాధ్ చాలా ఎక్కువగానే కష్టపడ్డారని చెప్పాలి. సాధారణంగా పూరీ తన సినిమాల్ని చాలా వేగంగా తీస్తారన్న పేరుంది. తన స్టైల్ కు భిన్నంగా ఈ మూవీని ఏళ్లకు ఏళ్లు చెక్కారు. 2019లో మొదలైన ఈ మూవీ 2022 ఆగస్టు చివరి వారంలో కానీ బయటకు రాలేదు. దగ్గర దగ్గర మూడేళ్లకు పైనే ఈ సినిమాను తీర్చిదిద్దటానికి పూరీ టైం తీసుకున్నారు. ఇంత సుదీర్ఘ కాలం ఈ సినిమాకు పని చేసినా.. తుది ఫలితం గురించి తెలిసిందే.

శిల్పం చెక్కినట్లుగా సినిమాను చెక్కితే పాజిటివ్ కంటే నెగిటివ్ రిజల్ట్ వస్తుందన్న దానికి భిన్నంగా నిలుస్తుంది రాజమౌళి అలియాస్ జక్కన్న తీసిన ఆర్ఆర్ఆర్ మూవీ. ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. రాజమౌళిని జక్కన్న ఎందుకు అంటారన్నది పక్కన పెడితే.. ఆయన్ను పిలుచుకునే పేరుకు తగ్గట్లే.. సినిమాను శిల్పంలా చెక్కే విషయంలో ఆయనకు తిరుగు ఉండదు. గురి చూసి కొట్టిన బాణం మాదిరి బాక్సాఫీస్ ను చేధించే శక్తి ఆయనకు ఉంది. అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఆర్ఆర్ఆర్ మూవీని 2018 లో షురూ చేస్తే.. ఈ మూవీ రిలీజ్ అయ్యింది 2022 మార్చి.

ఈ సినిమా విడుదలను పలుమార్లు అనుకోవటం.. రిలీజ్ డేట్ ప్రకటించిన తర్వాత కూడా వాయిదా వేయటం తెలిసిందే. సినిమా పనులు మొదలైన దాదాపు నాలుగేళ్లకు వెండితెర మీదకు వచ్చినప్పటికీ.. ఈ సినిమా ఫలితం అదిరేలా ఉండటం తెలిసిందే. ఇలాంటి మేజిక్ రాజమౌళికి మాత్రమే తెలుసని చెప్పక తప్పదు. నిజానికి ఆర్ఆర్ఆర్ మాత్రమే కాదు.. ఆయన తీసే సినిమాలన్ని కూడా ఏళ్లకు ఏళ్లుగా సాగుతూ ఉంటాయి. సుదీర్ఘ కాలం నిర్మాణం సాగిన వైనం కాస్తంత చిరాకు తెప్పించినా.. తుది ఫలితం మాత్రం ఆ చికాకును పోగొట్టి.. ఇది కదా విజయం అంటే అన్నట్లు ఉంటుంది. ఈ తీరు చూశాక అనిపించేది ఒక్కటే.. సినిమాను చెక్కితే జక్కన్నే చెక్కాలి అని.