Begin typing your search above and press return to search.

ఒకే ఒరలో రెండు కత్తులను ఇమిడ్చిన రాజమౌళి!

By:  Tupaki Desk   |   19 July 2022 10:14 AM IST
ఒకే ఒరలో రెండు కత్తులను ఇమిడ్చిన రాజమౌళి!
X
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఆర్ ఆర్ ఆర్' సంచలన విజయాన్ని సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. సినిమా విడుదలకి ముందు ఏ హీరో పాత్ర ఎక్కువ ఎలివేట్ అవుతుంది? అనే ప్రశ్న అందరిలో ఆసక్తిని రేపితే, విడుదల తరువాత ఎవరి పాత్ర ఎలివేట్ అయినట్టు? అనే ఆలోచనలో పడ్డారు. తమ హీరో పాత్రను తక్కువ చేశారంటూ కొంతమంది అభిమానులు అసహనాన్ని ప్రదర్శించారు కూడా. ఇదే విషయంపై పరుచూరి పాఠాలు కార్యక్రమంపై పరుచూరి గోపాలకృష్ణ స్పందించారు.

"రాజమౌళి గారు .. విజయేంద్ర ప్రసాద్ గారు .. కీరవాణిగారు .. ఈ ముగ్గురుని కవిత్రయంగా పిలుచుకుంటూ ఉంటాము. ఈ ముగ్గురూ కూడా అలుపెరగని ప్రయాణం చేస్తూ .. అద్భుతమైన విజయాలను అందుకుంటూ వస్తున్నారు. ఇది చాలా సాహసంతో కూడుకున్న కథ.

ఎన్టీఆర్ - చరణ్ వంటి ఇద్దరు హీరోలను పెట్టుకుని, బయటవాళ్ల సమస్యను తమ భుజాలపై వేసుకుని పరిష్కరించే కథను తీసుకోవడం సాహసమే. ఇంతకుముందు విజయేంద్ర ప్రసాద్ గారు ఒక పాపను పాకిస్థాన్ కి చేర్చే కథాంశంతో 'బజరంగీ భాయిజాన్' సినిమాను రాశారు. సమస్య హీరోది కాకపోయినా సినిమా చాలా పెద్ద హిట్ అయింది.

అదే ధైర్యంతో 'ఆర్ ఆర్ ఆర్'లో కూడా ఒక గోండు జాతి పాపను తెల్లదొరలు తీసుకుని వెళితే, అక్కడి నుంచి ఆ పాపను గూడానికి చేర్చే కథ. ఇక చరణ్ కి సంబంధించిన కథ అంతర్లీనంగా నడుస్తూ ఉంటుంది. చరణ్ చేసేది యాంటీ కేరక్టరేమో అనే అనుమానాన్ని కలిగిస్తూ రాజమౌళి చాలా పకడ్బందీగా స్క్రీన్ ప్లే రాసుకున్నారు. సినిమాలో మాకు తెలియనిదేవుందిలే అని గర్వపడే చాలామందికి ఆ స్క్రీన్ ప్లే దొరక్కుండా వెళ్లింది .. అది రాజమౌళి గొప్పతనం. చరణ్ కి సంబంధించిన పాత్రను ఇంటర్వెల్ కి గుప్పెట తెరిచారు.

సాధారణంగా ఇద్దరు హీరోలు ఉన్నప్పుడు ఒక హీరో ఆశయానికి మరో హీరో ఎదురొస్తుంటాడు. తెల్లదొరల నుంచి 'మల్లి'ని తీసుకుని వెళ్లడం ఎన్టీఆర్ ఆశయమైతే .. అక్కడి నుంచి ఆయుధాలు తీసుకుని వెళ్లడం చరణ్ ఆశయం.

భీమ్ ను కొడుతున్నప్పుడు .. అడవుల్లోకి పంపిస్తున్నప్పుడు కథ అయిపోతుందేమో అనిపిస్తూ ఉంటుంది. ఈ సినిమాను కూడా రెండు పార్టులు చేద్దామని అనుకున్నారా? అనిపిస్తుంది. చాలామంది చరణ్ పాత్రకి ప్రాధాన్యత ఎక్కువని అన్నారు. కానీ ఎన్టీఆర్ పాత్ర ఎంతమాత్రం తగ్గలేదు. కత్తిమీద సాములాంటి ఈ కథను తెరపై ఆవిష్కరించడంలో రాజమౌళి సక్సెస్ అయ్యారు" అని చెప్పుకొచ్చారు.