Begin typing your search above and press return to search.

తెలుగు తెర వెలుగు కిరణం .. రాజమౌళి

By:  Tupaki Desk   |   10 Oct 2021 7:30 AM GMT
తెలుగు తెర వెలుగు కిరణం .. రాజమౌళి
X
జీవితానికి ఒక లక్ష్యమనేది ఉండాలి .. ఆ లక్ష్యానికి చేరుకునే పట్టుదల ఉండాలి .. ఎలాంటి పరిస్థితులలోను సడలని ఆ పట్టుదలతో అహర్నిశలు కృషి చేసే అంకితభావం ఉండాలి. అలాంటి అంకితభావంతో చేసే పోరాటమే ఫలిస్తుంది .. అలా చేసే పోరాటమే జయిస్తుంది. అలా ప్రతి అడుగు లక్ష్యం దిశగా వేస్తూ .. ప్రతి క్షణం గమ్యం దిశగా కదులుతున్న కార్యదీక్షపరుడిగా రాజమౌళి కనిపిస్తారు. రాజమౌళి దర్శకుడిగా తన కెరియర్ ను టీవీ సీరియల్స్ ను నుంచే మొదలుపెట్టారు. ఆ తరువాత వెండితెర దిశగా ముందుకు కదిలారు. తనదైన స్టైల్లో వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నారు.

రాజమౌళి ఇప్పుడు ఒక పేరు కాదు .. బ్రాండ్. ఆయన పేరు వింటే జనం థియేటర్లకు కదులుతారు. ఆయన పేరు చెబితే సినిమా బిజినెస్ జరిగిపోతుంది. ఆయన సినిమాలో చేయడానికి ఎన్ని సినిమాలనైనా వదులుకుని వచ్చే స్టార్ హీరోలు ఉన్నారు. అంతటి ప్రతిభ .. ప్రత్యేకత రాజమౌళి సొంతం. చివ్వునవ్వు చెదరకుండా .. ఎలాంటి పరిస్థితుల్లోను తాను నమ్మిన కథ నుంచి వెనుదిరగకుండా ముందుకు దూసుకుపోతున్న మిస్సైల్ రాజమౌళి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రాజమౌళి తనకి నచ్చిన కథను గుండెలకు హత్తుకుంటారు. ప్రతి ప్రేక్షకుడి మనసుకు పట్టుకునేలా ఆ కథకు దృశ్య రూపాన్ని ఇస్తారు. అందుకే రాజమౌళికి అంతటి పేరు.

వెండితెరకి పరిచయం చేసే ఒక కథకి ఎలాంటి లక్షణాలు ఉండాలి? కథలో ఏయే అంశాలు ఎంత మోతాదులో ఉండాలి? సన్నివేశాలు పండాలంటే పాత్రలను మలిచే తీరు తెన్నులు ఎలా ఉండాలి?ఒక కథలో ఏ విషయాన్ని ఎప్పుడు చెప్పాలి .. ఎక్కడ విప్పాలి? అనే విషయాలు బాగా తెలిసి ఉండాలి. ఆ పట్టు .. ఒడుపు బాగా తెలిసినవారు రాజమౌళి. కథలో ఏ మూల ఏం జరుగుతుందనే విషయంలో తనకి పూర్తిగా క్లారిటీ వచ్చిన తరువాతనే ఆయన సెట్స్ పైకి వెళతారు. ఇక ఆయన సినిమాల్లో హీరోల లుక్ .. ఆ పాత్రలను ఆయన డిజైన్ చేసే విధానం చూస్తే, ఆయన ప్రతి విషయంపై .. ప్రతి అంశంపై ఎంతగా ప్రాణం పెడతారనేది తెలుస్తుంది.

రాజమౌళి తన కథను ఒక అందమైన పెళ్లి కూతురులా ముస్తాబుచేస్తారు. ఒక మనోహరమైన శిల్పాన్ని అద్భుతంగా తీర్చిదిద్దినట్టుగా తన సినిమాను మలుస్తారు. అన్ని ఐటమ్స్ సమపాళ్లలో కుదిరి నప్పుడే అది విందుభోజనం అవుతుంది .. అన్ని వర్గాలవారు ఆశించే అంశాలు ఉన్నప్పుడే ఆ సినిమా విజయవంతమవుతుందని నమ్మిన దర్శకుడు ఆయన . అందుకే విజయాలు ఆయన దాసోహమంటాయి. పరాజయాలు ఆయన కనుచూపు మేరలో కనిపించకుండా జాగ్రత్తపడుతుంటాయి.

దర్శకుడిగా రాజమౌళి ప్రయాణం ఎన్టీఆర్ సినిమా 'స్టూడెంట్ నెంబర్ వన్' నుంచే మొదలైంది. అందువలన వాళ్లిద్దరి మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'సింహాద్రి' .. 'యమదొంగ' కూడా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. 'యమదొంగ'లో ఫాంటసీ పాయింట్ తో మెప్పించిన రాజమౌళి. 'మగధీరుడు'లో పునర్జన్మలతో ముడిపడిన రాజుల కాలంనాటి పాయింట్ ను పదునుగా చెప్పారు. ఒక చిన్న సినిమాను .. చిన్న బడ్జెట్ లో ఎంత గొప్పగా తీయవచ్చనేది 'మర్యాద రామన్న'తో నిరూపించారు. ఒక సినిమా ఘనవిజయం సాధించడానికీ .. రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టడానికి పెద్ద హీరోలు ఉండవలసిన అవసరం లేదు .. కావలసినది కథే అనే విషయాన్ని 'ఈగ' సినిమాతో స్పష్టం చేశారు.

'ఛత్రపతి' .. 'విక్రమార్కుడు' వంటి సినిమాలు చూస్తే ఒక కథను ఆయన మాస్ ఆడియన్స్ కి ఎంత దగ్గరగా తీసుకువెళతారనేది అర్థమవుతుంది. 'బాహుబలి' సినిమాతో ఆయన తెలుగు సినిమాను ప్రపంచపటానికి పరిచయం చేశారు. దక్షిణాదిలో భారీ సినిమాలు తీయాలంటే శంకర్ వల్లనే అవుతుందనే మాటకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. భారీ కాంబినేషన్లు సెట్ చేయడం .. భారీ వసూళ్లు సాధించడం తమవల్లనే అవుతుందనే బాలీవుడ్ దర్శక నిర్మాతలు విస్తుపోయేలా చేశారు. చేసింది డజను సినిమాల లోపే అయినా, దర్శకుడిగా ఆయన మహర్షి స్థానంలో నిలబడ్డారు. తెలుగు సినిమాను ఒక ప్రత్యేకమైన హోదాలో నిలబెట్టారు. సక్సెస్ కీ .. సంచలన విజయాలకు మారుపేరుగా నిలిచిన రాజమౌళి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, 'ఆర్ ఆర్ ఆర్' సినిమాతో మరో సారి ప్రభంజనాన్ని సృష్టించాలని మనసారా కోరుకుందాం.