Begin typing your search above and press return to search.

చైతూ కోసం బాల‌య్య డైరెక్ట‌ర్‌

By:  Tupaki Desk   |   18 Feb 2016 3:30 PM GMT
చైతూ కోసం బాల‌య్య డైరెక్ట‌ర్‌
X
మిగతా స్టార్ హీరోల వారసుల్లా మాస్ ఇమేజ్ కోసం వెంపర్లాడలేదు అక్కినేని నాగచైతన్య. మధ్యలో అప్పుడప్పుడూ చేసిన మాస్ సినిమాలు కూడా సరైన ఫలితాన్నివ్వకపోవడంతో తనకు నప్పే లవ్ స్టోరీలు చేసుకుంటూ ముందుకెళ్లిపోతున్నాడు చైతూ. ప్రస్తుతం మలయాళ ‘ప్రేమమ్’ రీమేక్‌‌ తో పాటు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో యాక్షన్ లవ్ స్టోరీ ‘సాహసం శ్వాసగా సాగిపో’లోనూ నటిస్తున్నాడు చైతూ. వీటి తర్వాత చైతూతో సినిమా చేయడం కోసం ముగ్గురు నలుగురు దర్శకులు లైన్ లో ఉండటం విశేషం. ఆ దర్శకుల పేర్లు కూడా ఆసక్తి రేపేవే.

అందర్లోకి ఆసక్తి రేపుతున్నది మాత్రం శ్రీవాసే. ఇటీవలే అతను బాలయ్య లాంటి పెద్ద మాస్ హీరోతో ‘డిక్టేటర్’ చేశాడు. కెరీర్ లో ఎక్కువగా మాస్ ఎంటర్ టైనర్ లే చేసిన శ్రీవాస్.. చైతూతో సినిమా చేయడానికి ప్రయత్నిస్తాడని ఎవరూ అనుకోలేదు. ఐతే ‘డిక్టేటర్’ విడుదలవడానికి ముందే చైతూ కోసం ఓ సబ్జెక్ట్ రెడీ చేసి ఉంచిన శ్రీవాస్.. ఈ మధ్యే నాగార్జునను అప్రోచ్ అయ్యాడట. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌ గా చైతూతో ఈ సినిమా చేయాలన్నది శ్రీవాస్ ప్లాన్. నిర్మాతను కూడా తానే రెడీ చేసుకుంటానని అంటున్నాడట శ్రీవాస్. ఈ ప్రాజెక్టు దాదాపుగా ఫైనలైజ్ అయ్యే దశలో ఉంది. మరోవైపు ‘సోగ్గాడే చిన్నినాయనా’ దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో పాటు ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’తో ఫామ్‌ లోకి వచ్చిన హరీష్ శంకర్ కూడా చైతూ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుండటం విశేషం.