Begin typing your search above and press return to search.

38 లక్షల్లో 28 రోజుల్లో హిట్ సినిమా తీశాను

By:  Tupaki Desk   |   11 Nov 2021 3:30 AM GMT
38 లక్షల్లో 28 రోజుల్లో హిట్ సినిమా తీశాను
X
తెలుగు తెరపై కామెడీని తనదైన శైలిలో పరుగులు తీయించిన దర్శకులలో శ్రీను వైట్ల ఒకరుగా కనిపిస్తాడు. ఈవీవీ దగ్గర పనిచేశాడు గనుక కామెడీపై ఆ మాత్రం పట్టు ఉంటుంది. అంతకుముందు కామెడీ అనేది సెపరేటు ట్రాకులా నడిచేది. ఆ తరువాత కామెడీ అనేది కథలో భాగమైపోయి, సందర్భానుసారంగా నవ్వించడం మొదలుపెట్టింది. హీరో కూడా కామెడీలో పాలుపంచుకోవలసిందే అంటూ కథలను సిద్ధం చేసుకున్న దర్శకులలో శ్రీను వైట్ల ఒకరు. అందుకు నిదర్శనంగా ఆయన సినిమాలు లైన్లో కనిపిస్తూ ఉంటాయి.

తాజాగా ఆయన 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ .. " తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం సమీపంలోని 'కందులపాలెం' మాది. చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే చాలా ఇష్టం. కాకినాడలో థియేటర్లు ఎక్కువగా ఉంటాయనే ఉద్దేశంతోనే నేను అక్కడ కాలేజ్ లో చేరాను. అప్ప్పట్లో మణిరత్నం గారి సినిమాలు నన్ను ఎక్కువగా ప్రభావితం చేశాయి. సీనియర్ వంశీగారి సినిమాలంటే కూడా నాకు చాలా ఇష్టం. డైరెక్టర్ ను కావాలని ఉందంటే ఇంట్లో ఒప్పుకోరు గనుక ఎవరికీ చెప్పకుండా రైలెక్కేసి మద్రాసు వెళ్లిపోయాను.

మద్రాసులో నాకు తెలిసినవాళ్లెవరూ లేరు .. తమిళం అంతగా తెలియదు. అయినా ఎలాగో ఒక చోట తలదాచుకునే ప్లేస్ సంపాదించుకుని సినిమాల్లో ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టాను. బాలకృష్ణ హీరోగా చలసాని రామారావుగారు తీసిన 'ప్రాణానికి ప్రాణం' సినిమాకి నేను డైరెక్షన్ డిపార్టుమెంటులో పనిచేశాను. అలా అక్కడి నుంచి నా ప్రయాణం మొదలైంది. ఆ సినిమా సరిగ్గా ఆడలేదు. దాంతో మళ్లీ నా పరిస్థితి మొదటికి వచ్చింది. ఆ తరువాత నేను సాగర్ గారి దగ్గర .. ఈవీవీగారి దగ్గర పనిచేసి నిలదొక్కుకున్నాను.

ఇక దర్శకుడిగా చేయాలనే ఉద్దేశంతో ఆ దిశగా ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టాను. రాజశేఖర్ హీరోగా 'అపరిచితుడు' అనే సినిమా కోసం అంతా రెడీ చేసుకున్నాను .. కొన్ని కారణాల వలన అది కుదరలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్థికపరమైన ఇబ్బందుల వలన ఆగిపోయింది. అప్పుడు కొంతమంది ఒక టీమ్ గా ఏర్పడి ఒక సినిమా చేద్దామంటే, రవితేజ హీరోగా 'నీ కోసం' సినిమా చేశాను. ఆ సినిమా బడ్జెట్ 38 లక్షలు .. 28 రోజుల్లో తీశాను. ఆ సినిమా బాగా వచ్చిందని తెలిసి రామోజీరావుగారు కొనేసి రిలీజ్ చేశారు. ఆ సినిమాకి 7 నంది అవార్డులు వచ్చాయి. 'నీ కోసం' నచ్చడం వలన రామోజీరావు గారు నాకు 'ఆనందం' సినిమా చేసే అవకాశం ఇచ్చారు" అని చెప్పుకొచ్చాడు.