Begin typing your search above and press return to search.

దూకుడు సినిమా ఓ ప్ర‌త్యేక బహుమతిలా ఎప్పటికీ గుర్తుంటుంది - శ్రీను వైట్ల

By:  Tupaki Desk   |   23 Sep 2021 6:30 AM GMT
దూకుడు  సినిమా ఓ  ప్ర‌త్యేక బహుమతిలా ఎప్పటికీ గుర్తుంటుంది - శ్రీను వైట్ల
X
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో దూకుడు సినిమాకు ఉండే స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా దూకుడు సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించి కలెక్షన్ల వర్షం కురిపించిన దూకుడు విడుదలై సెప్టెంబర్ 23కి పదేళ్లు అవుతుంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శకుడు శ్రీ‌నువైట్ల దూకుడు గురించి చెప్పిన విశేషాలు..

స‌రిగ్గా ప‌దేళ్ల క్రితం (దూకుడు విడుద‌లైన రోజు) మీ ఫీలింగ్ ఏంటి?

- సెప్టెంబర్ 24 నా పుట్టిన రోజు. 23వ తారీఖు నా ఫీలింగ్ ప్రత్యేకమైంది. బర్త్ డే గిఫ్ట్‌లను మనం ఎంతో గొప్పగా ఫీలవుతాం. చిన్నప్పుడు అలా మా అమ్మ ఓ సారి ఉంగరం చేసి ఇచ్చింది. దాని తరువాత ఏ గిఫ్ట్‌లు నాకు గుర్తు లేదు. కానీ ఈ దూకుడు మాత్రం నాకు ఓ బహుమతిలా ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

కొన్ని సినిమా ప్రారంభించే సమయంలోనే పాజిటివ్ వైబ్స్ కనిపిస్తాయి.. హిట్ అవుతుందని అనిపిస్తుంది? దూకుడు సమయంలోనూ అలానే అనిపించిందా?

- దూకుడు టైంలో జీరో టెన్షన్‌లో ఉన్నాను. పెద్ద హిట్ అవుతుందని ముందే అనుకున్నాం. కానీ మా ఊహకు మించిన‌ విజయం సాధించింది.

దూకుడు షూటింగ్‌ సమయంలో మెమోరబుల్ మూమెంట్ అంటే ఏం చెప్తారు?

- దూకుడు సినిమా షూటింగ్ ప్రారంభం నుంచి.. రిలీజ్ అయిన ఏడాది, ఏడాదిన్నర వరకు ప్ర‌తిరోజూ ఓ మెమోరబుల్ మూమెంట్‌లానే అనిపించింది. ఆ ఏడాది నంది, సైమా, ఫిల్మ్ ఫేర్ ఇలా అన్ని అవార్డులు దూకుడుకే వచ్చాయి. దాంతో ప్రతీ రోజూ సెలెబ్రేషన్స్ చేసుకున్నాం.

ఆ సినిమాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి?

- దూకుడు సినిమా విడుదలయ్యాక చాలా మంది నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి. కాని సూపర్ స్టార్ కృష్ణ గారు సినిమా కలెక్షన్ల గురించి కూడా ముందే చెప్పేశారు అది చాలా ప్ర‌త్యేకంగా అనిపించింది. అలాగే
ఓ సారి విజయవాడకు వెళ్తే.. అక్కడ ఓ పెద్దాయన వచ్చి సినిమా గురించి మాట్లాడారు. ఏం తీశావ్ నాయన అంటూ నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారు. ఆ త‌ర్వాత ఆయ‌న చాలా పెద్ద పారిశ్రామిక వేత్త అని తెలిసింది. అది ఎప్పటికీ మరిచిపోలేను.

గ‌త చిత్రాల‌తో పోలిస్తే దూకుడు సినిమాలో మహేష్ బాబు చాలా కొత్తగా కనిపిస్తారు. అలా చూపించాలనే ఐడియా ఎలా వచ్చింది?

- మహేష్ బాబును ఇంత వరకు ఎవ్వరూ చూపించని విధంగా చూపించాలనే ఉద్దేశ్యంతోనే దూకుడు కథ మొదలైంది. ఓ ఎమ్మెల్యేగా చూపిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలోంచే ఈ కథ పుట్టింది. ఆ త‌ర్వాతే పోలీస్ ఆఫీసర్ అజయ్, ఫిల్మ్ మేకర్ బళ్లారి బాబు ఇలా పాత్రలు వచ్చాయి. అయితే ఈ మూడు పాత్రలు కూడా నవ్విస్తుంటాయి. మూడు పాత్రలకు మూడు రకాల వేరియేషన్స్ కూడా పెట్టాం. మంచి టైమింగ్స్ అనుకున్నాం. నేను ఊహించిన‌దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ‌గా ఆ క్యారెక్ట‌ర్స్‌ను మ‌హేష్‌ పండించారు.

దూకుడు చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో మ‌హేష్‌బాబుతో మీ అనుబంధం గురించి?

- షూటింగ్ మొదటి రోజు నుంచే మేం ఇద్దరం ఎంతో కలిసిపోయాం. సినిమా పూర్తయ్యే సరికి మేం ఎంతో క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. ప్రతీ రోజూ ఎంతో ఎగ్జైట్, హైగా మాట్లాడేవారు. దూకుడు థీమ్ చాలా సీరియస్. కానీ అలాంటి థీమ్‌ను కూడా అంత ఎంటర్టైనింగ్‌గా చెప్పడంతోనే ఆ స్థాయికి వెళ్లింది.


దూకుడు అంటే బ్రహ్మానందం కామెడీ ఇప్పటికీ సోష‌ల్ మీడియా, మీమ్స్‌లో ట్రెండింగ్‌లోనే ఉంటుంది. దాని మీద అభిప్రాయం ఏంటి?

- ఆ ట్రాక్ కోసం ఎంతో కష్టపడ్డాం. పద్మశ్రీ అనే క్యారెక్టర్ పెట్టి, సపరేట్ ట్రాక్ పెట్టి చేశాం. ఇప్పటికీ అవి మీమ్స్‌లో ట్రెండ్ అవుతుంటాయి. ఇప్పటికీ ఆ సీన్లు ఎంతో ఫ్రెష్‌గా ఉంటాయి. ఇప్పుడు కూడా స్పెషల్ షోలు పెట్టారు. హౌస్ ఫుల్ అయ్యాయని అభిమానులు చెబుతున్నారు. దూకుడు సినిమాకు ఉన్న గౌరవం అదే.

పదేళ్ల తరువాత కూడా స్పెషల్ షోలు వేస్తే హౌస్ ఫుల్ అవుతోంది. దాని మీద అభిప్రాయం ఏంటి?

దూకుడు విడుద‌లై ప‌దేళ్లు అవుతున్న సంద‌ర్భంగా అభిమానులు స్పెషల్ షోలు ఏర్పాటు చేశారు. క‌రోనా సెకండ్ వేవ్ త‌ర్వాత థియేట‌ర్స్‌ ఫుల్ అవ్వడం అనేది మ‌ళ్లీ దూకుడు సినిమాకే జరుగుతోందని కొందరు ఫోన్ చేసి చెబుతున్నారు. దూకుడు సినిమా మీదున్న గౌరవం అదే. మనం కష్టపడి ఓ మంచి కథ, యూనిక్ స్క్రిప్ట్‌ను తీస్తే ఎప్పటికీ గుర్తుండిపోతోంది అని చెప్పడానికి దూకుడు ఉదాహరణగా నిలిచింది.

ఈ షోల ద్వారా సినిమాలు తీయండి.. థియేటర్‌లకు వచ్చేందుకు రెడీగా ఉన్నామని మహేష్ బాబు అభిమానులు నిర్మాతలకు భరోసా ఇస్తున్నారు. అది ఎలా అనిపిస్తుంది?

- కొన్ని సినిమాలు భగవంతుడు ఇచ్చిన బహుమతిలా మారుతాయి. అదే దూకుడు. ఇప్పటికీ ఆ సినిమా గురించి అలా మాట్లాడుకోవడం, ఇప్పటికీ రికార్డులు క్రియేట్ చేస్తుండటం ఎప్పటికీ మరిచిపోలేను.

ఈ ఇయ‌ర్ బర్త్ డే ప్లాన్స్ ఏంటి ?

- నేను ఎప్పుడూ కూడా బర్త్ డేను ప్రత్యేకంగా సెలెబ్రేట్ చేసుకోను. ఇంట్లోనే కుటుంబ సభ్యులు సెలెబ్రేట్ చేస్తారు. సింపుల్‌గానే జరుపుకుంటాను. ఎక్కడికి వెళ్లడం లేదు. ఇంట్లోనే ఉంటున్నాను.

కరోనా సమయంలో కొత్త కథలు ఏమైనా రాశారా?

- ఓ కథ రాశాం. కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. ఆ తరువాత మరో కథను రెడీ చేశాం. ఇప్పుడు మొత్తంగా మూడు స్క్రిప్ట్‌లు పూర్తయ్యాయి. నా కామెడీ టైమింగ్‌కు తగ్గ కథలను సెలెక్ట్ చేసుకోకపోవడం వల్ల కొన్ని చేదు ఫలితాలు వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం పక్కా లెక్కలతో వస్తున్నాను. అందులో భాగంగా డీ అండ్ డీ చేస్తున్నాను. నవంబర్ మొదటి వారంలో డీ అండ్ డీ ప్రారంభం అవుతుంది. మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా స్టార్ అయ్యాయి. డీ అండ్ డీ తరువాత మరో రెండు ప్రాజెక్ట్‌లు రెడీగా ఉన్నాయి.