Begin typing your search above and press return to search.

ఆస్కార్ జూరీలో బెజ‌వాడ‌ ట్యాలెంట్‌

By:  Tupaki Desk   |   3 July 2019 1:47 PM IST
ఆస్కార్ జూరీలో బెజ‌వాడ‌ ట్యాలెంట్‌
X
ఒక తెలుగు వాడు `అవ‌తార్` లాంటి సంచ‌ల‌నాల చిత్రానికి గ్రాఫిక్స్ డిపార్ట్ మెంట్ లో ప‌ని చేయ‌డంపై అప్ప‌ట్లో ఆస‌క్తిగా ముచ్చ‌టించుకున్నారు. ఆ త‌ర్వాత కూడా ఆంగ్ లీ తెర‌కెక్కించిన‌ `లైఫ్ ఆఫ్ పై` లాంటి ఆస్కార్ చిత్రానికి తెలుగు వాళ్లు ప‌ని చేయ‌డంపై ఆస‌క్తిగా ముచ్చ‌టించుకున్నారు. మ‌న ప్ర‌తిభ ఖండాంత‌రాల‌కు విస్త‌రించి ఉంది. విజువ‌ల్ ఎఫెక్ట్స్- గ్రాఫిక్స్ లాంటి కీల‌క విభాగాల్లో అత్యున్న‌త స్థితికి చేరుకున్న ప్ర‌తిభ మ‌న‌కు ఉంది. ఆ కోవ‌లో ప‌రిశీలిస్తే సౌత్ లో రిలీజైన 2.0.. రోబో.. బాహుబ‌లి వంటి భారీ చిత్రాల‌కు ప‌ని చేశారు శ్రీ‌నివాస్ మోహ‌న్. ఆయ‌న తెలుగువాడు. విజ‌య‌వాడ‌లో జ‌న్మించి వృత్తి రీత్యా చెన్న‌య్- హైద‌రాబాద్ ప‌రిశ్ర‌మ‌ల‌తో అనుబంధాన్ని కొన‌సాగిస్తున్నారు. ఇటు సౌత్ సినిమాల‌తో పాటు అంత‌ర్జాతీయ ప్రాజెక్టుల‌కు ప‌ని చేస్తున్నారు.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. అత‌డు అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన అకాడమీ అవార్డుల (ఆస్కార్) జ్యూరీ మెంబ‌ర్ గా చోటు ద‌క్కించుకోవ‌డం సంచ‌ల‌న‌మైంది. ఇండియా తరపున విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో శ్రీనివాస్ మోహన్ ఎంపికయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన 842 కొత్త సభ్యులని ఆస్కార్ క‌మిటీ ప్రకటించ‌గా.. ఇందులో ఇండియా నుంచి అనుపమ్ ఖేర్ తో పాటు ఆయ‌న ఎంపిక‌య్యారు. దక్షిణాది సినీ పరిశ్రమ గర్వించదగ్గ అరుదైన స‌న్నివేశం ఇద‌ని చెప్పొచ్చు. ముఖ్యంగా తెలుగు సినీప‌రిశ్ర‌మ‌తో ఎంతో అనుబంధం క‌లిగిన వ్య‌క్తిగా శ్రీ‌నివాస్ కి ఇక్క‌డ ఎంతో గౌర‌వం ఉంది. వంద‌ల కోట్ల వ‌సూళ్లు సాధించిన సినిమాల‌కు గ్రాఫిక్స్ ని డిజైన్ చేసిన స్పెష‌లిస్టుగా అత‌డిని అంతా ప్ర‌శంసిస్తారు. ఇండియా తరపున విజువల్ ఎఫెక్ట్స్ క్యాటగిరీలో జ్యూరీ సభ్యుడిగా ఎంపికైన సంద‌ర్భంగా అత‌డిని తెలుగు సినీప‌రిశ్ర‌మ స‌త్క‌రించి తీరాల‌ని ఆయ‌న అభిమానులు కోరుతున్నారు.

బాహుబలి- రోబో-2.0- క్రిష్- ఐ లాంటి చిత్రాల వెనుక శ్రీనివాస్ మోహన్ ప్ర‌తిభ‌.. అద్భుత‌ పనిత‌నం దాగి ఉంద‌ని అభిమానులు ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్ గా ఆయన ఎన్నో వండ‌ర్స్ చేశారు. బాహుబ‌లి త‌ర్వాత ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో తెరక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రానికి శ్రీ‌నివాస్ విజువల్ ఎఫెక్ట్స్ అందిస్తున్నారు. ఆయ‌న ఆస్కార్ జూరీకి ఎంపికవ్వ‌గానే ఆర్ఆర్ఆర్ టీం సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపింది.