Begin typing your search above and press return to search.

ఆ క్లాసిక్ ను చెడగొట్టాలని పిక్సయ్యారా?

By:  Tupaki Desk   |   19 April 2016 7:30 AM GMT
ఆ క్లాసిక్ ను చెడగొట్టాలని పిక్సయ్యారా?
X
కొన్ని విద్యలు కొందరికే సాధ్యమవుతాయి. అవి అందరికీ సాధ్యం కావు. ఒకప్పటి క్లాసిక్స్‌ ను ఈ ట్రెండుకు తగ్గట్లు రీమేక్ చేయడం.. సీక్వెల్స్ తీయడం.. టాలీవుడ్ కు అస్సలు అచ్చిరాలేదు. కొన్నేళ్ల కిందట ‘మరోచరిత్ర’ సినిమాను రీమేక్ చేస్తే అది ఎంత వరస్ట్ గా తయారైందో తెలిసిందే. ఒక క్లాసిక్‌ ను ఎంతగా చెడగొట్టాలో అంతగా చెడగొట్టారు అప్పుడు. ఓల్డ్ క్లాసిక్స్ ను ముట్టుకోవడం ఏమాత్రం మంచిది కాదని అందరికీ అప్పుడు బాగానే బోధపడింది. కానీ ఇప్పుడు మరో క్లాసిక్ మూవీని రీమేక్ చేయడానికి టాలీవుడ్లో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఆ సినిమా మరేదో కాదు.. పెళ్లి సందడి.

90ల్లో తెలుగులో వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీల్లో ఇదొకటి. శ్రీకాంత్‌ ఈ సినిమాతోనే హీరోగా నిలదొక్కుకున్నాడు. ఐతే ఈ చిత్రాన్ని ఇప్పుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా రీమేక్ చేయాలని చూస్తున్నారట. ఆల్రెడీ ‘రుద్రమదేవి’లో బాలనటుడిగా చేసిన రోషన్ ‘నిర్మలా కాన్వెంట్’ సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నాడు. ఆ తర్వాత రెండు మూడేళ్లు విరామం ఇచ్చి కొడుకుని పూర్తి స్థాయి హీరోగా అరంగేట్రం చేయించాలని చూస్తున్నాడు శ్రీకాంత్. ఐతే రోషన్ హీరోగా చేసే తొలి సినిమా ‘పెళ్లిసందడి’ రీమేక్ అయితే బాగుంటుందని ఇచ్చిన సలహాను శ్రీకాంత్ సీరియస్ గా తీసుకుని కొందరు దర్శకులతో చర్చలు జరుపుతున్నారట.

‘పెళ్లిసందడి’ అప్పటికి రిఫ్రెషింగ్ గా అనిపించి ఉండొచ్చు కానీ.. ఇప్పుడు అది పాత చింతకాయ పచ్చడిలా ఉంటుంది. అయినా అప్పటి ప్రేక్షకుల అభిరుచి వేరు.. ఇప్పటి వాళ్ల టేస్టు వేరు. కాబట్టి ‘పెళ్లిసందడి’ని రీమేక్ చేస్తే ఓ క్లాసిక్ ను చెడగొట్టినట్లు అవుతుంది తప్ప పెద్దగా ప్రయోజనం ఉండదేమో. అందులోనూ రీమేకులు.. సీక్వెల్స్ మనకు అచ్చిరావన్న చరిత్ర కూడా ఉంది. హీరోగా తొలి సినిమా అంటే జనాలు ఏదైనా కొత్తగా ఆశిస్తారు. పాత కథనే మళ్లీ చెబుతామంటేముందే ఆసక్తి సన్నగిల్లిపోతుంది. కాబట్టి ఆ క్లాసిక్ జోలికి వెళ్లకుండా కొత్త కథేదైనా ట్రై చేస్తే బెటరేమో.