Begin typing your search above and press return to search.

‘ఖడ్గం’లో శ్రీకాంత్‌ వద్దే వద్దన్నారట..

By:  Tupaki Desk   |   2 March 2018 5:00 AM IST
‘ఖడ్గం’లో శ్రీకాంత్‌ వద్దే వద్దన్నారట..
X
సీనియర్ హీరో శ్రీకాంత్ కెరీర్లో మరపురాని చిత్రాల్లో ‘ఖడ్గం’ ఒకటి. అప్పటిదాకా చాలా వరకు హీరోగా సాఫ్ట్ క్యారెక్టర్లే చేస్తూ వచ్చాడు శ్రీకాంత్. అలాంటివాడిని రఫ్ పోలీస్ క్యారెక్టర్లో చూపించి షాకిచ్చాడు కృష్ణవంశీ. ఐతే ఈ సినిమాలో శ్రీకాంత్ హీరోగా వద్దంటే వద్దని ఆ చిత్ర నిర్మాత సుంకర మధు మురళి పట్టుబట్టాడట. ఈ మాట దర్శకుడు కృష్ణవంశీకి.. హీరో శ్రీకాంత్‌ కు మొహం మీదే చెప్పాశాడట కూడా. కానీ కృష్ణవంశీ మాత్రం ఒప్పుకోలేదట. అవసరమైతే వేరే నిర్మాతలతో సినిమా చేస్తా కానీ శ్రీకాంత్ ను తప్పించే పనే లేదంటూ నిర్మాతతో గొడవకు కూడా దిగాడట. ఒక టీవీ కార్యక్రమంలో భాగంగా శ్రీకాంత్ ఈ విషయం వెల్లడించాడు.

‘‘కృష్ణవంశీ గారు ఒక రోజు కూర్చుని సబ్జెక్ట్ చెప్పారు. అప్పుడు నిర్మాత కృష్ణవంశీతో మాట్లాడుతూ నాకు ఫ్యామిలీ ఇమేజ్ ఉందని.. ఈ సినిమాలో ఎమోషనల్ పోలీసాఫీసర్ పాత్రకు నేను సరిపోనని.. నువ్వెలా ఇతణ్ని ఈ సినిమాకు తీసుకుంటున్నావని మొహమాటం లేకుండా అడిగేశాడు. కానీ నాపై తనకు నమ్మకం ఉందని.. ‘పాత బస్తీ’ సినిమా షూటింగ్ సందర్భంగా లైవ్లో నేను ఎమోషన్స్ పలికించే విధానం చూశానని కృష్ణవంశీ చెప్పాడు. తర్వాత నిర్మాత నా దగ్గరికి వచ్చి నువ్వీ పాత్రకు సరిపోవేమో చూసుకో అన్నారు. అన్నీ కుదిరితేనే చేస్తా అని చెప్పాను. నేను కాకుండా వేరే హీరో అయితే ఈ సినిమా మీద రెండు కోట్లు ఎక్కువగా బడ్జెట్ పెడతానని కూడా నిర్మాత అన్నాడు. ఐతే నువ్వు సినిమా చేయకు.. వేరే నిర్మాతలతో చేసుకుంటా అంటూ కృష్ణవంశీ కుండబద్దలు కొట్టేశాడు. ఆయన గట్స్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే’’ అని శ్రీకాంత్ చెప్పాడు.