Begin typing your search above and press return to search.

శివుడే బాలయ్య రూపంలో వచ్చాడనిపించింది: శ్రీకాంత్

By:  Tupaki Desk   |   10 Dec 2021 4:37 AM GMT
శివుడే బాలయ్య రూపంలో వచ్చాడనిపించింది: శ్రీకాంత్
X
ఫ్యామిలీ హీరోగా 100 సినిమాలను పూర్తి చేసిన శ్రీకాంత్, 'అఖండ' సినిమాలో ప్రతినాయకుడిగా నటించాడు. నిన్న రాత్రి జరిగిన ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ .. "వైజాగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నా సినిమాలు 'పీపుల్స్ ఎన్ కౌంటర్' .. 'మధురానగరిలో' షూటింగులు ఇక్కడే జరిగాయి. ఇక ఇప్పుడు 'అఖండ' సక్సెస్ మీట్ ఇక్కడ జరగడమనేది చాలా సంతోషంగా ఉంది. బోయపాటితో నాకు ఇది రెండవ సినిమా. 'సరైనోడు' తరువాత నేను ఆయనతో చేసిన సినిమా ఇది.

బాలకృష్ణగారి 'శ్రీరామరాజ్యం'లో లక్ష్మణుడిగా చేశాను. ఇక 'అఖండ'లో ఏ క్యారెక్టర్ ను చేశానో మీకు తెలుసు .. వరదరాజులు పాత్ర. ఈ పాత్ర ఇంత పవర్ఫుల్ గా వస్తుందని నేను ఉహించలేదు. బోయపాటిగారు ఈ పాత్రను చాలా గొప్పగా డిజైన్ చేయించారు. నా మీద నా కంటే ఆయనకే ఎక్కువ నమ్మకం ఉంది. డెఫినెట్ గా నువ్వు చేయగలవు అంటూ చేయించారు. బాలకృష్ణగారితో కలిసి నటించే అవకాశం రావడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. సెట్లో ఆయన చాలా సరదాగా ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ అదే ఎనర్జీతో ఉంటారు .. ఎక్కడా తగ్గదు.

సిన్సియారిటీ అనేది ఆయనను చూసి నేర్చుకోవాలి. ఇప్పటికీ కూడా ఆయన ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఆయనను చూసి మేము ఎనర్జీని తెచ్చుకుంటూ ఉంటాము. అమెరికా నుంచి అభిమానులు కాల్ చేసి మాట్లాడుతుంటే చాలా సంతోషంగా అనిపించింది. ఏ థియేటర్లో చూసినా 'జై బాలయ్య' అంటూ అరుస్తూనే ఉన్నారు. ఫ్యామిలీ హీరోగా చేస్తూ వచ్చిన నన్ను విలన్ పాత్రలో ఎంతవరకూ ఆదరిస్తారా అని అనుకున్నాను. కానీ ఈ సినిమా చూసిన తరువాత నాకు నమ్మకం వచ్చింది. అందుకు నేను బోయపాటిగారికి థ్యాంక్స్ చెబుతున్నాను.

తమన్ ఈ సినిమాకి ఎంతో హెల్ప్ అయ్యారు. ఈ సినిమా చూస్తున్నంత సేపు నాకు బాలకృష్ణగారు కనిపించలేదు. శివుడే బాలకృష్ణగారి రూపంలో వచ్చినట్టుగా నాకు అనిపించింది. ఇప్పటికి ఈ సినిమాను నేను నాలుగు సార్లు చూశాను .. ప్రతిసారి ఏదో తెలియని ట్రాన్స్ లోకి వెళ్లాను. మొత్తానికి అఖండ సినిమాలో ఏదో మేజిక్ ఉంది. ఈ సినిమా విజయానికి కారణమైన అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు.