Begin typing your search above and press return to search.

బ్రహ్మోత్సవం డైరెక్టర్ కొత్త సినిమా

By:  Tupaki Desk   |   14 Nov 2017 10:34 AM IST
బ్రహ్మోత్సవం డైరెక్టర్ కొత్త సినిమా
X
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అంటూ టైటిల్ తోనే అటు ఇండస్ట్రీని.. ఇటు జనాల్లోను విపరీతమైన క్యూరియాసిటీ కలిగించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఒకే సినిమాలో వెంకటేష్ ను.. మహేష్ బాబును నటింపచేసి.. సక్సెస్ కొట్టి టాలీవుడ్ లో మల్టీ స్టారర్ ట్రెండ్ కు ఆద్యం పోశాడు. ఆ తర్వాత బ్రహ్మోత్సవం అంటూ మళ్లీ మహేష్ బాబుతోనే సినిమా చేసి.. భారీ డిజాస్టర్ ను ఫేస్ చేశాడు ఈ దర్శకుడు.

అప్పటివరకూ మహేష్ కెరీర్ లోనే అతి పెద్ద ఫ్లాప్ ను జమ చేసి విమర్శల పాలైన శ్రీకాంత్ అడ్డాల.. ఇప్పుడు కొత్త సినిమా ప్రారంభించేందుకు సిద్ధమైపోతున్నాడు. బ్రహ్మోత్సవం తర్వాత సుదీర్ఘకాలం పాటు గ్యాప్ తీసుకున్న ఈ డైరెక్టర్.. గత ఆరు నెలలగా స్క్రిప్ట్ పై తెగ వర్క్ చేసేస్తున్నాడు. ఇప్పుడు స్టోరీ.. స్క్రిప్ట్.. ఓ కొలిక్కి రావడంతో.. మూవీ తీసేందుకు సిద్ధమవుతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని బడా బ్యానర్ పై నిర్మించనుండడమే విశేషం. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ను కలిసి.. స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకున్న శ్రీకాంత్ అడ్డాల.. అదే బ్యానర్ పై ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడట.

అందరూ కొత్త నటులు ఈ చిత్రంలో నటించే అవకాశం ఉండగా.. ఆసక్తికరమైన బ్యాక్ డ్రాప్ తో ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది. 2018 ఆరంభంలో శ్రీకాంత్ అడ్డాల కొత్త చిత్రం ప్రారంభమయ్యే అవకాశాలు ఉండగా.. త్వరలోనే పూజా కార్యక్రమాలు నిర్వహించి.. అధికారిక ప్రకటన చేయనున్నారట.