Begin typing your search above and press return to search.

‘మా’ ఎన్నికల కుట్రను బయటపెట్టిన శ్రీకాంత్

By:  Tupaki Desk   |   4 Oct 2021 8:31 AM GMT
‘మా’ ఎన్నికల కుట్రను బయటపెట్టిన శ్రీకాంత్
X
‘మా’ ఎన్నికలు కాకరేపుతున్నాయి. మాటల మంటలు చెలరేగుతున్నాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రధానంగా మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ వర్గాలు నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడుతున్నాయి. ‘మా’ అభివృద్ధి ప్రకాష్ రాజ్ వల్లే సాధ్యమవుతుందని నటుడు శ్రీకాంత్ అంటున్నారు.

మరికొన్ని రోజుల్లో జరుగనున్న ‘మా’ ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ వైఎస్ ప్రెసిడెంట్ పదవి కోసం ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి ఆయన పోటీచేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ‘శ్రీకాంత్’ ‘మా’ ఎన్నికలపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతమంది కావాలనే పరిశ్రమలో ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ‘మా’కు శాశ్వత భవన నిర్మాణం ప్రకాష్ రాజ్ వల్లే సాధ్యమవుతుందని తెలిపారు. ‘కొంతమంది కావాలనే సినిమా పరిశ్రమలో ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడుతున్నారన్నారు. తెలుగు వాళ్లకంటే మిగతా పరిశ్రమల్లో కూడా గౌరవం ఉందని వివరించారు.

అసోసియేషన్ కోసం ఎంత చేసినా మా మీద బురద జల్లుతున్నారని శ్రీకాంత్ ఆరోపించారు. అందుకే ఈసారి జరుగనున్న ‘మా’ ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకున్నానని వివరించారు. కానీ ఆరునెలల క్రితం ప్రకాష్ రాజ్ నన్ను కలిసి తన ప్రణాళిక వివరించారని.. ఆయన అడగడం వల్లే నేను ఈసారి బరిలోకి దిగానని శ్రీకాంత్ క్లారిటీ ఇచ్చారు.

ఇక గత ఎన్నికల్లో తాను ఓడిపోలేదని.. ఓడించారని శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓడిపోయిన చోటే కసితో పనిచేద్దామని నిర్ణయించుకున్నానన్నారు. ‘మా’కు శాశ్వత భవనం ఉండాలనేది అందరి కల అన్నారు. అది కేవలం ప్రకాష్ రాజ్ తోనే నెరవేరుతుందని శ్రీకాంత్ తెలిపారు.