Begin typing your search above and press return to search.

శ్రీ విష్ణు... రైల్వే రాజు అయ్యాడుగా!

By:  Tupaki Desk   |   4 Jan 2017 9:38 AM GMT
శ్రీ విష్ణు... రైల్వే రాజు అయ్యాడుగా!
X
తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌ను బాగానే అల‌రిస్తున్న *అప్ప‌ట్లో ఒక్క‌డున్నాడు* చిత్రం మూడు రోజులుగా కాసుల వ‌ర్షాన్ని కురిపిస్తోంది. చిత్రం దాదాపుగా స‌క్సెస్ అనే మాటే వినిపిస్తోంది. మూడు రోజుల క్రితం విడుద‌లైన ఈ చిత్రం గురించి ఇప్పుడెందుకంటారా?.. అక్క‌డికే వ‌స్తున్నాం. ఈ చిత్రంలో రైల్వే రాజుగా అయామ‌కుడి పాత్ర‌లో క‌నిపించిన కొత్త కుర్రాడు శ్రీ విష్ణు... త‌న న‌ట‌న‌తో జ‌నాన్ని మైమ‌ర‌పించాడ‌నే చెప్పాలి. గ్లోబ‌లైజేష‌న్‌ - న‌క్స‌లిజం త‌దిత‌ర అంశాల కార‌ణంగా 1990 ద‌శ‌కంలో దేశంలో నెల‌కొన్న గడ్డు ప‌రిస్థితుల‌ను ప్ర‌తిబింభిస్తూ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో శ్రీ విష్ణు... రైల్వే రాజుగా క‌నిపించాడు. ఈ ఒక్క చిత్రంతో దాదాపుగా అత‌డిని ఇక జ‌నాలంతా *రైల్వే రాజు*గా పిలుచుకుంటారేమో.

చిత్రం స‌క్సెస్ అయిన నేప‌థ్యంలో శ్రీ విష్ణు మీడియాతో మాట్లాడాడు. ఆ కామెంట్స్ అత‌డి మాట‌ల్లోనే... *అప్ప‌ట్లో ఒక్క‌డున్నాడు చిత్రం త‌ర్వాత నాకు అభినంద‌న మెసేజ్‌లు వెల్లువెత్తుతున్నాయి. గ‌డ‌చిన మూడు రోజులుగా ఇదే ప‌రిస్థితి. అభినందిస్తూ వ‌స్తున్న ఫోన్ కాల్స్‌ను రిసీవ్ చేసుకోవ‌డానికి చాలా టైమ్ స‌రిపోతోంది. ఈ చిత్రం వంద శాతం స‌క్సెస్ అవుతుంద‌ని ముందే అనుకున్నా. క‌థ సిద్ధం చేసుకునేందుకు మూడు నెల‌ల స‌మ‌యం స‌రిపోయినా... స్క్రిప్ట్‌, ప్రాజెక్టును పూర్తి చేసేందుకు మూడేళ్లు ప‌ట్టింది. డైరెక్ట‌ర్ సాగర్ కే చంద్ర‌తో క‌లిసి ఎన్ని ఫిల్మ్ ఆఫీసులు తిరిగామో లెక్కే లేదు. మా క‌ష్టాన్ని చూసిన నా స్నేహితుడు నారా రోహిత్ ఎంట్రీతో ఫిల్మ్ న‌గ‌ర్‌ - మ‌ణికొండ‌ల్లోని ఫిల్మ్ ఆఫీసుల చుట్టూ తిర‌గాల్సిన దుస్థితి త‌ప్పంది. సొంతంగా మ‌న‌మే తీద్దామంటూ నారా రోహిత్ ధైర్యం చెప్ప‌డ‌మే కాకుండా.. తెర‌కెక్కించేశాడు కూడా. నా తీర్పుపై రోహిత్‌ కు మంచి న‌మ్మ‌కం. నా నిర్ణ‌యం ఎప్పుడూ త‌ప్పు కాలేదు. బాహుబ‌లి స‌క్సెస్‌ ను అంచ‌నా వేయ‌డంలో మా స్నేహితులంద‌రిలో నాదే పైచేయి. ఈ విష‌యాన్ని బాగానే గుర్తుపెట్టుకున్న రోహిత్... అప్ప‌ట్లో ఒక్క‌డున్నాడు నిర్మాణాన్నంతా నాకే అప్ప‌గించాడు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయ‌డంలో కృష్ణ విజ‌య్‌ - ప్ర‌శాంతికి బాగా స‌హ‌క‌రించారు. డిఫ‌రెంట్ గా త‌యారు చేసుకున్న‌ మా స్క్రిప్ట్‌ పై నాకు న‌మ్మ‌క‌ముంది. రైల్వే రాజు పాత్ర కోసం గ‌డ‌చిన మూడేళ్ల‌లో చాలా అవ‌కాశాల‌నే వ‌దులుకోవాల్సి వ‌చ్చింది. టెండూల్క‌ర్‌ - ద్రావిడ్‌ ల ప్ర‌భావంతో క్రికెట‌ర్‌ గా రాణించాల‌ని భావించా. అయితే అది కుద‌ర‌లేదు. రైల్వే రాజు పాత్ర కోసం నేనేమీ ప్రిపేర్ కాలేదు. స్క్రిప్ట్ మొద‌లెట్టిన ద‌గ్గ‌ర నుంచి 90వ ద‌శ‌కం చివ‌రి నాటి ప‌రిస్థితుల‌ను అర్థం చేసుకుంటూ రైల్వే రాజు పాత్ర‌లో ఒదిగిపోయా. ఈ పాత్ర‌లో న‌టిస్తున్న‌ప్పుడు డైరెక్ట‌ర్ పెద్ద‌గా చెప్పిందేమీ లేదు. కొన్ని స‌ల‌హాలు మాత్ర‌మే ఇచ్చారు. ఇక నాకు నేనుగా ఆ పాత్ర‌కు మ‌రింత యాడ్ చేశాను. అప్ప‌ట్లో ఒక్క‌డున్నాడు... అయిపోయిందిగా. ఆ చిత్రం స్క్రిప్ట్ ద‌శ‌లోనే ఇంకో చిత్రాన్ని కూడా ప్లాన్ చేశాం. దానికి సంబంధించిన వివ‌రాల‌ను త్వ‌రలోనే వెల్ల‌డిస్తా. ఇకపై మ‌రిన్ని చిత్రాల్లోనూ క‌నిపిస్తా* అని శ్రీ విష్ణు చెప్పాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/