Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : ‘శ్రీ శ్రీ’

By:  Tupaki Desk   |   3 Jun 2016 4:22 PM GMT
మూవీ రివ్యూ : ‘శ్రీ శ్రీ’
X
చిత్రం: ‘శ్రీ శ్రీ’

నటీనటులు: కృష్ణ - విజయనిర్మల - నరేష్ - మురళీ శర్మ - పోసాని కృష్ణమురళి - సాయికుమార్ - పృథ్వీ తదితరులు
సంగీతం: ఈఎస్ మూర్తి
ఛాయాగ్రహణం: సతీష్ ముత్యాల
నిర్మాతలు: శ్రీ సాయిదీప్ చాట్ల - బాలు రెడ్డి-షేక్ సిరాజ్
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ముప్పలనేని శివ

350కి పైగా సినిమాలు చేసిన కథానాయకుడు సూపర్ స్టార్ కృష్ణ. 60 ఏళ్ల వయసులోనూ అలుపు సొలుపు లేకుండా సినిమాలు చేసిన కృష్ణ దాదాపు దశాబ్దం నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఒకటీ అరా క్యారెక్టర్ రోల్స్ చేయడం తప్ప కథానాయకుడిగా సినిమాలు చేయలేదు. ఐతే సుదీర్ఘ విరామం తర్వాత ఆయన మళ్లీ కథానాయకుడిగా మారి ‘శ్రీ శ్రీ’ అనే సినిమా చేశారు. ఓ మరాఠీ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సీనియర్ డైరెక్టర్ ముప్పలనేని శివ దర్శకత్వం వహించాడు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన సూపర్ స్టార్ రీఎంట్రీ మూవీ విశేషాలేంటో చూద్దాం.

కథ:

శ్రీపాద శ్రీనివాసరావు ఉరఫ్ శ్రీశ్రీ (కృష్ణ) విశాఖపట్నంలో పేరుమోసిన లా ప్రొఫెసర్. ఓ టీవీ ఛానెల్లో ప్రోగ్రాం డైరెక్టర్ గా పని చేసే శ్రీశ్రీ కూతురు శ్వేత ఓ గిరిజన ప్రాంతాన్ని కాలుష్యంలో ముంచెత్తుతూ.. అక్కడి జనాల ప్రాణాలతో ఆడుకుంటున్న జేకే ఇండస్ట్రీస్ అనే సంస్థకు వ్యతిరేకంగా ఓ డాక్యుమెంటరీ రూపొందిస్తుంది. దీంతో ఆ ఇండస్ట్రీ అధినేత కొడుకు.. ఇంకో ఇద్దరు కుర్రాళ్లు కలిసి ఆమెను తన ఆఫీస్ లోనే దారుణంగా చంపేస్తారు. ఆ సందర్భంలో ఏం చేయలేక నిస్సహాయుడిగా మారిపోయిన శ్రీశ్రీ.. తన కూతుర్ని చంపిన వాళ్ల మీద కోర్టులో పోరాటం మొదలుపెడతాడు. కానీ అక్కడ ఆయనకు న్యాయం జరగదు. కోర్టులో ఓడిపోయిన శ్రీశ్రీ తన కూతుర్ని చంపిన వాళ్లపై ఎలా పగ తీర్చుకున్నాడన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

సూపర్ స్టార్ హీరోగా నటించిన చివరి సినిమా ఏదంటే ఆయన వీరాభిమానులు కూడా సమాధానం చెప్పలేరేమో. పోనీ ఆయన హీరోగా నటించిన చివరి హిట్ మూవీ ఏదన్నా కూడా తడుముకోవాల్సిందే. తన కెరీర్ చివర్లో చెత్త చెత్త సినిమాలు చేసి తనకున్న క్రేజ్ పూర్తిగా పోగొట్టుకున్నాడు సూపర్ స్టార్. ఇలా కెరీర్ ముగించడం ఇష్టం లేక.. చివరగా ఇంకో గుర్తుండిపోయే సినిమా ఏదైనా చేసి సినిమాల నుంచి పూర్తిగా రిటైరవ్వాలని కృష్ణ నిర్ణయించుకున్నారు కాబోలు. మహేష్ బాబు వాయిస్ ఓవర్ చెప్పడం.. సుధీర్ బాబు క్యామియో రోల్ చేయడం.. విజయనిర్మల-నరేష్ ముఖ్యమైన పాత్రలు చేయడం.. ఇదంతా చూస్తే సూపర్ స్టార్ ఫ్యామిలీ ‘శ్రీ శ్రీ’ ఓ మధుర జ్నాపకంగా మలుచుకోవాలని భావించినట్లుంది. కానీ దురదృష్ణవశాత్తూ ‘శ్రీ శ్రీ’ అలా గుర్తుంచుకోద‌గ్గ సినిమా కాలేక‌పోయింది. సూపర్ స్టార్ ను మళ్లీ తెరమీద చూసుకుని మురిసిపోదాం అనుకునే వీరాభిమానులకు సంతోషాన్నిస్తే ఇవ్వొచ్చు కానీ.. సగటు ప్రేక్షకుడికి మాత్రం ‘శ్రీ శ్రీ’తో క‌ష్ట‌మే.

శ్రీ శ్రీ అనే టైటిల్ చూసి.. సూపర్ స్టార్ ను సరికొత్త గెటప్ లో చూసి.. ‘‘రివెంజ్ నెవర్ గెట్స్ ఓల్డ్’’.. అంటూ ఈ సినిమా గురించి చేసిన ప్రచారం చూసి.. సినిమా ఏమైనా కొత్తగా ఉంటుందేమో అని భ్రమలు పెట్టుకుని ఉంటే.. సినిమా మొదలైన పావు గంటకే అవి తొలగిపోతాయి. ముప్పలనేని శివ 90ల నాటి దర్శకుడైనా.. నరేషన్ విషయంలో ఇంకా వెనక్కి వెళ్లిపోయాడు. 70లు.. 80ల్లో కోర్టుల్లో వాదోపవాదాల నేపథ్యంలో సన్నివేశాలు తీయడంపై మహా క్రేజ్ ఉండేది. అప్పటికి ఆ సన్నివేశాలు రసవత్తరంగా అనిపించాయి కానీ.. ఇప్పుడైతే సిల్లీగా అనిపిస్తాయి. ఐతే ‘శ్రీ శ్రీ’లో సుదీర్ఘంగా సాగే కోర్టు సన్నివేశాలు అప్పటి సినిమాల్నే తలపిస్తాయి.

విలన్లంతా గ్యాలరీలో కూర్చుని కన్నింగ్ నవ్వులు నవ్వుతుంటే వాళ్ల తరఫు లాయర్.. సాక్షుల్ని ఒక్కొక్కరిగా ప్రవేశపెట్టి వాళ్లని తికమకపెట్టి కేసు నీరుగారిపోయేలా చేస్తుంటే జడ్జి ఒక్కో పాయింట్ నోట్ చేసుకోవడం.. మధ్యలో అవతలి లాయర్ ‘ఐ అబ్జక్షన్ యువరానర్’ అంటూ అభ్యంతరం చెప్పడం.. దానికి విలన్ల లాయర్ ఏదో సమాధానం చెప్పడం.. జడ్జీ ‘అబ్జక్షన్ ఓవర్ రూల్డ్’ అనడం.. చివరికి కేసు వీగిపోయి విలన్లు జబ్బలు చరుచుకోవడం.. హీరో నిట్టూర్పుతో బోను దిగడం... ఇలా ఓ పద్ధతి ప్రకారం సా....గుతుంది ‘శ్రీ శ్రీ’లో వ్యవహారం.

ఇక హీరో విలన్ గ్యాంగులో ఒక్కొక్కర్ని చంపుకుంటూ పోవడంలో ఏమైనా సస్పెన్స్ ఉందా అంటే అదేం లేదు. ఈ సీక్వెన్స్ అంతా కూడా చాలా ప్లెయిన్ గా సాగిపోతుంది. హీరో హత్యలు చేయడం మొదలుపెట్టాక సాగే పోలీసు ‘విచారణ’ తంతు చూస్తే మనం ఓ అర శతాబ్దమైనా వెనక్కి వెళ్లిపోయామేమో అనిపిస్తుంది. ఒక హత్య జరగ్గానే ఓ పోలీస్ ఇది అండర్ వరల్డ్ పనేమో సార్ అనడం.. దానికి ఏసీపీ ‘నో.. ఇది ప్రి పాన్డ్ మర్డర్.. హంతకువడెవరో కానీ పక్కాగా ప్లాన్ చేసి చంపాడు’ అంటూ స్టీరియో టైపు డైలాగులు చెబుతుంటే అప్పటికే ఫ్రస్టేట్ అవడం మానేసి సినిమాను ఇంకో రకంగా ఎంజాయ్ చేయడం మొదలుపెట్టేసి ఉంటాం.

కృష్ణకు మేకప్ అయితే బాగానే వేశారు కానీ.. ఆయన ఈ వయసులో ఉత్సాహంగా నటించడానికి మాత్రం ఓపిక మాత్రం లేకపోయింది. చాలా డల్ గా కదులుతూ.. నీరసంగా మాట్లాడుతున్న కృష్ణను చూసి ఆయన వీరాభిమానులు కూడా ఏమాత్రం ఎంజాయ్ చేస్తారో అనిపిస్తుంది. ఐతే వాళ్లకు ఆ మాత్రం ఆనందం మిగల్చకుండా ద్వితీయార్దంలో చాలా వరకు ఆయన పాత్రను కనిపించకుండా చేసేసి.. కూతురు చనిపోవడానికి ముందు ఆమె ఎంతో సాహసంతో చేసిన డాక్యుమెంటరీకి సంబంధించి ‘సుత్తి’ ఫ్లాష్ బ్యాక్ తో విసిగించాడు దర్శకుడు ఆఖర్లో మహేష్ బాబు వాయిస్ వినిపిస్తారు. క్యామియో రోల్ లో సుధీర్ బాబును చూపిస్తారు. చివరిదాకా థియేటర్లో కూర్చుకున్నందుకు ప్రేక్షకులకు అవి బహుమతులుగా భావించాలేమో. అస‌లు విష‌యం బాగుంటే ఇలాంటివి అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌లు అవుతాయి కానీ.. శ్రీశ్రీలో అదే లేదు కాబ‌ట్టి ఇక ఈ ఆక‌ర్ష‌ణ‌ల గురించి చెప్పుకోవ‌డానికేమీ లేదు.

నటీనటులు:

పైనే చెప్పుకున్నట్లు కృష్ణ గెటప్ మాత్రమే బాగుంది. 90ల్లో కంటే కూడా ఈ సినిమాలో బాగా కనిపించారు. ఆయ‌నకీ పాత్ర కూడా కొత్త‌గానే అనిపిస్తుంది. ఐతే నటన పరంగా చెప్పడానికి ఏమీ లేదు. కేవలం ఆయన తెరమీద కనిపించారు అంతే అని చెప్పాలి. విజయనిర్మల పర్వాలేదు. నరేష్ కాంబినేషన్లో వచ్చే సన్నివేశంలో బాగా చేశారు. సాయికుమార్ అవసరానికి మించి ఆవేశంగా నటించాడు. కృష్ణ కూతురిగా నటించిన అమ్మాయి ఓవరాక్షన్ చేసింది. నరేష్ నటన కూడా ఆకట్టుకోలేదు. అందుకు పేలవమైన తన పాత్రే ప్రధాన కారణం. అందర్లోకి విలన్లుగా చేసిన పోసాని.. మురళీ శర్మ పర్వాలేదు.

సాంకేతిక వర్గం:

టెక్నికల్ గా ‘శ్రీ శ్రీ’ చాలా వీక్. ఈఎస్ మూర్తి సంగీతం.. సతీష్ ముత్యాల ఛాయాగ్రహణం సినిమా స్థాయికి తగ్గట్లే ఉన్నాయి. సినిమా ఆరంభంలో వచ్చే పాట ఎప్పుడు అయిపోతుందా అన్నట్లుంటుంది. నేపథ్య సంగీతం చాలా ‘పాత’గా అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ గురించి చెప్పడానికేమీ లేదు. ఏదో అలా చుట్టేద్దామన్నట్లే ఉన్నాయి చాలా స‌న్నివేశాలు. డైలాగులు చాలా డ్రమటిగ్గా ఉన్నాయి. ముప్పలనేని శివ దర్శకత్వం గురించి మాట్లాడ్డానికేమీ లేదు. ఆయన ఔట్ డేట్ అయిపోయాడు అనడానికి ‘శ్రీ శ్రీ’ సినిమా బెస్ట్ ఎగ్జాంపుల్.

చివరగా: శ్రీ శ్రీ.. ఓల్డ్ వైన్ ఇన్ ద ఓల్డ్ బాటిల్

రేటింగ్- 1.5/5