Begin typing your search above and press return to search.

'కార్తికేయ 2'కి కలిసొచ్చిన శ్రీకృష్ణ జన్మాష్టమి!

By:  Tupaki Desk   |   18 Aug 2022 10:37 AM GMT
కార్తికేయ 2కి కలిసొచ్చిన శ్రీకృష్ణ జన్మాష్టమి!
X
నిఖిల్ - చందూ మొండేటి కాంబినేషన్లో రూపొందిన 'కార్తికేయ 2' ఈ నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించిన ఈ సినిమాకి, కాలభైరవ సంగీతాన్ని సమకూర్చాడు. తెలుగు రాష్ట్రాలతో పాటు బాలీవుడ్ లోను ఈ సినిమా దూసుకుపోతోంది. 3 రోజుల్లోనే అక్కడ ఈ సినిమాకి 700 థియేటర్లు దక్కడం విశేషం. ఇక్కడ కూడా ఈ సినిమాకి థియేటర్ల సంఖ్య పెరుగుతూ వెళుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ ను బిత్తిరిసత్తి ఇంటర్వ్యూ చేశాడు.

నిఖిల్ మాట్లాడుతూ .. ఈ సినిమాకి వస్తున్న విశేషమైన స్పందన చూస్తుంటే ఎంతో ఆనందం కలుగుతోంది. ఒక చోట టిక్కెట్లు దొరక్కపోతే మరో చోటుకి వెళ్లి మరీ జనాలు ఈ సినిమాను చూస్తున్నారు. రేపు 'శ్రీకృష్ణ జన్మాష్టమి' కావడం వలన బాలీవుడ్ లో ఈ సినిమాకి మరిన్ని థియేటర్లు ఇస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఇది కృష్ణుడికి సంబంధించిన సినిమా కావడం వలన ఆ రోజున భారీ వసూళ్లను రాబట్టడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఆ రోజున థియేటర్ల దగ్గర సందడి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మా సినిమాకి 'శ్రీకృష్ణ జన్మాష్టమి' కలిసి రావడం కూడా ఆ స్వామి నిర్ణయమే.

ఈ సినిమాలో యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ ఉన్నాయి. భక్తి అనేది కూడా ఈ సినిమాలో ఒక భాగంగా కనిపిస్తుంది.ఇక ఈ సినిమాకి మూడో భాగం కూడా ఉంది. ఆ విషయాన్ని మనం చివరలో చూపించాం కూడా.

అట్లాంటిక్ సముద్రం నేపథ్యంలో ఆ కథ నడుస్తుంది. 3వ భాగంలో కూడా అనుపమనే ఉంటుంది. కార్తికేయ కథను ఇటు సైన్స్ .. అటు దైవత్వం అనే రెండు కోణాల్లో ఆవిష్కరించడం ఆడియన్స్ కి కొత్తగా అనిపించింది. కొత్తగా మేము చేసిన ఆ ప్రయత్నమే ఈ రోజున ఈ సినిమా ఈ స్థాయిలో విజయవంతం కావడానికి కారణమైంది.

ఈ సినిమాలో మునులు .. రుషులకు మించిన సైంటిస్ట్ లు ఎవరున్నారు అనే ఒక డైలాగ్ ఉంది. ఈ సినిమా కోసం జరిపిన అన్వేషణలో మాకు అదే అనిపించింది. దానినే సినిమాలో పెట్టాము. ద్వారకలో ఐదువేల ఏళ్ల క్రితం కృష్ణుడి మనవడు ఆయనకి కట్టిన గుడి చూసి మేము ఆశ్చర్యపోయాము. ద్వారకలో ఇలాంటి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. వాటిని సినిమాటిక్ గా తెరపై చూపించడానికి మేము ట్రై చేశాము. ఈ సినిమా హిట్ అవుతుందని అనుకున్నాముగానీ, ఈ స్థాయిలో జనంలోకి వెళుతుందని మాత్రం ఊహించలేదు" అంటూ చెప్పుకొచ్చాడు.