Begin typing your search above and press return to search.

నాగచైతన్య సరసన శ్రీకారం బ్యూటీ..?

By:  Tupaki Desk   |   28 May 2021 4:30 AM GMT
నాగచైతన్య సరసన శ్రీకారం బ్యూటీ..?
X
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కథానాయకుడుగా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో బంగార్రాజు అనే సినిమా రాబోతుంది. వీరి ఫస్ట్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ సోగ్గాడే చిన్నినాయన. 2016లో విడుదలైన ఆ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఆ సినిమా తర్వాత మళ్లీ ఆ రేంజి హిట్ అందుకోలేకపోయాడు కింగ్ నాగ్. అయితే సోగ్గాడే చిన్నినాయన సినిమా విడుదలై హిట్టు కొట్టిన వెంటనే నాగార్జున డైరెక్టర్ కళ్యాణ్ కలిసి దీనికి సీక్వెల్ కూడా ఉంటుందని ప్రకటించారు. అంతేగాక సీక్వెల్ కు బంగార్రాజు అనే టైటిల్ కూడా ఖరారు చేసేసారు. ఇందులో నాగార్జున పోషించే పాత్ర బంగార్రాజు. అయితే ఎందుకో గాని అనేక కారణాల వలన బంగార్రాజు ఇంతవరకు ప్రారంభం కాలేదు.

ఈ గ్యాప్ లో డైరెక్టర్ కళ్యాణ్ రారండోయ్ వేడుక చేద్దాం, నేలటికెట్టు సినిమాలు చేసాడు కానీ పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే బంగార్రాజు మూవీ గతేడాది ఉగాదికే ప్రారంభం కావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లేందుకు సర్వం సిద్ధంగా ఉందట. నిజానికి బంగార్రాజు స్క్రిప్ట్ గురించి డైరెక్టర్ కళ్యాణ్ ఏడాదిన్నర కాలంగా కష్టపడుతున్నాడు. అలాగే సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసాడట. కింగ్ నాగ్ ఇటీవలే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'వైల్డ్ డాగ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా థియేట్రికల్ గా ఆదరణ పొందలేకపోయింది కానీ ఓటిటిలో మాత్రం సూపర్ సక్సెస్ అయింది. అయితే వైల్డ్ డాగ్ మూవీ చివరి దశలో ఉన్నపుడే నాగ్ తదుపరి సినిమాలను ప్రకటించేసాడు. అయితే ప్రస్తుతం నాగ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత బంగార్రాజు పట్టాలెక్కే అవకాశం ఉంది.

అయితే బంగార్రాజు మూవీ మొదలైతే గనక వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలనీ డైరెక్టర్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో నాగ్ తో పాటుగా నాగచైతన్య కూడా ఓ కీలకపాత్ర పోషించనున్నాడు. ఇప్పుడు చైతూ పాత్రకు ఓ జోడి కూడా ఉంటుందని టాక్. అయితే ప్రస్తుతం కుర్రహీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ పేరు బాగా వినిపిస్తుంది. ఇప్పటికే అమ్మడితో చర్చలు జరిపారట. ఇదిలా ఉండగా.. బంగార్రాజు షూటింగ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారో అంటూ అక్కినేని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా నాగ్ సొంత బ్యానర్ లో తెరకెక్కనుంది. త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తుంది.